బాలాసోర్ (ఒడిషా), ఆగస్టు 12: అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగివున్న పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని రక్షణ బలగాల వినియోగ పరీక్షల్లో భాగంగా పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ అత్యాధునిక క్షిపణిని చాందీపూర్ (ఒడిషా)లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)లో గల మూడో కాంప్లెక్స్‌లోని మొబైల్ లాంఛర్ నుంచి ఉదయం 9 గంటల 15 నిముషాలకు ప్రయోగించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్ష విజయవంతమైందని, రక్షణ బలగాల వ్యూహాత్మక కమాండ్ వినియోగ పరీక్షలో భాగంగా దీనిని ప్రయోగించడం జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రొడక్షన్ స్టాక్ నుంచి ఒక క్షిపణిని ఎంచుకుని ఈ పరీక్ష నిర్వహించడం జరిగిందని, పూర్తిగా ఎస్‌ఎఫ్‌సి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగ ప్రక్రియను డిఆర్‌డిఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) శాస్తవ్రేత్తలు పర్యవేక్షించారని ఆ వర్గాలు తెలిపాయి. డిఆర్‌డిఓ అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని భారత సాయుధ బలగాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టారు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐజిఎండిపి)లో భాగంగా పృథ్వీ క్షిపణిని మొదట అభివృద్ధి చేశారు.
మ్యానిఫెస్టోలపై
ఆంక్షలు వద్దు
ఇసికి ప్రధాన రాజకీయ పార్టీల స్పష్టీకరణ
విభేదించిన బిఎస్‌పి, ఎన్‌పిఎఫ్, ఎంఎన్‌ఎఫ్
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఉచిత పథకాలను ప్రకటించకుండా రాజకీయ పార్టీలను కట్టడి చేయాలన్న ప్రతిపాదనను బహుజన్ సమాజ్ పార్టీ మినహా మిగిలిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సోమవారం వ్యతిరేకించాయి. ఇటువంటి పథకాలను ప్రకటించడం తమ విచక్షణాధికారమేనని ఆ పార్టీలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రణాళికల్లో ఉచిత పథకాలను ప్రకటించకుండా రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలన్న సుప్రీం కోర్టు సూచన మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించింది. ఐదు జాతీయ పార్టీలతో పాటు 23 ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలపై మార్గదర్శకాలను రూపొందించాలన్న ప్రతిపాదనపై వీరు తమ పార్టీల అభిప్రాయాలను కమిషన్‌కు తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ప్రకటించడం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుందని, కనుక ఎన్నికల ప్రణాళికల్లో పార్టీలు ఇటువంటి ఉచిత పథకాలను ప్రకటించకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఎంతో ఉందని బిఎస్‌పి అభిప్రాయపడింది. ప్రాంతీయ పార్టీలైన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్ మాత్రమే బిఎస్‌పితో ఏకీభవించగా, మిగిలిన పార్టీలు వ్యతిరేకించాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం రాజకీయ పార్టీల హక్కు అని కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు స్పష్టం చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగివున్న పృథ్వీ-2
english title:
p
Date:
Tuesday, August 13, 2013