Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఐక్యంగా ఉంచడమే ఏకైక మార్గం

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కార మార్గమని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎపి గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె. యోగీశ్వరరెడ్డి, ఎపిఎన్‌జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ఎపి రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బి. వెంకటేశ్వర్లు తదితరులు సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సమ్మె చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అంతవరకు సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కాని, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి కాని ఎలాంటి అధికారాలు లేవని గుర్తు చేశారు. ఈ కమిటీల పరిధి ఏమిటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వచించి ఉంటే బాగుండేదన్నారు.
ఉద్యోగుల ఆందోళన శాంతియుతంగా కొనసాగేలా ప్రభుత్వం సహరించాలని, అనవసరంగా రెచ్చగొడితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులకు కానీ, ప్రైవేట్ ఆస్తులకు కానీ సమ్మె సందర్భంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తాము చేపట్టిన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేసినా, సమ్మె ఉద్ధృతం అవుతుందే తప్ప ఆగే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఉద్యోగులకు అనేక ఇక్కట్లు వస్తాయని అశోక్‌బాబు తదితరులు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం కన్నా రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడమే మిన్న అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సుల్లో విభజన చివరి అస్త్రంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేస్తే, తాము సహకరించామని, ఇప్పుడు తాము సమ్మె చేస్తే తెలంగాణ ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమ్మెలో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని అశోక్‌బాబు తదితరులు తెలిపారు. వరదలకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టడం, ఐసిడిఎస్‌లలో పిల్లలకు ఆహారం అందించడం, పాల సరఫరా, వైద్య సౌకర్యాలు తదితర అత్యవసర పనులను సమ్మె నుండి మినహాయిస్తున్నామన్నారు. సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు.

సచివాలయంలో సోమవారం మంత్రి రఘువీరారెడ్డిని అడ్డుకుంటున్న ఉద్యోగులు

విభజనపై మాట్లాడొద్దు
రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ ఆదేశం
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై రాష్ట్ర నాయకులెవ్వరు కూడా బహిరంగ ప్రకటనలు చేయవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ సష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని తెలిపారు. సీమాంధ్ర నాయకులు రాష్ట్ర విభజన మూలంగా తమకు ఎదురయ్యే సమస్యలను ఎకె ఆంటోని అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీకి వివరించాలన్నారు. ఆంటోని కమిటీ వారి సమస్యలను పరిష్కరిస్తుందని దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై హైదరాబాద్ సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. మోడీ ఎప్పుడు కూడా వాస్తవాల ఆధారంగా మాట్లాడటం జరగదన్నారు. బిజెపి మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న బిజెపి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడటం విచిత్రంగా ఉన్నదని విమర్శించారు. కాగా, సీమాంధ్ర ఎన్‌జిఓలు సమ్మె విరమించుకోవాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఎన్‌జిఓలు సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే బదులు ఆంటోని కమిటీకి తమ సమస్యలను తెలయజేయటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాదే అజెండా!
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఆగస్టు 12: రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని నాయకత్వంలోని నలుగురు సీనియర్ నాయకుల ఉన్నతస్థాయి పార్టీ కమిటీకి చెప్పవలసిన అంశాలను ఖరారు చేసుకునేందుకు సీమాంధ్ర మంత్రులు సోమవారం పలుమార్లు సమావేశమయ్యారు. మొదట పార్లమెంటు ఆవరణలో సమావేశమై ఆంటోని కమిటీకి అందజేయవలసిన నివేదికపై మంతనాలు జరిపారు. ఆ తరువాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో చర్చలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా హైదరాబాద్ గురించి లోతుగా చర్చించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ను ఉభయ రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ప్రకటించాలనీ, ఇది సాధ్యం కాని పక్షంలో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. హైదరాబాద్‌తోపాటు ఇతర అంశాలను ఆంటోని కమిటీకి వారు వివరించనున్నారు. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంగళవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నా చేసిన అనంతరం వారు ఆంటోనిని కలిసి ఒక వినతిపత్రం అందజేయనున్నారు.
హైదరాబాద్‌లేని తెలంగాణ
ఇంజన్‌లేని రైలు లాంటిది
సీమాంధ్రులకు ఎలాంటి ఢోకా లేదు
టి.విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో కోదండరామ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు ఎలాంటి ఢోకా లేదని, తమకు భద్రత లేదన్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకుంటున్నారని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఉహించలేమని, అది లేకపోతే తెలంగాణ ఇంజన్‌లేని రైలు లాంటిదేనని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, సోమవారం విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సంఘాల ఐకాస అధ్యక్షుడు రఘు అధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు సంఘీభావంగా టిజెఎసి నేతలు కోదండరామ్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, మల్లెపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత హైదరాబాద్‌పై రాజీపడే ప్రసక్తే లేదని కోదండరామ్ స్పష్టం చేశారు. తాము మొదటి నుంచి హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసమే డిమాండ్ చేసామని, తమ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో మారదని ఆయన పేర్కొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. తెలంగాణ జిల్లాల్లో గానీ, హైదరాబాద్ నగరంలో గానీ స్థిరపడిన సీమాంధ్రులకు ఎలాంటి భయం లేదనీ, లేనిపోని భయాలను సృష్టించి, రాష్ట్ర విభజనను ఎలాగైనా అడ్డుకోవాలన్నదీ కొందరు పెట్టుబడిదారుల పన్నాగమని మండిపడ్డారు. అలాంటి స్వార్థ నాయకుల ఉచ్చులో పడకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన అంశంపై తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ధర్నాలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు.

