ఇంద్రాణీ సప్తశతిలోని ఏడవదైన జాగతం శతకంలోని మిగిలిన శ్లోకాలను తెలుసుకొందాం.
14. గృహయుగళీ శ్రీయ ఆశ్రీతగమ్యా
పదకమల ద్వితరుూ బహురమ్యా
మమహృది భా త్వవికుంఠితయానా
హరి సుదృశస్త రుణారుణ భానా॥
సకల సంపదలకీ ఉండటానికి రెండు గృహాలలాగా ఉండేవి ఆ ఇంద్రాణీ పాదాలు. అవి ఆశ్రీత భక్తజనులు చేరదగ్గవీ, ఎంతో రమ్యమైనవీ కూడా. వాటి గమనానికి అడ్డులేదు. అవి బాలభానుడి ప్రకాశంతో సమానమైన ప్రకాశాన్ని కలిగి ఉన్న ఆ ఇంద్రాణీ పాదాలు నా మదిలో ప్రకాశించుగాక!
15. ఉపరి తతా కులకుండ నిశాంతా
జ్వలిత ధనంజయ దీధితి కాంతా
హరిహయ శక్తిరియం మమ పుష్టా
ద్రవయతు మస్తక చంద్ర మదుష్టా॥
శరీరంలో స్థూల (లేదా పై) భాగంలో వ్యాపించి, కుండలినీనే ఇల్లుగా చేసుకున్నదీ, మండే అగ్నికాంతులతో మనోహరంగా ఉండేదీ, పుష్టి కలిగినదీ, పవిత్రమైనదీ అయిన ఆ ఇంద్రాణీదేవి, నా శిరస్సులో ఉండే చంద్రుడిని ప్రకాశింపజేయుగాక!
16. నభసి విరాజతి యా పరశక్తి
ర్మమమ హృది రాజతి యా వరశక్తిః
ఉభయ మిదం మిళితం బహువీర్యం
భవతు సుఖం మమ సాధిత కార్యం॥
17. త్రిభువన భూమిపతేః ప్రియయోషా
త్రిమలహరీ సురవిష్టవ భూషా
మమ వితనోతు మనోరధ పోషం
దురిత విపత్తి తతేరపి శోషం॥
ఏ పరాశక్తి అయితే ఆకాశంలో విరాజిల్లుతూ ఉందో, ఏదైతే నా మదిలో ప్రకాశిస్తూ ఉందో, బహు తేజోమయమైన ఆ రెండు శక్తులూ నా మదిలో మిళితమై, నా కార్యసాధన చేస్తూ నాకు సుఖాన్నిచ్చుగాక (అంటే, అహంకారాన్నీ, మమకారాన్నీ దేవి తొలగించాలన్నదే కవి ప్రార్థన)! మనోవాక్కాయ కర్మలు మూడిటినీ హరించే ఇంద్రాణి నా కోరికను మన్నించి నెరవేర్చుగాక! నా పాపాలను పోగొట్టుగాక!
18. పవన జగత్ప్రభు మోహనమూర్తి
ర్జలధర చాలన విశ్రుతకీర్తిః
మమ కుశలాయ భవ త్వరిభీమా
జననవతాం జననీ బహుధామా॥
మేఘాలను చలింపజేయడంవల్ల గొప్ప కీర్తిని సంపాదించుకుని, విస్తారమైన తేజస్సు కలిగి జన్మగలవారికందరికీ తల్లిగా ఉంటూ, ఆ ఇంద్రుడిని మోహింపజేసే మూర్తి (అయిన ఇంద్రాణీదేవి) నాకు బలమిచ్చుగాక!
