రాజమండ్రి/కాకినాడ/ఏలూరు, ఆగస్టు 12: సమైక్యాంధ్ర ఆందోళనలు సోమవారం నుండి మరింత ఉద్ధృతమయ్యాయి. పదవులకు రాజీనామా చేసిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలే స్వయంగా ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి తోట నరసింహం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో నగరంలో మోటారు సైకిళ్ల ర్యాలీ జరిగింది.
విద్యాసంస్థలు మూతపడ్డాయి. మందుల వర్తకులు కూడా సమ్మెలో పాల్గొనటంతో, దుకాణాలు మూతపడ్డాయి. ట్రాన్స్‌కో ఉద్యోగులు, అధికారులు సమైక్యాంధ్ర మద్దతుగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోను నిరసన ప్రదర్శనలు చేశారు. వైకాపా, రాజకీయ ఐకాస, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో రిలేదీక్షలు జరిగాయి. నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్ధులు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద రిలేదీక్షలు ప్రారంభించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లాను మంగళవారం నుండి రెండు రోజుల పాటు స్తంభింపజేయనున్నారు. పెట్రోల్ బంక్‌లను మంగళవారం మూసివేస్తున్నారు.
జోరు వానలో మిన్నంటిన నినాదాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నిరసనలు మిన్నంటాయి. జిల్లా అంతటా సోమవారం భారీ వర్షం కురిసింది. జోరున కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా ఆందోళనలు కొనసాగించడం విశేషం. జిల్లా అంటా బంద్ నిర్వహించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి దీక్షలు చేపట్టారు. జూట్‌మిల్లు కార్మికులు విధులు బహిష్కరించి రహదారిపై రాస్తారోకో చేశారు. ఒక వైపు జోరున వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా ఆందోళనకారులు కొనసాగించారు. ఏలూరులో వైసిపి కార్యకర్తలు రోడ్డుపై గుండు గీయించుకున్నారు. భీమవరంలో ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ జరిగింది.
క్షీణిస్తున్న మంత్రి తోట సతీమణి ఆరోగ్యం
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కాకినాడలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మంత్రి తోట నర్సింహం భార్య, వీరవరం గ్రామ సర్పంచ్ తోట సరస్వతి (శ్రీవాణి) ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె దీక్ష సోమవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. భానుగుడి జంక్షన్‌లోని ఆమరణ నిరాహార దీక్షా శిబిరానికి పలు ప్రజా సంఘాలు చేరుకుని శ్రీవాణికి మద్దతు తెలిపాయి. శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె తండ్రి, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ, భర్త, రాష్ట్ర మంత్రి తోట నరసింహం తదితరులు పరామర్శించారు. ఆమె ఆమరణ దీక్షకు మద్దతుగా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ సతీమణి భవానీరాం రిలే దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి ముట్టడించారు.
కర్నూలులో అప్రకటిత కర్ఫ్యూ
కర్నూలు: సమైక్యాంధ్ర కావాలంటూ కర్నూలు జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అప్రకటితబంద్ వాతావరణం నెలకొంది. ఆర్టీసి బస్సు సర్వీసులు నిల్చిపోయాయి. ఎన్నడూ లేని విధంగా వరుస ఉద్యమాలతో జిల్లా హోరెత్తుతోంది. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారమివ్వకుండా ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మానవ హారం ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల జెఎసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేపట్టారు.
అనంతలో బంద్ విజయవంతం
అనంతపురం: సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి, వైకాపా ఇచ్చిన బంద్ పిలుపు సోమవారం అనంతపురం జిల్లాలో విజయవంతమైంది. ప్రజలు నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రమైంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, పెట్రోలు పంపులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. బస్సులు రోడ్డెక్కలేదు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మంగళవారం నుంచి ఎపి ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేపట్టనున్నారు. టిడిపి, వైకాపా నాయకులు దుకాణాలు మూయించి బంద్ విజయవంతం చేశారు. కులసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. హిందూపురంలో గజల్ శ్రీనివాస్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలపించిన గజల్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు పది వేల మంది హాజరయ్యారు.
