న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇషత్ జహాన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి పిపి పాండే పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే పాండేపై విచారణ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వేయగా, దీన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ చేసిన వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. ఇప్పటికీ పాండే పరారీలోనే ఉన్న కారణంగా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సోమవారం స్పష్టం చేసింది. ‘మీ ప్రవర్తన మీకున్న బెయిల్ పొందే హక్కును హరించి వేసింది’ అని పాండేను ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాండే తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది జస్పాల్ సింగ్ బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ధర్మాసనం ఆయన వాదనను విశ్వసించలేకపోయింది. కాగా, పాండే తీరుపట్ల అసంతృప్తి వెలిబుచ్చిన సుప్రీం కోర్టు.. అలాంటివారు పెట్టుకునే ఇలాంటి బెయిల్ పిటిషన్లతో విలువైన కోర్టు సమయం వృథా అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. ఇదిలావుంటే ఈ కేసులో సిబిఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్.. పాండే బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసుకు సంబంధించి రెండుసార్లు పరారైన పాండే ఆచూకీ ఇప్పటికీ తమకు తెలియకుండా ఉందన్నారు. కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదన్న ఆమె, పాండే ఆచూకీ తెలిసిన వెంటనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. 1982 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన అదనపు డిజిపి పాండే 2004లో జరిగిన ఇషత్ జహాన్, మరో ముగ్గురి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో నిందితుడిగా ఉన్నారు.
ఇషత్ జహాన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
english title:
s
Date:
Tuesday, August 13, 2013