19. మమ సుర రాజవధూ కళయోగ్రా
ఖలజన ధూనన శక్త నఖాగ్రా
దమయతు కృత్తశిరాః కలుషాణి
ప్రకటబలా హృదయస్య విషాణి॥
20. కులిశివధూకళయా పరిపుష్టా
బుధనుత సద్గుణజాల విశిష్టా
మమ పరితో విలసద్విభవాని
ద్రుపదసుతా విదధాతు శివాని॥
21. సురజనరాడ్దయి తాంశ విదీప్తే
పదకమలాశ్రీత సాధుజనాప్తే
దురితవశాదభితో గతభాసం
మనుజకుమార జనన్యవ దాసం॥
ఇంద్రాణీదేవి కళలు ఉగ్రకళ, శాంత కళ అని రెండు రకాలు. ఉగ్రమైనదీ, దుష్టజనులను నాశనమొనర్చే పటుత్వంగల గోళ్లుకలదీ, అతి బలమైనదీ, ఛేదించబడిన శిరస్సుగలదీ అయిన ‘ప్రచండచండి’ నా మదిలోని విషతుల్యమైన పాపాలను సంహరించుగాక! ఇంద్రాణీ (శాంత) కళతో కూడి, పండితుల పొగడ్తలను అందుకునే సద్గుణరాశియైన ద్రౌపది నాకు అన్నిటా వైభవంతో కూడిన శుభాలను చేకూర్చుగాక! ఓ మనుజ కుమారుని తల్లీ! పాపవశుడనై అన్నిటా నిస్తేజాన్ని పొందిన దాసుడనైన నన్ను రక్షించు!
22. అమరనరేశ్వర మందిర నేత్రీ
సుమశరజీవన సుందరగాత్రీ
భవతు శచీ వితత స్వయశస్సు
ప్రతిఫలితా గణనాథ వచస్సు॥
ఇంద్రుడి మందిరానికి నాయకురాలై, మన్మధుని పోషించే సుందర శరీరియైన ఆ శచీదేవి కీర్తిగానం ద్వారా వ్యాపించిన గణపతి (ముని) వాక్కులో ప్రతిఫలించుగాక!
23. వికసతు మే హృదయం జలజాతం
విలసతు తత్ర శచీస్తుతిగీతం
స్ఫురతు సమస్త మిహేప్సిత వస్తు
ప్రథితతమం మమ పాటవసమస్తు॥
ఈ స్తుతి గీతంవల్ల నా హృదయమనే పద్మం వికసించుగాక! అందులో ఈ శచీదేవి సంబంధమైన ఈ గీతం ఆమెకు వినోదాన్ని కలిగించుగాక! ఇహంలో అన్ని కోరికలూ సఫలమగుగాక! ఆ కోరుకున్న వాటిని పొందడంవల్ల నా సామర్థ్యం ఎక్కువగుగాక!
24. కురు కరుణారససిక్త నిరీక్షే
వచన పథాతిగ సద్గుణలక్షే
శచి నరసింహజ మాహితగీతం
భరతధరా మవితుం పటుమేతం॥
ఓ కరుణామరుూ! నీ గుణాలు లక్షల కొలదీ ఉన్నాయి. వాటిని వర్ణించడానికి వీలులేకున్నది. భారతదేశ రక్షణార్థం ఈ గీతాలను వ్రాసిన నరసింహ సుతుడనైన ఈ గణపతి (ముని)ని సమర్థునిగావించు.
25. సులలిత తామరసైః ప్రసమాప్తం
వరనుతిబంధమిమం శ్రవణాప్తమ్
జనని నిశమ్య సుబద్ధ మశేషం
హరిలలనే మమ కుర్వభిలాషమ్॥
ఓ ఇంద్రాణీ మాతా! సులలిత తామరస వృత్తాలతో సమాప్తమయిన ఈ చెవులకు ఇంపుగా నిబద్ధమైన ఈ వరనుతి బంధాన్ని నీవు పూర్తిగా విని నా కోరికను నెరవేర్చు. జాగతం శతకంలోని నాలుగవదైన సులలిత తామర స్తబకం ఇక్కడితో పూర్తి అయింది.
దీనితో ఇంద్రాణీ సప్తశతిలోని ఏడవదైన జాగతం శతకం పూర్తి అయింది.
ఇతి కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి మహాముని ప్రణీత ఇంద్రాణీ సప్తశతిః
(సమాప్తం)