హిచ్‌కాక్ మెచ్చిన కథలు
మొదటి కథకి ఇంట్రో
సుమారు 60 ఏళ్ల క్రితం ‘ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రెజెంట్స్’ అనే వీక్లీ టీవీ సిరీస్‌ని అమెరికాలోని సిబిఎస్; ఎన్‌బిసి టివి ఛానెల్స్ కోసం హిచ్‌కాక్ తీశాడు. అరగంట (కొన్ని గంట) సాగే, ఏ వారానికి ఆ వారం పూర్తయ్యే క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని పదేళ్లపాటు, అంటే పది సీజన్స్‌లో మొత్తం 360 ఎపిసోడ్స్‌ని నిర్మించి ప్రసారం చేశాడు. వీటిలో కేవలం 18 ఎపిసోడ్స్‌కే హిచ్‌కాక్ దర్శకత్వం వహించాడు. మిగిలిన వాటికి ఆయన పర్యవేక్షణలో ఇతరులు దర్శకత్వం చేశారు. ఈ సిరీస్ ఆలోచన వచ్చిన మూవీ మొఘల్, మ్యూజిక్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు, స్టూడియో అధినేత అయిన ల్యూ వాసర్‌మేన్ హిచ్‌కాక్‌కి వంద కథలు ఇస్తే, వాటిలోంచి నలభైని ఎన్నిక చేసి మొదటి సీజన్‌కి వాటిలోని 39ని వాడాడు.
ప్రతీ ఎపిసోడ్ మొదట్లో హిచ్‌కాక్ తెర మీద కనపడి ఆ కథని క్లుప్తంగా పరిచయం చేసి, చివర్లో ముగింపు మాటలు చెప్తాడు. ఇవన్నీ వ్యంగ్య హాస్యాలతో ప్రేక్షకులకి గిలిగింతలు పెడతాయి. మొదటి సీజన్ ఎపిసోడ్స్‌లో హిచ్‌కాక్ టీవీ స్పాన్సరర్స్ మీద వ్యంగ్యాస్త్రాలని గుప్పించాడు. ఈ అమెరికన్ తరహా హాస్యం యూరోపియన్లకి రుచించక పోవటంతో, వారి భాషల్లోకి ఇవి డబ్ అయినప్పుడు వీటిని తొలగించారు.
కొన్ని కథల్లో నేరస్థుడు చట్టానికి దొరకడు. నిజ జీవితంలో అలా దొరక్కపోవడం సహజమే అని హిచ్‌కాక్ చెప్పినా స్పాన్సరర్స్ దాంతో ఏకీభవించలేదు. అలాంటి ఎపిసోడ్స్ చివర్లో, ‘పోలీసులు మూడు వారాల తర్వాత అతణ్ణి అరెస్టు చేశారు’ లాంటి ముగింపులని హిచ్‌కాక్ చెప్పేవాడు. దాంతో అంతా తృప్తి చెందారు.
దురదృష్టవశాత్తూ, ఈ సిరీస్‌కి నామినేషన్స్ లభించినా అవార్డులు రాలేదు. వీటిలో నటించిన జేమ్స్ స్టివార్ట్, హెన్రీ ఫోండా, స్టీవ్ మెక్విన్, పాల్ న్యూమేన్ లాంటి కొందరు తర్వాత సినిమాల్లో హీరోలుగా రాణించారు.
2 అక్టోబర్ 1955న ఆదివారం రాత్రి 9.30 నించి 10.00 దాకా టెలికాస్ట్ అయిన మొదటి ఎపిసోడ్ ‘రివెంజ్’ కథని ఈ వారం చదువబోతున్నారు. ఆఖరికి ‘ఆఫ్ సీజన్’. అక్టోబర్ 5, 1965, సోమవారం రాత్రి 10 నుంచి 11 దాకా ప్రసారమైంది.