మచిలీపట్నంలో సోమవారం విద్యార్థుల భారీ ర్యాలీ
నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద రాష్ట్ర విభజన వద్దంటూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు*
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో
సోమవారం నిర్వహించిన సమైక్యాంధ్ర ప్రదర్శన
సకల సమ్మెకు
సర్వ సన్నద్ధం
* విద్యుత్ ఉద్యోగులూ పోరుబాట
* ఆఫీసుల ఎదుట బలగాల మోహరింపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 12: సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టేందుకు విద్యుత్ శాఖలోని డిస్కం, ట్రాన్స్‌కో, జెన్కోలలో పనిచేసే ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం నగరంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. ముందుగా జిల్లాలవారీ జెఎసి కన్వీనర్, ఇతర కార్యవర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ నెల 16న సంబంధిత ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందించి ఆ తరువాత నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. తొలుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం 14రోజుల వ్యవధి లేకుండా సమ్మె నోటీసు ఇచ్చారంటూ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ నాగరాజు ప్రకటించారు. ఈ సమ్మెలో పాల్గొనేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటంతోపాటు కోల్పోయిన ఆదాయాన్ని సైతం వారి నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించినా ఎన్‌ఎంయు, ఇయు సంఘాల నేతలు మాత్రం పట్టుదలతో ఉన్నారు. మంగళవారం తెల్లవారుఝాము నుంచి ఏ డిపో నుంచి కూడా బస్సు రోడ్డెక్కబోదని వారు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ముందుజాగ్రత్త చర్యగా డిపోలలో సాయుధ పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మెలోకి వెళుతుండటంతో ముఖ్యమైన కార్యాలయాల ఎదుట కూడా బందోబస్తు నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల తరపున జెఎసి నేతలు సోమవారం హైదరాబాద్‌లో సిడిఎంఎ, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయాలకు వెళ్లి ప్రత్యక్షంగా సమ్మె నోటీసులు అందజేశారు.
వర్షంలోనూ ఆగని ఉద్యమాలు
గుంటూరు: సమైక్యవాదులు సోమవారం జిల్లాలో వర్షాన్ని సైతం లక్ష్యపెట్టక ఉద్యమబాట పట్టారు. గుంటూరు నగరంలో ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కాంక్షిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి చిత్రపటానికి శంకర్ విలాస్ సెంటర్‌లో క్షీరాభిషేకం చేశారు. టిడిపి నేతలు హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. నరసరావుపేటలోని రెడ్‌క్రాస్ భవన్‌లో 62 మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఎపిఎస్‌పిడిసిఎల్ సిఇ రాజబాపయ్య, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, డిఇ కెవిఎల్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. తెనాలిలో పబ్లిక్ బ్లడ్ డొనార్స్ క్లబ్ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి మార్కెట్ సెంటర్‌లో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ సెంటర్‌లో రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ శాంతియజ్ఞం జరిపారు.
శ్రీనివాస్ గజల్స్‌తో మార్మోగిన సమైక్య ఉద్యమం
హిందూపురం: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆలపించిన గజల్స్ సమైక్యవాదులను ఉర్రూతలూగించాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యదర్శి నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ తనదైన శైలిలో గజల్స్ ఆలపించి సమైక్యవాదులను ఉత్తేజపరిచారు. ఓ వైపు గజల్స్ ఆలపిస్తూనే మరోవైపు ఉద్యమం తీవ్రత అవశ్యకతపై ప్రసంగించిన తీరుకు మంచి స్పందన లభించింది. ఓరి తెలుగువాడా..., కలిసి ఉంటే కనకధార, కూలిపోనున్నదా మమతల సౌధం, మారదా పెద్దల మనసు, ఎట్లాగా అంటున్నావు బిడ్డా...హైదరాబాద్ మీఅడ్డా, పోరాడే శక్తి ప్రసాదించు దేవుడా...తదితర గజల్స్ ఉర్రూతలూగించాయి.
విశాఖపై కేంద్రం ఆరా!
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 12: సీమాంధ్ర రాజధాని కోసం ఇప్పటికే, గుంటూరు-విజయవాడల మధ్య, ఒంగోలు వద్ద రాజధాని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను, భూముల వివరాలను ప్రభుత్వం సేకరించిన కేంద్రం అదేవిశాఖపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విశాఖలో సుమారు 20వేల ఎకరాలు ఒకే చోట ఉండేలా చూడమని కేంద్రం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ జిల్లాలోని నలుగురు ఆర్డీఓలకు ఈమేరకు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం మధురవాడ, సబ్బవరం, విశాఖపట్నం-అనకాపల్లి మధ్య, విశాఖపట్నం-మధురవాడ మధ్య స్థలాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని అధికారులు పరిశీలించి ఒక నివేదికను పంపించనున్నారు.
