న్యూఢిల్లీ, ఆగస్టు 12: బోడోలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాను సుముఖంగా లేనని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్విభజన కమిషన్) ఏర్పాటును స్వాగతిస్తానని ఆయన తెలిపారు. బోడోలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అసోంలో ఉద్యమం మరోసారి ఊపందుకున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘మేమంతా కలిసే జీవించాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. పార్లమెంట్ భవనంలో సోమవారం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులు, అలాగే అసోంలో బోడోలాండ్ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న ఉద్యమకారులు పరస్పరం చేతులు కలిపారని, ఇది ఎంతో ఆందోళన కలిగిస్తోందని గొగోయ్ ఈ సందర్భంగా విలేఖర్లతో అన్నారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటు గురించి విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఈ ప్రతిపాదనపై తాను ఇప్పటివరకూ ఎలాంటి చర్చలు జరపలేదని, అయినా రెండో ఎస్సార్సీ ఏర్పాటుకు తాను సుముఖమేనని, దీనిని తాను వ్యితిరేకించడం లేదని తెలిపారు. రాష్ట్రాల పునర్విభజనకు సరైన విధానాన్ని రూపొందిస్తే దానిని తప్పకుండా స్వాగతిస్తానన్నారు. అసోంలోని గిరిజన జిల్లాలకు చెందిన కొంత మంది నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని గురించి ప్రశ్నించగా, తాము కలిసే జీవించాలని కాంక్షిస్తున్నట్టు గొగోయ్ చెప్పారు. ‘మేమంతా ఒకే కుటుంబంలా కలసి జీవించాలని కోరుకుంటున్నాం. ఉద్యమకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికీ భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలను సాధించుకునేందుకు వీలుగా ఆందోళనలను ఉద్ధృతం చేసేందుకు గూర్ఖాలాండ్, బోడోలాండ్ ఉద్యమకారులు పరస్పరం చేతులు కలిపినట్టు వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా, ఈ వార్తలను తానూ చూశానని, ఇది ఎంతో ఆందోళనకరమైన విషయమని గొగోయ్ పేర్కొన్నారు. గూర్ఖాలాండ్, బోడోలాండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు రెండూ భిన్నమైనవని, వీటిని విభిన్న దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
వాద్రా వ్యవహారంపై
విచారణ జరపండి
కాంగ్రెస్‌కు స్వపక్ష ఎంపి షాక్
న్యూఢిల్లీ, ఆగస్టు 12: సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్గావ్ భూముల అంశంపై కాంగ్రెస్ ఎంపీనే విచారణకు డిమాండ్ చేయడం ఆ పార్టీని ఇరుకున పడేసింది. హర్యానా పట్టణంలో వ్యవసాయ భూమిని వాణిజ్య, గృహవసరాలకు మార్చడంపై సమగ్ర దర్యాప్తు జరగాలని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగినా, అందులో రాబర్ట్ వాద్రాతోపాటు మరెవరికి ప్రమేయమున్నా వదిలేది లేదని గుర్గావ్ ఎంపి రావ్ ఇంద్రజిత్ సింగ్ అన్నారు. ఈ భూములు తన నియోజకవర్గంలో ఉన్నందున వీటికి సంబంధించిన నిజానిజాలు వెలికి తీయాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆయన.. కేవలం వాద్రా-డిఎల్‌ఎఫ్ మధ్య జరిగిన నాలుగు ఎకరాల భూ ఒప్పందంపైనేకాకుండా హర్యానా ప్రభుత్వం కేటాయించిన 1,200 ఎకరాల భూమిపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా నివేదికపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఎంపి ఇంద్రజిత్ సింగ్ పైవిధంగా స్పందించారు.