ఈ సిరీస్‌లోని అత్యుత్తమమైన కథలని మీరు ఈ శీర్షిక కింద చదవబోతున్నారు.
-అనువాదకుడు
* * *
అది అమెరికాలోని మొబైల్ హోమ్స్ పార్క్. అందులో తక్కువ ఆదాయం గల వాళ్లు మొబైల్ హోమ్‌ని కొంత రుసుము చెల్లించి పార్క్ చేసుకుంటారు. వారికి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్స్‌ని ఆ పార్క్ అందజేస్తుంది.
ఆ పార్క్‌లోని ఓ మొబైల్ హోమ్‌లో ఆ ఉదయం ఆరు గంటలకి అలారం మోగింది. బద్ధకంగా దాన్ని ఆపిన ముప్పై ఏళ్ల సామ్ లేచి పక్కనే ఉన్న తన భార్య ఎల్సా నిద్రపోవడం గమనించాడు. ఫ్రిజ్‌లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి రెండు గ్లాసుల్లో పోసి వచ్చి భార్యని నిద్ర లేపాడు.
‘మొదటి వారం మొబైల్ హోంలో జీవితం ఎలా ఉంది?’ సామ్ నవ్వుతూ అడిగాడు.
‘బావుంది’ ఎల్సా చెప్పి లేచింది.
ఇద్దరూ వంట గదిలోకి వచ్చారు. అప్పటికే అతను ఓ ఆమ్లెట్‌ని స్టవ్ మీద పెట్టి వచ్చాడు.
‘మంచి వాసన వస్తోంది’ ఆమె చెప్పింది. తర్వాత చెప్పింది.
‘నువ్వు ఆఫీస్‌కి వెళ్లాక నాకు వొంటరితనంతో విసుగు పుడుతోంది’
‘ఈ చుట్టుపక్కల మనుషుల గురించి నాకు తెలీదు’ సామ్ చెప్పాడు.
‘చెప్పనా? వారంతా దయగా, స్నేహపూర్వకంగా ఉంటూ, ఎవరికైనా సహాయం అవసరమైతే చేయడానికి ముందుకి వస్తారు. ఇక్కడి వాళ్లంతా మంచివాళ్లు’
‘నువ్వు రోజుకి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేస్తే మంచి బేలరీనావి అవగలవు. రోజంతా ఏం చేస్తున్నావు?’
‘డాక్టర్ చెప్పినట్లుగా కొంతసేపు బీచ్‌లో నడుస్తాను. తరువాత రెసిపీ పుస్తకాలని చదువుతాను. కొత్త భర్తకి కొత్త వంటకాలని వండాలని’ చిలిపిగా నవ్వుతూ ఎల్సా చెప్పింది.
‘టైమైంది. నేను బయలుదేరాలి’ బ్రేక్‌ఫాస్ట్ ముగించి సామ్ బయటికి వచ్చాడు.
‘సరే. తిరిగి వచ్చాక మీకో సర్‌ప్రైజ్’ సామ్‌ని ప్రేమగా చుంబించి అతను బయటకు వెళ్లాక తలుపు మూసుకుంది.
సామ్ మొబైల్ హోం బయట పార్క్ చేసి ఉన్న ఓపెన్ టాప్ కార్ ఎక్కి వెళ్తూ పక్క మొబైల్ ఇంటి ఆవరణలోని మొక్కలకి నీళ్లు పోస్తున్న ముసలావిడని పలకరించాడు.
‘గుడ్మార్నింగ్ మిసెస్ ఫెర్గుసన్’
‘హలో గుడ్మార్నింగ్ మిస్టర్ సామ్. ఆఫీస్‌కి ఇవాళ త్వరగా వెళ్తున్నారే’ అడిగింది.
