* శివుడి రూపంలో శివాలయాలు లేవెందుకు?
- నిట్టల రామలక్ష్మి, సికింద్రాబాదు
నటరాజస్వామి, దక్షిణామూర్తి వంటి రూపాలతో శివాలయాలు దక్షిణాదిన కొన్ని ఉన్నాయని విన్నా. మన దేశంలో శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తికి, శ్రీశైలంలో వీరభద్రస్వామికీ ఉపాలయాలు వున్నాయి. ఏది ఏమైనా, శివుడ్ణి కరచరణాదులు గల రూపంలో ఆరాధించటం కంటే, లింగ రూపంగా ఉపాసించటమే ప్రశస్తమని పురాణాలలో చాలాచోట్ల వుంది.
*సాలగ్రామాన్ని ఎలా పూజించాలి? ఇంట్లో వుంచవచ్చా?
- లక్ష్మి, సికింద్రాబాదు
సాలగ్రామాన్ని పురుషులు పురుష సూక్త విధానంతో ఆరాధించాలి. ఇంట్లో శుచిత్వం సరిగా వుంటే సాలగ్రామాన్ని ఇంట్లో వుంచుకోవచ్చు.
* భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశమే తెలుసు గానీ, బయటకు రావటం తెలీదనే విషయం శ్రీకృష్ణుడికి, అర్జునుడికీ మాత్రమే తెలుసు. ఈ విషయం బయటి ప్రపంచానికి, అంటే కౌరవులకు, ఎలా తెలుసు?
- పి.వి.శివప్రసాద్‌రావు, అద్దంకి
అర్జనుడు నిద్రిస్తున్న సుభద్ర ఎదుట పద్మవ్యూహ విద్యోపదేశం చేస్తున్న రోజులలో, ఆ కుటుంబంవారు ఈ విషయాన్ని అంత నిగూఢమైన విషయమని భావించి వుండలేదు. అందువల్ల ఆ వార్త కుటుంబంవారిలోనూ, తద్ద్వారా శత్రువర్గాలలోనూ వ్యాపించటంలో కష్టమేమీ లేదు.
* ప్రతిరోజూ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకొని పూజ చేసేవారు పూజానంతరం మరల దేవుడ్ణి యథాస్థానం ప్రతిష్ఠాపయామి అని వ్రతాలలో చేసినట్లు చేయాలా? అక్కరలేదా?
- ఎల్.ఆర్.లక్ష్మి, కందుకూరు
నిత్య పూజలో వుండే విగ్రహాలకు గానీ, రూపులకు గానీ, నిత్యోద్వాలనతో పనిలేదు. ఐనా, ఆవాహనం చేస్తూన్నాం గనుక ఉద్వాసన చేయటం మంచిదని కొందరు పెద్దలు అంటున్నారు. కనుక, ఆత్మతృప్తి ఎలా వుంటే అలాచేసుకోవటం ఉత్తమం.
* పర్వదినాలలో నిత్య పూజను, ప్రత్యేక దేవతా పూజలను, ఎలా చేయాలి?
- ఎల్.ఆర్.ఎల్. గూడూరు
పర్వదినాలలో నిత్య పూజను యథాప్రకారంగా పూర్తిచేసి (అవసరమైతే కొంత సంగ్రహంగా చేసి) ఆ తరువాత విడిగా ఆయా ప్రత్యేక దేవతల పూజలు చేసుకోవటమే ఉత్తమం.
శ్రీకృష్ణుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు?
- రామాచారి, ఒంగోలు
శ్రీకృష్ణుడు సంకల్ప రహితుడు. పూర్మజన్మలో మహర్షులై, ఈ జన్మలో స్ర్తి శరీరాన్ని ధరించి వున్న ఆ సాధకులను స్థూల శరీరాల్లోంచి విడదీసి, సూక్ష్మ శరీర స్థితిలో వుండగా, వారికి పరమాత్మతో క్రీడించినట్లుగా అనుభూతి కలిగించాడే తప్ప, తాను స్వయంగా వారితో క్రీడించలేదు. ఈ విషయాన్ని శుకమహర్షి బహుగూఢంగా వివరించాడు. అందువల్లే ఆయనను అనాది బ్రహ్మచారి అని పిలుస్తారు.
బెంగాలీయులు గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పిలుస్తారు. నిజమేనా?
- బహ్మరిష్, హైద్రాబాదు
అవును. బెంగాలీయుల సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ (ఇతర సంప్రదాయాలలో ఆమె వాహనం ఏనుగుగా తెలుస్తోంది)
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.