న్యూఢిల్లీ, ఆగస్టు 12: కిస్త్వార్‌లో చెలరేగిన అల్లర్లను అణచివేయడంలో జమ్మూకాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సోమవారం డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ‘జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్టప్రతి పాలనను విధించాలి’ అని డిమాండ్ చేశారు. కిస్త్వార్ అల్లర్ల ఉదంతాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ అల్లర్లు చెలరేగడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె విమర్శించారు. అల్లర్లు తలెత్తిన మొదటి రోజే వాటిని అణచివేసి ఉండాల్సిందని ఆమె పేర్కొన్నారు. ‘జమ్మూకాశ్మీర్‌లో శాంతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది. ఈ అల్లర్లపై ఉన్నతస్థాయి విచారణకు కేంద్రం ఆదేశించాలి’ అని ఆమె అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత హోంమంత్రిపై ఉందని, కిస్త్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికైన హోంమంత్రి అల్లర్లు తలెత్తిన మొదటి రోజున అదే జిల్లాలో ఉన్నారని మాయావతి తెలిపారు. ఆయన అల్లర్లను ఆపాలని అనుకుంటే ఆ రోజే అణచివేసేవారని పేర్కొన్నారు. కాని, అల్లర్లను అణచివేయకపోవడం వల్ల అనేక దుకాణాలు దగ్ధమయ్యాయని, చాలామంది గాయపడ్డారని వివరించారు. ఈ అల్లర్లలో తమ పార్టీ జిల్లా అధ్యక్షుడి కుమారుడు కూడా మృతి చెందాడని మాయావతి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెంటనే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉందని, అయితే కర్ఫ్యూ విధించడం సమస్యకు పరిష్కారం కాదని ఆమె పేర్కొన్నారు. అల్లర్లపై న్యాయవిచారణకు ఆదేశించడంపై ఆమె స్పందిస్తూ ఇలాంటి విచారణలన్నీ సాధారణంగా అటకెక్కుతాయని పేర్కొన్నారు.
అల్లర్ల అణచివేతలో ఒమర్ సర్కారు విఫలం కాశ్మీర్ పరిస్థితులపై బిఎస్‌పి అధినేత్రి మాయావతి
english title:
r
Date:
Tuesday, August 13, 2013