రెచ్చగొడుతున్నారు

ఎపిఎన్జీవోలు సమ్మె చేస్తే తాము సర్కార్‌కు అండగా ఉంటాం
టిఎన్‌జివో అధ్యక్షుడు దేవిప్రసాద్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: ఎపిఎన్జీవోలు తెలంగాణవాదులను, ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టిఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ రావు ఆరోపించారు. తాము ఎంత సంయమనం పాటించినా, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యోగులను కించపర్చేలా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టిఎన్‌జివో భవన్‌లో సోమవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్‌తో కలిసి, దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలుగా, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసమే తాము సమ్మె చేసాం, కానీ ఎవరి మీద దాడి చేయలేదన్నారు. సకల జన సమ్మె సందర్భంగా తాము సీమాంధ్ర ఉద్యోగులను వేధించామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టిఎన్జీవోలు సమ్మె చేసినప్పుడు తాము సహకరించినట్టు ఎపిఎన్జీవోల సంఘం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సకల జన సమ్మె జరిగినప్పుడు తాము విధులు నిర్వహిస్తామని ఎపిన్జీవోల సంఘం లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రాసిచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభలో టిడిపి ఎంపి సుజనా చౌదరి, రాష్ట్రంలో సివిల్ వార్ జరుగుతుందని వ్యాఖ్యనించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన ఉద్యోగాల్లో సీమాంధ్ర ఉద్యోగులు చోరబడ్డారని తాము ఇంతకాలంగా చెప్పింది, మంగళవారం నుంచి జరుగునున్న సమ్మెతో లెక్క తేలుతుందని దేవిప్రసాద్ అన్నారు. సమ్మెలో పాల్గొనేవారంతా సీమాంధ్ర ఉద్యోగులేనని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమ్మెకు దిగేవారు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండకూడదని విఠల్ హెచ్చరించారు. ఎపిఎన్జీవోల సమ్మె అనైతికం, అధర్మం అని ఆయన విమర్శించారు.
నేటి నుంచి నిరసనలు
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం నుంచి 17 వరకు టిఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. కలెక్టరేట్లు, మండల, తాలుక కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని టిఎన్జీవో, టిజిఎ పిలుపునిచ్చింది.