‘ట్రాఫిక్ వల్ల వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో ఇంకా అర్థం కాలేదు. పార్కింగ్ కూడా దొరకడం లేదు. అందుకని ముందే బయలుదేరాను’
‘మీరు వెళ్లినప్పుడు మీ ఆవిడని, మీ ఇంటిని ఓ కంట కనిపెట్టి ఉంటాను’
‘్థంక్స్’
‘లంచ్ తర్వాత నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. వస్తానంటే మీ ఆవిడనీ తీసుకు వెళ్తాను’
‘నో థాంక్స్. మధ్యాహ్నం నేను వస్తూ పచారీ సామాను తెస్తాను. మీకు టైం ఉంటే మా ఇంటికి వెళ్లండి. తనకి వొంటరితనంతో విసుగ్గా ఉంది. టైమవుతోంది. వెళ్తాను’
* * *
ఎల్సా ఇంట్లో పని చేసుకుంటూంటే, తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. ‘హలో’ అన్న మిసెస్ ఫెర్గుసన్ మాట విని తలుపు తెరిచింది.
‘సారీ మిసెస్ ఫెర్గుసన్. వంట గది చిందరవందరగా ఉన్నందుకు ఏమీ అనుకోకండి. కేక్ చేస్తున్నాను. మీకు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వనా?’ ఫ్రిజ్ తలుపు తెరుస్తూ అడిగింది.
‘సగం గ్లాస్ చాలు. మీరు, మీ భర్త కాలిఫోర్నియాకి ఎందుకు వచ్చారు? మీ ఆరోగ్యం గురించా?’
‘అవును. నేను తీవ్రమైన మానసిక వత్తిడికి గురయ్యాను. మా డాక్టర్ నేను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, సముద్ర తీరానికి వెళ్లమని సలహా ఇవ్వడంతో ఇక్కడికి వచ్చాం. నా భర్త ఇంజనీర్. ఆయన పనిచేసే ఆఫీస్ ఫ్యాక్టరీ అదృష్టవశాత్తూ ఇక్కడ ఉండటంతో ఇక్కడికి బదిలీ చేయించుకున్నాం’
‘మీరు బాగా కోలుకున్నట్లున్నారు. చూడడానికి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు’ మిసెస్ ఫెర్గుసన్ చెప్పింది.
‘శారీరక ఇబ్బందులు ఏం లేవు. నేను బేలరీనాని. దానికి సంబంధించిన నర్వస్ బ్రేక్‌డౌన్ లాంటిదేదో జరిగింది’
‘ఈ సముద్రం సాంత్వనని ఇస్తుంది. సముద్రపు హోరు వినడానికి సొంపుగా ఉంటుంది’
‘నిజమే. నేను ఈ శబ్దాన్ని ఇష్టపడుతున్నాను’
‘మార్కెట్‌కి వెళ్తున్నాను. నాతో వస్తారా?’
‘నేను కేక్ చేస్తున్నాను కదా? మా వారికి నేను కేక్ వండగలనని తెలీదు. ఆయన్ని సర్‌ప్రైజ్ చేద్దామని’
‘సరే. నేను వెళ్తాను. ఇంకోసారి మార్కెట్‌కి వెళ్లినప్పుడు మీకు చెప్తాను’
‘తప్పకుండా’ ఇద్దరూ మొబైల్ హోంలోంచి బయటికి వచ్చారు.
‘నేను సన్ బాత్ తీసుకుంటాను’ చెప్పి ఎల్సా తన వొంటి మీది షర్ట్‌ని విప్పేసింది. లోపల పేంటీ, బ్రా మాత్రమే ఉన్నాయి.
‘మీరు బేలరీనా అని ఇప్పుడు నమ్ముతున్నాను’ ఆమె వొంపుల శరీరం చూసి మిసెస్ ఫెర్గుసన్ కామెంట్ చేసింది.
‘ఓ! థాంక్ యూ’
నల్ల కళ్లజోడు పెట్టుకుని ఎల్సా రిలాక్స్ అవసాగింది.