మనోవేదనతో సమైక్యవాది మృతి
జామి, ఆగస్టు 12: రాష్ట్ర విభజన వార్త తట్టుకోలేక మరో గుండె ఆగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి పంచాయతీ కందిశ్రీరామపురం గ్రామంలో జామి వెంకటరావు(60) సమైక్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. సోమవారం ఉదయం దినపత్రికల్లో రాష్ట్ర విభజనకు సంబంధించిన వార్తలు చదువుతూ మనోవేదనకు లోనే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు.
విభజనపై మనస్తాపంతో ఒకరి మృతి
జగ్గయ్యపేట,: సమైక్యాంధ్ర విడిపోతోందనే ఉద్వేగంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లారీ ఎలక్ట్రికల్ కార్మికుడు గడ్డం రామారావు గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆదివారం పగలంతా జెఎసి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న రామారావు రాష్ట్రం విడిపోతోందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, రాత్రికి గుండెపోటు రావటంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. రామారావు మృతదేహాన్ని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జెఎసి నేతలు తన్నీరు నాగేశ్వరరావు, అబ్బాస్ అలీ, అనె్నపాక సుందరరావు, తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
వైకాపా నేతల ఆమరణ థీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 12: నిన్న వైకాపా అగ్రనేతల రాజీనామా, నేడు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టడంతో సమైక్య ఉద్యమంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓ పక్క సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమం సెగలు గక్కుతోంది. మరోపక్క ఈ ఉద్యమంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రధాన పార్టీలు తపన పడుతున్నాయి. ఇందులో వైకాపా దూకుడు మీద ఉంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిథులు ప్రకటనలకే పరిమితం కాగా సోనియాగాంధీ 2014 ఎన్నికలలో తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కుటిల రాజకీయ నీతిని ప్రదర్శించి ఆంద్రప్రదేశ్‌లో ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని ముక్కలు చేసేందుకు ప్రయత్నించడం శోచనీయమని వైకాపా జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో శిబిరంలో వారు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నించడం సహేతుకం కాదన్నారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉవ్వెత్తున ఉద్యమ జ్వాల
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖ నగరంలో సోమవారం ఏ రోడ్డు చూసినా సమైక్య ఉద్యమకారులతో నిండిపోయాయి. స్వచ్ఛందంగా పలు సంఘాలు ఊరేగింపులు నిర్వహించాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి ఉద్యమకారులు జగదాంబ, మద్దిలపాలెం, జివిఎంసిల వద్దకు చేరుకుని నిరసనలు తెలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్‌జిజిఓలు, పశుసంవర్థకశాఖ ఉద్యోకులు సంయుక్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కెజిహెచ్ డాక్టర్లు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్శిటీలో మళ్లీ సోమవారం నుంచి ఊపందుకుంది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఎయు పోలీసులు ఆంక్షలు విధించడంతో వారంతా స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోలు బంక్‌లకు మంగళవారం బంద్ ప్రకటించాయ. అనకాపల్లిలో బెల్లం మార్కెట్‌ను సోమవారం బంద్ చేశారు. విశాఖ నగరంలో చిల్లవర్తక సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ఒంటెలు, గుర్రాలతో నిరసనలు తెలియచేశారు. విశాఖ నగరంలో జర్నలిస్ట్‌లు కూడా ర్యాలీ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై అభ్యంతరం తెలియచేశారు. బర్మా కాందిశీకులు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టాక్సీ వర్కర్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
కొనసాగుతున్న దీక్షలు
విజయనగరం: విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు.. నిరసనలు.. రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. సోమవారం సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో చీపురుపల్లిలో 12వేల మందితో మూడు కిలోమీటర్ల మేర భారీ కవాతు నిర్వహించారు. చీపురుపల్లి సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ నారు సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ విప్ గద్దె బాబూరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ కర్రీ టిఫిన్, మద్యం బెల్టుషాపును ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. సీతానగరంలో కాంగ్రెస్ నేత బొత్స లక్ష్మణరావు ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జయముణి మాట్లాడుతూ అవసరమైతే సమైక్యాంధ్ర కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేసింది. వైకాపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎపి ఇంజనీర్స్ ఫోరమ్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మయూరి జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మానవహారం చేపట్టారు. పూసపాటిరేగలో సమైక్యవాదులు నిర్వహించిన దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో రాములప్పడు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గుర్లలో వైకాపా ఆధ్వర్యంలో కెసిఆర్ శవయాత్రను నిర్వహించారు.