సమ్మె బాటలో సీమాంధ్ర ఆర్టీసీ

రోజుకు 20 కోట్లపైనే నష్టం ఇప్పటికే 130 కోట్ల ఆదాయానికి గండి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో ఆర్టీసీకి చెందిన అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టనున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలోని 13 రీజియన్లకు చెందిన కార్మిక సంఘాలు అధికారులకు సమ్మె నోటీసు కూడా అందజేశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని సీమాంధ్ర విభాగానికి చెందిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకునే వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ సీమాంధ్ర పోరాట కమిటీ నేత దామోదర్ స్పష్టం చేశారు. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సు సర్వీసులను సోమవారం అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సీమాంధ్రలో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడిన నాటినుంచి సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. జూలై 31 నుంచి సంస్థ రోజుకు 10 కోట్ల ఆదాయాన్ని కోల్పోతూ వస్తోంది. దీంతో ఇప్పటి వరకూ సంస్థ కోల్పోయిన ఆదాయం 130 కోట్లపైనే ఉంటుందని ఆర్టీసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ఆయా ప్రాంతాల్లో బస్సుల ధ్వంసం, దగ్ధం అన్ని కలిపితే సంస్థ ఇప్పటివరకూ 20 లక్షల పైనే నష్టపోయిందని అధికారులు తెలిపారు. ఈ సమ్మెకు మరో సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా మద్దతు పలికింది. కాని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ మాత్రం సమ్మెకు మద్దతివ్వలేదు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజల ఆకాంక్ష మేరకే అక్కడి ఈయూ విభాగం సమ్మెకు దిగుతోందని, దీంతో వారి సమ్మెకు మా నుంచి ఎలాంటి మద్దతు లేదని యూనియన్ నేతలు పేర్కొన్నారు. సమ్మె మొదలైతే 123 డిపోల్లోని ఒక్క బస్సు కూడా రోడ్డెక్కని పరిస్థితి. అసలే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి కార్మికుల సమ్మె తలనొప్పిగా మారింది. సమ్మె మొదలైతే సంస్థ రోజుకు 20 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. సమ్మె మొదలైతే ఎన్ని రోజులు కొనసాగుతుందో స్పష్టంగా తెలియకపోవడంతో సంస్థ పెద్ద మొత్తంలోనే ఆదాయాన్ని కోల్పోనుంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం సామాన్య ప్రజలపై ఎక్కువ పడనుంది. పెళ్లిళ్ళ సీజన్ కూడా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
సమ్మెను వాయిదా వేసిన టిఎంయు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) సమ్మె పిలుపును వాయిదా వేస్తున్నట్లు టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. సీమాంధ్రలో కార్మిక సంఘాలు చేసే సమ్మె ఫలితాలను బట్టి తమ సమ్మె తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇరుప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దనే ఆలోచనతో తమ సమ్మెను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము సమ్మెను వాయిదా మాత్రమే వేశామని, సమ్మె నోటీసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
తిరుమలకు బస్సు సర్వీసుల నిలిపివేత
తిరుమలకు బస్సు సర్వీసులను నిలిపివేసే నిర్ణయంపై పునరాలోచన చేయాలని టిటిడి చేసిన అభ్యర్థనను కార్మిక సంఘాలు తోసిపుచ్చాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే తిరుమలకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. అలాగే సమ్మె జరిగినన్ని రోజులూ ప్రైవేటు రవాణ వ్యవస్థను కూడా అడ్టుకుంటామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.

టిడిపి చలో ఢిల్లీ!
విభజనపై మరింత స్పష్టత కావాలని
ప్రధానిని, రాష్టప్రతిని కలవాలని నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్ర విభజన అంశంపై మరింత స్పష్టత కావాలని కోరుతూ, ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, రాష్టప్రతిని కలవాలని టిడిపి నిర్ణయించింది. టిడిపి అధినేత చంద్రబాబు, సోమవారం సీమాంధ్ర, తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తమ పదవులుకు రాజీనామా చేసిన అంశాలపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సీమాంధ్రలో ఉవ్వెత్తునా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రధాన మంత్రిని, రాష్టప్రతిని కలిసి సీమాంధ్ర ప్రజల భయోందోళనలను వివరించాలని పార్టీ సీమాంధ్ర నేతలు చంద్రబాబుకు సూచించినట్టు తెలిసింది. అయితే ఈ సమయంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని, రాష్టప్రతిని కలవడం వల్ల తెలంగాణ ప్రజల్లో అపోహలు కలిగే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రాంత నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారులు అడ్డుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరిగిందనీ, ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనాచౌదరి, ఎంపి వేణుగోపాల్‌రెడ్డి ఢిల్లీలో అతి చేస్తున్నారని టిటిడిపి నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీ తరఫున లేఖ రాసి, తాజాగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించాక, పేచీలు పెట్టడం వల్ల, తెలంగాణ ప్రజల్లో టిడిపి పట్ల వ్యతిరేకత వస్తుందని టిటిడిపి నేతలు చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. ఢిల్లీలో అతి చేస్తోన్న ఎంపీలను కట్టడి చేయాల్సిందిగా టిటిడిపి నేతలు చంద్రబాబుకు సూచించగా, వారి వాదనతో సీమాంధ్ర నేతలు విభేదించినట్టు సమాచారం.

రాజ్యసభలో ‘తెలుగు’ గర్జన

రాష్ట్ర విభజనపై శివమెత్తిన హరికృష్ణ

ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, ఆగస్టు 12: రాజ్యసభలో అడుగుపెట్టిన సుదీర్ఘకాలానికి నోరువిప్పిన తెలుగుదేశం సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రదర్శించిన ఆవేశకావేశాలు సోమవారం సభలో తీవ్ర సంచలనం సృష్టించాయి. తెలంగాణ ఏర్పాటుపై ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో వివరణ ఇచ్చేముందు హరికృష్ణ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. చర్చ ముగింపునకు వస్తున్న తరుణంలో మాట్లాడే అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఆయన డిప్యూటీ చైర్మన్ కురియన్‌కు చీటి పంపారు. అప్పటికే తెలుగుదేశం పక్షాన సుజానా చౌదరి, రమేష్ మాట్లాడేశారు. హరికృష్ణ పేరు పిలిచినప్పుడు సభలో లేరు. ఆయన రాగానే మాట్లాడేందుకు కురియన్ అనుమతిచ్చారు. దీంతో హరికృష్ణ తెలుగులో మాట్లాడటం ప్రారంభించగానే కురియన్ అభ్యంతరం తెలియచేశారు. తెలుగులో మాట్లాడతానని ముందు చెప్పకపోవటం వల్ల అనువాదకుడు అందుబాటులో లేరని, కాబట్టి నియమ, నిబంధనలను ఉల్లంఘించటానికి వీలులేదని కురియన్ చెప్పారు. అయితే తాను తెలుగువాడినని, తెలుగులోనే మాట్లాడి తీరుతానని హరికృష్ణ బీష్మించుక్కూర్చున్నారు. దీంతో తెలుగులో మాట్లాడేందుకు తనకెట్టి అభ్యంతరం లేదనీ కాకపోతే అనువాదం లేకపోవటం వల్ల హరికృష్ణ ఏమి మాట్లాడుతున్నారు? ఆయన పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న విషయం తనకు తెలియవలసి ఉందని కురియన్ వాదించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించలేనని ఆయన చెప్పారు. ఈ దశలో హరికృష్ణ మరింత రెచ్చిపోయారు. అనువాదకుడిని ఏర్పాటు చేసుకోవలసిన బాధ్యత మీదే తప్పించి నాది కాదని ఎదురుతిరిగారు. అంతేగాక తెలుగువారి అత్మగౌరవాన్ని దెబ్బతీసే తీరులో వ్యవహరిస్తున్నారని ఆయన వాదించారు. ఈ దశలో కురియన్ జోక్యం చేసుకుంటూ మీ పేరు పిలిచినప్పుడు లేరు. తీరా మాట్లాడేందుకు అనుమతిస్తే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా? అని నిలదీశారు. దీంతో సభలో వాతావరణం వేడెక్కింది. ఈ దశలో వెంకయ్యనాయుడు లేచి మాతృభాషలో మాట్లాడే అధికారం, స్వేచ్ఛ ప్రతిఒక్కరికి ఉన్నాయని గుర్తుచేశారు. హరికృష్ణకు అండగా నిలిచారు. హరికృష్ణ తెలుగులోనే మాట్లాడుతూ చివరకు తెలుగుకు ఈ దౌర్భాగ్యం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి’ అన్న తీరులో కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై సంవత్సరాలుగా కలిసి మెలిసి అన్నదమ్ముల మాదిరి నివసిస్తున్న వారిని అర్ధరాత్రి నిర్ణయంతో విడదీసే అధికారం, హక్కు కాంగ్రెస్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందున విభజన నిర్ణయం తీసుకున్నామని పదే పదే చెప్పటం ద్వారా తమకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మధ్య చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఎవరికి కళ్లుకుట్టాయోకానీ నెహ్రు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను సోనియాగాంధీ విభజించారని విరుచుకుపడ్డారు. విభజన పర్యవసానంగా నీరు, విద్యుత్, ఉపాధి తదితర అంశాలపై ప్రజలలో తలైత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయకుండా విభజనపై నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు.

రాజ్యాంగ ఉల్లంఘన కావచ్చు, కానీ..

రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వైఖరిని సమర్థించుకున్న బొత్స

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఇప్పుడు ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడడం రాజ్యాంగ వ్యతిరేకం, ఉల్లంఘన కావచ్చు, కానీ, సీమాంధ్ర ప్రజాభీష్టాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రతినిధులపై ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని తమ పార్టీ సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ధైర్యంగా చెప్పారని బొత్స సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ‘రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ప్రభృతులు అలా చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించగా, ‘వ్యతిరేకమైతే కావచ్చు కానీ, ఆ ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉంది’ అని ఆయన సమాధానమిచ్చారు. విభజనపై కాంగ్రెస్ అనుసరించిన విధానం సరిగ్గా లేదని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారే తప్ప సమైక్యాంధ్రను కొనసాగించాలని స్పష్టంగా కోరలేదని గుర్తుచేశారు. ఆ పార్టీ విడుదల చేసిన ఏడు పేజీల నోట్‌లో సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వద్ద జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఆ పార్టీ సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజీనామాలు చేయడం ఓ ఫార్స్ అని అన్నారు. ఆ పార్టీ నిర్దిష్ట విధానం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత మనోభావాలు ఇవి అని తాము స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి 39 శాతం ఓట్లు లభించాయని, మిగతా 59 శాతం సాధించిన పార్టీలన్నీ విభజన కావాలని కోరాయని చెప్పారు. ఏదైనా కుటుంబంలో కుమారులు వేరుబడాలనుకుంటే తండ్రి ఆ కుమారుల మనోభావాల మేరకు ఆస్తుల పంపిణీ చేస్తారన్న ఆయన, రాష్ట్ర విభజన సందర్భంగా మాత్రం తమ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగిందని ఉదహరించారు. కాగా, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళుతున్నారని, తాను మాత్రం వెళ్లడం లేదని ఆయన చెప్పారు.
ఆదివారం హైదరాబాద్‌లో బిజెపి నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిందలు వేయడం తప్ప జాతీయ ధృక్పథాన్ని చాటుకోలేదని బొత్స విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, బిజెపి నాయకుడు ఎం వెంకయ్య నాయుడు తమ వాక్ఛాతుర్యాన్ని చాటి చెప్పుకునే ప్రయత్నం చేశారన్నారు. రక్షణ శాఖ గురించి, సైనికుల గురించి మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉందని, మోడీ తీవ్రవాదం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న ఆయన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే హయాంలోనే కార్గిల్ యుద్ధం, విమానం హైజాక్ కావడం, అక్షరధామ్, పార్లమెంటుపై దాడి జరిగిందని గుర్తుచేశారు. 1999 ఎన్నికల ముందు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. గుజరాత్ తరహాలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని మోడీ అనడాన్ని ఆయన ప్రస్తావిస్తూ మోడీ ముఖ్యమంత్రి కాకముందే టాటా, అంబానీలు, రుబియా వచ్చారని తెలిపారు. బిజెపిని గెలిపించాలని నాయకులు కోరడాన్ని బొత్స ప్రస్తావిస్తూ ఏమి ఘనకార్యం చేశారని ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు.

కడదాకా పోరాటం స్పష్టం చేసిన ఉద్యోగులు
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>