* * *
మధ్యాహ్నం సామ్ ఫ్యాక్టరీ నించి ఇంటికి వచ్చాడు. కారుని బయట ఆపి, వెనక సీట్లోని మూడు బ్రౌన్ రంగు కాగితం కవర్లని తీసుకుని దిగి గట్టిగా అరిచాడు.
‘ఎల్సా’
మళ్లీ పిలిచి కొద్దిక్షణాలు వేచి ఉన్నాక తలుపు తోయగానే తెరుచుకుని లోపల నించి పొగ బయటికి వచ్చింది. రేడియోలోంచి గట్టిగా సంగీతం వినిపిస్తోంది. అతను రేడియోని ఆఫ్ చేసి చూస్తే ఓవెన్ లోంచి పొగ రావడం గమనించాడు. దాని మూత తెరిచి లోపలి కేక్‌ని తీసి బయట పారేశాడు. బెడ్‌రూం తలుపు తెరచుకుని లోపలకి వెళ్లాడు. నేల మీద నగ్నంగా, అచేతనంగా కళ్లు తెరిచి చూస్తూ పడి ఉన్న భార్యని చూసి అడిగాడు.
‘ఎల్సా! ఏమైంది?’
ఆమె అపస్మారకంగా ఉంది. ఆమెని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె ఎడమ చేతి గుప్పెటలో ఏదో కనపడటంతో గుప్పెటని విప్పతీస్తే గులాబీ పువ్వు కనిపించింది. ఆమె ఒంటి మీది దుప్పటిని కప్పి తలుపు దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచాడు.
‘మిసెస్ ఫెర్గుసన్, మిసెస్ ఫెర్గుసన్’
తలుపు పక్కన టేబుల్ మీది బ్రాందీ బాటిల్ అందుకుని పడక గదిలోకి వెళ్లి భార్యకి కొద్దిగా తాగించాడు. అది తాగి కొద్దిగా తేరుకున్న ఆమె ఏదో గొణగడంతో అడిగాడు.
‘ఏమిటి?’
‘అతను నన్ను చంపాడు’
‘ఎవరు? ఎప్పుడు?’
‘కేక్. నేను కేక్‌ని చూడటానికి లోపలికి వచ్చాను. వెనక్కి తిరిగి చూస్తే నించుని ఉన్నాడు...’
‘తర్వాత?’ భర్త అడిగాడు.
‘నేను సేల్స్‌మేన్‌ని అన్నాడు. డబ్బు అడిగితే లేదని చెప్పాను. నన్ను పట్టుకున్నాడు.. తర్వాత.. నన్ను చంపాడు. నన్ను చంపేశాడు’
తలుపు మీద కొడుతున్న చప్పుడు, మిసెస్ ఫెర్గుసన్ మాటలు వినిపించాయి.
‘హలో! ఏదైనా సమస్యా?’
‘దయచేసి డాక్టర్‌ని పిలవండి. నా భార్యకి ఏదో అయింది’ సామ్ కంగారుగా ఆవిడని కోరాడు.
‘అయ్యో! అలాగే’
మళ్లీ భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘్భయపడకు. డాక్టర్ వస్తున్నాడు’
* * *
ముప్పావు గంట తర్వాత మఫ్టీలోని పోలీస్ ఆఫీసర్ సామ్‌ని అడిగాడు.
‘మీరు ఎన్నింటికి వచ్చారు?’
‘ముప్పావు గంటయింది’
‘మీరు ఎక్కడ పని చేస్తున్నారు?’
‘మోర్గాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీలో’
మరో పోలీస్ ఆఫీసర్ మిసెస్ ఫెర్గుసన్‌ని అడిగాడు.
‘మీరు ఏదైనా చూశారా? సహాయానికి అరుపులు కానీ, లేదా ఏవైనా విన్నారా?’
‘లేదు. కేక్‌ని ఓవెన్‌లో పెట్టాక అది జరిగి ఉంటుంది. నేను మార్కెట్‌కి వెళ్లాను’
ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి చెప్పారు.
