న్యూఢిల్లీ, ఆగస్టు 12: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు కృష్ణావతారం ఎత్తి సోమవారం లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. దీంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌చేస్తూ టిడిపి సభ్యులు రోజుంతా పోడియం వద్ద నిలబడి గొడవ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టిడిపి సభ్యుడు శివప్రసాద్ కృష్ణావతారం ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య రాయబారం నిర్వహించేందుకు ప్రయత్నించి సభలో గందరగోళం సృష్టించారు. ఆయనతో పాటు టిడిపికి చెందిన మరో ముగ్గురు సభ్యులు నారాయణ స్వామి, నిమ్మల కిష్టప్ప, వేణుగోపాల్ రెడ్డి పోడియం వద్దకు వచ్చి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. స్పీకర్ మీరాకుమార్ నచ్చచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా పట్టించుకోకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలని నినదిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం, బిజెపి, వామపక్షాలకు చెందిన సభ్యులు యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వీరికితోడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ సభ్యులు కూడా తమ సీట్లలో నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నలుగురు టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయగా, జమ్మూ-కాశ్మీర్‌లోని కిస్త్వార్‌లో జరుగుతున్న మతకలహాల గురించి బిజెపి సభ్యులు ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి కిస్త్వార్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని బిజెపి సభ్యులు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమవగానే టిడిపి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, కిష్టప్ప, నారాయణ స్వామి పోడియం వద్దకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మళ్లీ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ దశలో శివప్రసాద్ కృష్ణావతారం ఎత్తారు. తలపై ఒక కిరీటం, దానిపై నెమలి పింఛం పెట్టుకున్నారు. మెడలో దండ, చేతిలో మురళి, చక్రం ధరించి భగవద్గీతలోని పద్యాలు చదువుతూ పోడియం వద్దకు వచ్చారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన మెజారిటీ సభ్యులు శివప్రసాద్ తీరును విమర్శించారు. అత్యున్నతమైన చట్టసభలో ఇలా చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. అయితే ఆయన ఇవేమీ పట్టించుకోకుండా మహాభారతంలో కౌరవులు, పాండవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినట్టు తాను తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య రాజీ కుదిర్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నానంటూ పద్యాలు పాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సోనియా గాంధీ అర్థం చేసుకుని విభజనను నిలిపివేయాలంటూ పద్యం వినిపించారు. శివప్రసాద్ తీరుపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో ఇలా వ్యవహరించటం మంచిది కాదని స్పష్టం చేశారు. శివప్రసాద్ మొదట తన వేషం తొలగించాలని మీరాకుమార్ ఆదేశించారు. నాలుగు నిమిషాల పాటు కృష్ణావతారంలో పోడియం వద్ద తిరిగిన శివప్రసాద్ ఆ తర్వాత తన వేషాన్ని తొలగించుకున్నారు. ఆ తర్వాత పోడియం వద్దే నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టిడిపి సభ్యులు పోడియం వద్దకు వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో లోక్‌సభ సాయంత్రం 3 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ గందరగోళం మధ్యలోనే ఆర్థిక లోటుపై ఒక ప్రకటన చేశారు. చిదంబరం ప్రకటన పూర్తికాగానే ప్యానెల్ స్పీకర్ రఘువంశ్‌ప్రసాద్ సింగ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
పార్లమెంటు వెలుపల కృష్ణ వేషధారి శివప్రసాద్‌తో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు