జమ్ము/శ్రీనగర్, ఆగస్టు 12: కిస్త్వార్ జిల్లాలో చెలరేగిన అల్లర్లపై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ హోం శాఖ సహాయ మంత్రి సాజద్ కిచ్‌లూ సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కిస్త్వార్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ జిల్లాలో జరిగిన అల్లర్లలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ జిల్లాలోని హిద్యాల్ ప్రాంతంలో సోమవారం తాజాగా ఘర్షణలు జరిగాయి. పలువురు మహిళలు కూడా ఉన్న ఒక నిరసనకారుల గుంపును పోలీసులు అడ్డగించినప్పుడు ఈ ఘర్షణలు తలెత్తాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. సాజద్ రాజీనామా పత్రాన్ని తనకు సమర్పించగా, తాను దాన్ని గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకు పంపిస్తూ ఆమోదించాల్సిందిగా సిఫార్సు చేశానని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సాజద్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తరువాత వెలువడిన ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున కిస్త్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సాజద్‌కు ఈ సంవత్సరం తొలినాళ్లలో కేబినెట్‌లో చోటు లభించింది. కిస్త్వార్ జిల్లాలో జరిగిన అల్లర్లకు సాజద్ బాధ్యుడని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా, జమ్మూ రీజియన్‌లోని ఆరు జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ జిల్లాల్లో సైన్యాన్ని మోహరించారు. కిస్త్వార్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశారు. కాగా, ఉధంపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం రెండు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. జమ్ములో పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం రాజ్యసభలో ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రానికి కేంద్రం అవసరమైన సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. బిజెపి నేత అరుణ్ జైట్లీని కిస్త్వార్‌లోకి వెళ్లనీయొద్దన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చిదంబరం సమర్థించారు.
జమ్మూలో సోమవారం ఆందోళనకు దిగిన గుంపును తరిమికొడుతున్న భద్రతా దళాలు