‘నాలుగో ఇంట్లో ఆవిడ ఓ వ్యక్తి లోపలికి వెళ్లడం చూసిందిట. ఐతే అతన్ని వివరంగా చూడలేదు. నల్లటి జుట్టు, బూడిద రంగు సూట్, ఆరడుగుల ఎత్తు. చూస్తే మళ్లీ గుర్తు పడతానో లేదో అని చెప్పింది’
అతను సామ్‌ని ప్రశ్నించే వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు.
‘లోపల చూశావా?’
‘చూశాను. నాకేమీ కనపడలేదు’
అతను లోపలికి వెళ్లాడు.
‘మీరు వచ్చేప్పటికి రేడియో ఆన్‌లో ఉందన్నారా?’ అతను సామ్‌ని ప్రశ్నించాడు.
‘అవును’
బయటికి వచ్చిన డాక్టర్‌ని అడిగాడు.
‘ఎలా ఉంది?’
‘్భతికంగా ఆరోగ్యంగా ఉంది. కానీ మానసికంగా షాక్‌లో ఉంది. ముఖ్యంగా అలాంటి షాక్‌లోంచి బయటికి వస్తున్న సమయంలో ఇలా జరిగింది. నేను ఇప్పుడేమీ చెప్పలేను. ఆమెకి మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. ఆమె ఇంక తేరుకోకపోయినా ఆశ్చర్యం లేదు. నా సలహా ఈ వాతావరణం ఇంక ఆమె చూడకూడదు. ఇంట్లోంచి ఏ హోటల్ గదికో తీసుకెళ్లండి. రేపు ఉదయం మళ్లీ వస్తాను’
పోలీస్ ఆఫీసర్స్‌కి ఎలాంటి క్లూ దొరకలేదు.
‘మీ ఆవిడ ఆరోగ్యం పుంజుకోగానే చెప్పండి. ఆవిడతో మాట్లాడాలి’ చెప్పి వాళ్లు వెళ్లిపోయారు.
భార్య పక్కన కూర్చుని సిగరెట్ అంటించుకుని కోపంగా చెప్పాడు.
‘వాడు కనిపిస్తే చంపేస్తాను’
‘అవును చంపండి.. చంపండి’ ఎల్సా ఎటో చూస్తూ బదులు చెప్పింది.
సిగరెట్‌ని ఆర్పేసి అడిగాడు.
‘డాక్టర్ మనల్ని హోటల్‌కి వెళ్లమన్నాడు. అది నీకు ఇష్టమేనా?’
‘ఇష్టమే’
‘ఆ వ్యక్తిని నువ్వు మళ్లీ చూస్తే గుర్తు పట్టగలవా?’
‘తప్పకుండా గుర్తు పడతాను’ చెప్పింది.
ఆమె మత్తు మందు ప్రభావంతో నిద్రపోయింది.
* * *
మర్నాడు హోటల్‌కి బయలుదేరారు.
సామ్ కారుని డ్రైవ్ చేస్తూ పక్కన కూర్చున్న, షాక్ లోంచి ఇంకా తేరుకోని ఎల్సాని అడిగాడు.
‘అతన్ని నువ్వు గుర్తు పట్టగలవేమో చూస్తూండు’
ఇద్దరి దృష్టీ పక్కన పేవ్‌మెంట్ మీద పడింది. నిశ్శబ్దంగా పది నిమిషాల సేపు సామ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్య భార్య వంక చూస్తున్నాడు. అకస్మాత్తుగా ఆమె దృష్టి పేవ్‌మెంట్ మీద నడుస్తున్న బూడిద రంగు సూట్, నల్ల జుట్టుగల ఆరడుగుల మనిషి మీద పడింది.
‘అతనే అతనే’ అరిచింది.