రగులుతున్న సమైక్యజ్వాల
శ్రీకాకుళం: పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాట కార్యాచరణ కమిటీ సారథ్యంలో గర్జన సభ నిర్వహించారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఎకె ఆంటోని కమిటీ అంటూ హడావుడి చేస్తోందని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహరనాయుడు ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర విభజనపై గర్జించారు. టూవీలర్స్ కన్సల్టెంట్ ప్రతినిధులు, ఫైనాన్సర్లు, మోటార్‌మెకానిక్, అసోసియేషన్ ప్రతినిధులు బైక్‌ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు హైవేపై రాస్తారోకో చేశారు.
నినాదాల జోరు..సమైక్య హోరు
ఎన్‌జిఓ, విద్యార్థి జేఏసి ర్యాలీ.. కెసిఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు/ఒంగోలు/తిరుపతి, ఆగస్టు 12: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా సకల జన సమ్మెకు నెల్లూరుజిల్లా సమాయత్తమైంది. ఎన్‌జిఓలతోపాటు గ్రూప్-4 ఉద్యోగులు, ఏపిఎస్ ఆర్టీసి, రెవెన్యూ, ఇలా అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు కార్మిక వర్గాలు కూడా సకల సమ్మెకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నారు. అన్ని విద్యాసంస్థలన్నీ మూతపడనున్నాయి. కూరగాయల మార్కెట్‌కు కూడా తాళాలు వేస్తున్నామని వ్యాపారుల సంఘం ఇప్పటికే వెల్లడించింది. సోమవారం ఉదయం సకల సమ్మెకు సన్నాహకంగా నగరంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఏబిఎం స్కూల్ కాంపౌండ్ నుంచి ఎన్‌జిఓలు, విద్యార్థులు, జంగమ కులస్తులు, హిజ్రాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెసిఆర్ దిష్టిబొమ్మను పాడెకు కట్టి శవయాత్రగా ఊరేగించారు. పాడెకు ముందు పెద్దసంఖ్యలో జంగమలు తమ వెంట తెచ్చిన శంఖాలతో ఊదరగొట్టారు. సమైక్య శంఖారావం నెల్లూరు నగర వీధుల్లో హోరెత్తింది. స్థానిక గాంధీబొమ్మ కూడలి వద్ద కెసిఆర్ దిష్టిబొమ్మకు దహనకాండ చేపట్టారు. స్థానిక విక్రమ సింహపురి యూనివర్శిటీ కళాశాల అధ్యాపకవర్గం కూడా సమైక్యాంధ్ర వర్ధిల్లాలంటూ నగర వీధుల్లో ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మహోగ్రరూపందాల్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం అర్ధరాత్రినుండి జిల్లావ్యాప్తంగా పాలన స్ధంభించనుంది. ఆర్‌టిసి బస్సులు రోడ్లక్కెపరిస్ధితి లేకపోవటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోనున్నారు. ఎన్‌జివోసంఘ జిల్లానాయకులు, విద్యార్ధి జెఎసినాయకులు షేక్ అబ్దుల్ బషీర్, రాయపాటి జగదీష్ మట్లాడుతూ తమవిధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
న్యాయవాదుల దీక్షలు - పండ్ల వ్యాపారుల ధర్నా
తిరుపతి: విభజన జ్వాలలు ఏమాత్రం చల్లారలేదు. రోజురోజుకు ప్రజాగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. సమైక్య నినాదంతో చిత్తూరు జిల్లా హోరెత్తుతోంది. రాష్ట్ర విభజన మనస్థాపంతో కెవిబిపురంలో ఎస్వీయూ విద్యార్థి పోతురాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిలోకం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. చిత్తూరు, మదనపల్లి,పలమనేరు,శ్రీకాళహస్తి పట్టణాల్లో ఉద్యమాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఎస్వీయూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఎస్వీయూ జెఎసి నేతలు తుడా ఇందిరామైదానంలో మా తెలుగుతల్లికి మల్లెపూ దండ అంటూ సమైక్య సామూహిక గళార్చన చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర హోమం నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో వర్షంలో సైతం తెలుగుతల్లి విగ్రహం వద్ద రాస్తారోకో చేసి, మానవహారం ఏర్పాటుచేశారు. ఎపిఎస్‌పిడిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. నాలుగుకాళ్ల మండపం వద్ద కేబుల్ ఆపరేటర్ల దీక్షలు,ఎస్వీయూ ఎదుట విద్యార్థులు దీక్షలు 8వరోజు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను ఎట్టిపరిస్ధితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని ఎస్వీయూ జేఏసి కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.