నందిగామ, ఆగస్టు 12: కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో సోమవారం కుంభవృష్టి కురిసింది. తెల్లవారుఝాము నుండి సాయంత్రం వరకూ ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఈ ప్రాంతంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లవాగు పొంగటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి పైనా వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. మునే్నటి వాగు కూడా పొంగి పొర్లుతోంది.
కంచికచర్లలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం
కంచికచర్లలో సోమవారం కుంభవృష్టి కురిసింది. ఇక్కడ 110.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. గండేపల్లి-కీసర మధ్య కాజ్‌వేపై మూడు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు సాయంత్రం వరకూ నడవలేదు. లక్ష్మయ్య వాగు, చీకటి వాగు పొంగటంతో పొలాలు నీట మునిగి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.
ప్రకాశం బ్యారేజీ 55గేట్లు ఎత్తివేత
విజయవాడలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఉద్ధృతంగా చేరుతుండటంతో రాత్రి 7గంటల సమయానికి మొత్తం 70గేట్లలో 55గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
గుంటూరు జిల్లాలో పొంగుతున్న వాగులు
గుంటూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అమరావతి - గుంటూరు రహదారిలో నరుకుళ్లపాడు వద్ద మేళవాగు, యండ్రాయి వద్ద కొండవీటి వాగు పొంగి ప్రవహించాయి. అచ్చంపేట మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చింతపల్లి వద్ద వాగు పొంగటంతో రవాణా స్తంభించింది.
రేపల్లె ప్రాంతంలోనూ భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షపు నీరు రోడ్లను ముంచెత్తింది. పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీటికి పంట పొలాలు మునిగిపోయాయి.
నందిగామ - చందాపురం మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగు
‘బాబు’ వెంట ఢిల్లీకి వెళ్లి
కుట్రలో భాగం కావద్దు
టి.టిడిపి నేతలకు టిఆర్‌ఎస్ నేత వినోద్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టిడిపి అధినేత చంద్రబాబు పన్నుతున్న కుట్రలో టిడిపి తెలంగాణ ఫోరమ్ నేతలు భాగం కావద్దని టిఆర్‌ఎస్ పార్టీ హితవు పలికింది. రాష్ట్ర విభజనపై మరింత స్పష్టత కావాలనే సాకుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్ర విభజనను స్వాగతించిన చంద్రబాబు, వారం రోజులు గడవక ముందే మాట మారుస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాసారన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడాన్ని తాము తప్పుపట్టడం లేదు, కానీ తెలంగాణపై స్పష్టత కావాలని వెళ్లడానే్న గత అనుభవం దృష్ట్యా అనుమానించాల్సి వస్తుందని వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం క్యాబినెట్ ఆమోదం పొందకముందే కమిటీ పేరిట చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆయన కదలికల పట్ల తెలంగాణ టిడిపి నేతలు అప్రమత్తంగా ఉండాలని వినోద్ సూచించారు.
తెలంగాణపై టిడిపి మరోసారి యుటర్న్ తీసుకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఎయులో ఐదేళ్ల న్యాయ విద్య
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో తొలిసారిగా ఐదేళ్ల న్యాయ విద్యా కోర్సును ప్రవేశపెడుతున్నట్టు వర్శిటీ వైస్ చాన్స్‌లర్ జిఎస్‌ఎన్ రాజు తెలియచేశారు. ఇప్పటివరకూ ఎయులో మూడేళ్ల లా కోర్సు మాత్రమే ఉండేదని, కొత్తగా ఐదేళ్ల కోర్సు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇందులో 60 సీట్లు ఉండాయని, 40 సీట్లు స్థానికులకు, 20 సీట్లు విదేశీ విద్యార్థులకు కేటాయించామని అన్నారు. విదేశీ విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పది సెమిస్టర్లుండే ఈ కోర్సులో 24 కంపల్సరీ లా సబ్జెక్ట్స్, 6 ఆప్షనల్స్, 16 నాన్-లా సబ్జెక్ట్స్ ఉంటాయని తెలిపారు.