సామ్ బయటకి చూస్తే అతను ఓ తలుపులోంచి లోపలికి వెళ్తున్నాడు. వెంటనే కారు ఆపి సామ్ భార్యని అడిగాడు.
‘నువ్వు ఇక్కడ ఉండు. రెండు నిమిషాల్లో వస్తాను. సరేనా?’
‘సరే’
సామ్ సీట్ కింద నించి బరువైన రెంచీని తీసుకుని తన పొడుగాటి చొక్కా స్లీవ్ కిందికి పోనించి బయటకి కనపడకుండా పట్టుకున్నాడు. కారు దిగి పార్కింగ్ మీటర్‌లో డబ్బు వేసి ఆ వ్యక్తి వెళ్లిన తలుపు తెరుచుకుని లోపలకి వెళ్లాడు. అది హోటల్. అప్పుడే వచ్చిన రిసెప్షనిస్ట్ ఆ పొడుగాటి వ్యక్తిని అడిగాడు.
‘సారీ? యస్?’
‘రూం నంబర్ త్రీ టు వన్’ ఆ వ్యక్తి చెప్పాడు.
రిసెప్షనిస్ట్ అతనికి తాళం చెవిని తీసి ఇచ్చాడు.
ఎడం చేత్తో కౌంటర్ మీది సేల్స్‌మేన్ ఉపయోగించే తన బేగ్‌ని అందుకుని అతను లిఫ్ట్ దగ్గరకి వెళ్లాడు. సామ్ అతన్ని అనుసరించాడు. లిఫ్ట్‌లోకి ఇద్దరూ నడిచారు.
‘మీ నంబర్ ఎంత?’ అతను అడిగాడు.
‘మూడు’ సామ్ జవాబు చెప్పాడు.
‘మన ఇద్దరిదీ ఒకటే’
అతను అప్పటికే మూడో నంబర్ బటన్‌ని నొక్కాడు. ఆ తర్వాత వారి మధ్య మాటలు లేవు.
లిఫ్ట్‌లోంచి బయటికి రాగానే అతను ఓ గది తాళం తెరుచుకుని లోపలికి వెళ్లాడు. సామ్ కొద్ది అడుగులు ముందుకు వేసి ఆగి, వెనక్కి వెళ్లి ఆ తలుపు ముందు ఆగి పిడిని తిప్పి తోస్తే తెరుచుకుంది. లోపల రేడియోలోంచి సంగీతం వినిపిస్తోంది. సామ్ వెనక్కి తిరిగి నించుని ఉన్న అతన్ని తల మీద రెంచితో బలంగా నాలుగుసార్లు మోదాడు. తర్వాత లిఫ్ట్‌లో కిందకి వచ్చి బయటికి వచ్చి కారెక్కి స్టార్ట్ చేసి పోనించాడు.
‘మనం దగ్గరలోని ఇంకో ఊరు వెళ్దాం. నీకు ఆకలి వేస్తే దారిలో ఏదైనా తినచ్చు. ఈ ఊరు వద్దు’ చెప్పాడు.
‘సరే’ ఆమె ఒప్పుకుంది.
అరగంట తర్వాత ఆ హోటల్‌లోని ఛాంబర్ మెయిడ్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి ఆందోళనగా చెప్పింది.
‘రూమ్ నెంబర్ త్రీ టు వన్‌లో ఓ ఘోరం జరిగింది...’
* * *
కొత్త ఊళ్లోకి కారు ప్రవేశించాక అకస్మాత్తుగా ఎల్సా పేవ్‌మెంట్ వంక చూసి చెప్పింది.
‘అడుగో అతనే. అడుగో అతనే’
సామ్ తలతిప్పి, తన భార్య కళ్లు నిస్తేజంగా చూస్తూండటం గమనించాడు. వెనక నించి పోలీస్ సైరన్ వినిపించింది. *
రచన: సామ్యూల్ బ్లాస్.. దర్శకత్వం: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్