విశాఖపట్నం, ఆగస్టు 13: సమైక్యాంధ్ర ఉద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగసిపడింది. సాగరతీరంలో ఉద్యమ కారులు నిప్పులు కురిపించారు. రాష్ట్ర విభజన తమకు ఏవిధంగాను సమ్మతం కాదంటూ ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, ప్రజా సంఘాల ప్రతినిధుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీమాంధ్రుల సమైక్య నినాదానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మంగళవారం తెల్లవారు జామునుంచి సమైక్యాంధ్ర ఉద్యమ కారులు తమ నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. నగర శివార్లతో పాటు నగర పరిధిలో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలను పక్కనపెట్టి ఉద్యమంతో భాగస్వామ్యమయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లపై టైర్లను అంటించి మంటలు పెట్టి వాహనాలు తిరక్కుండా అడ్డుకున్నారు. ఒకటీఅరా తిరుగుతున్న ఆటోలను, ద్విచక్ర వాహన దార్లను సైతం అడ్డుకుని సమైక్యాంధ్ర కోసం త్యాగం చేయాలంటూ వేడుకున్నారు. గతంలో జరిగిన బంద్‌ల తీరుకు భిన్నంగా ఈసారిమాత్రం యువకులు, విద్యార్థులు స్వచ్ఛంధంగా ముందుకు రావడంతో ఈసక్సెస్ సాధ్యమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాల యాజమాన్యాలు స్వచ్చందంగానే మూసివేసి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. ఇక పెట్రోల్ బంక్‌లు, సినిమాహాళ్లు బంద్‌కు మద్దతుగా మూసివేశారు.
మద్దిలపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమ కారులు నిరసన తెలుపుతుండగా పోలీసులతో ఘర్షణకు దిగారు. మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డును దిగ్భంధించేందుక టైర్లను కాల్చి వాహనాలను అడ్డుకుంటున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈసంద్భంలో కొంతమంది సమైక్య వాదులు లారీలు, మూసిఉన్న దుకాణాలపై రాళ్లను రువ్వడంతో సల్ప లాఠీచార్జ్ జరిపారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్‌కు తరలించారు.
జివిఎంసిలో విధులకు హాజరుకాని సిబ్బంది
సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ కార్యాచరణ ఇచ్చిన పిలుపు మేరకు జివిఎంసిలో సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అధికారులు మినహా సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాలేదు. జివిఎంసిలోని పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వాహణ విభాగాలు మత్రం అత్యవసర సర్వీసుల కింద పనిచేశాయి. జివిఎంసి గుర్తింపు యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం ఆనందరావు, గత గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు వివి వామనరావు తదితరులు సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. జివిఎంసి అధికారుల సమాఖ్య (గోవా) ప్రతినిధులు సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాకపోవడంతో జివిఎంసి బోసిపోయింది. నగర పరిధిలో సమ్మె ప్రభావం తోడుకావడంతో జివిఎంసికి సందర్శకుల రాకకూడా కన్పించలేదు. ఈసందర్భంగా జివిఎంసి టౌన్‌ప్లానింగ్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పెదవాల్తేరు, ఆంధ్రాయూనివర్శిటీ, మద్దిలపాలెం మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
సోనియాకు హిజ్రాల శవయాత్ర
సమైక్యాంధ్రకు మద్దతుగా హిజ్రాలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. భూపేష్‌నగర్ నుంచి పెద్ద సంఖ్యలో హిజ్రాలు జగదాంబ కూడలి మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు రాష్ట్రాన్ని విడదీసే కుట్రపన్నిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మకు అంతిమయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
సమైక్య ఉద్యమం తీవ్రతరం
* తెదేపా అధ్యక్షుడు జిల్లా రామానాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 13: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినేత్రి పన్నిన కుట్రను తాము ఎదుర్కొంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి తెదేపా ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. నర్సీపట్నం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. విభజనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారని, ఇప్పుడు వైఎస్‌కు సంబంధం లేదంటున్నారని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటేందుకు తాము సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలుగుజాతి సమైక్యంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.
భూముల సేకరణ వేగవంతం
* 40 మంది తహశీల్దార్లకు ప్రత్యేక బాధ్యత
విశాఖపట్నం, ఆగస్టు 13: సమైక్యాంధ్రకు మద్ధ్థుగా ఒకవైపు సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండగా, మరోపక్క రాష్ట్ర విభజన జరిగితే విశాఖను రాజధాని చేయాలనే అంశంపై తెరపైకి వచ్చింది. అయితే రాజధాని ఏర్పాటు కోసం అవసరమైన ప్రభుత్వ భూములు ఈ జిల్లాలో లేవని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నలుగురు ఆర్డీవోలు, దాదాపు 40 మంది తహశీల్దార్లు భూముల గుర్తింపుపైనే ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిసింది. సీమాంధ్రలో 13 జిల్లాలకు సంబంధించి ఇటువంటి ఆదేశాలే వచ్చినా, విశాఖకే ఎక్కువ ప్రధాన్యతనిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20 వేల ఎకరాల వరకు సమకూర్చేందుకు రెవెన్యూ నానా తంటాలు పడుతోంది. ఒకేచోట ఇంతమొత్తంలో భూములు సేకరించడం సాధ్యపడటంలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో రైతుల నుంచి సేకరించడం ఒక్కటే మార్గమని భావిస్తున్న రెవెన్యూ వర్గాలు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాయి. అయితే దీని కంటే ముందుగా అనకాపల్లి, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లో ఒకేచోట పెద్ద మొత్తంలో భూములు ఉంటాయనే ఆశతో పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం దాదాపు 22 వేల ఎకరాల భూములను సేకరించాల్సి వచ్చింది. దీని కోసం రైతుల నుంచి భారీగానే భూములు తీసుకోవాల్సి ఉంటుంది. భూముల సేకరణ తప్పనిసరి అయితే ఒకేచోట 20 వేల ఎకరాలు ఉండాల్సినందున ఏ విధంగా సేకరించాలనే ఆలోచనలో రెవెన్యూ వర్గాలు పడుతున్నాయి. అయితే రాష్ట్రంలో గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో రాజధాని కోసం అవసమైన భూములను గుర్తించాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.
ప్రయాణికులపై దొంగల దాడి
విశాఖపట్నం, ఆగస్టు 13: గౌహతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో దొంగలు భీభత్సవం సృష్టించారు. మత్తుగా తాగిన మైకంలో బీర్ బాటిల్‌ను పగులగొట్టి మరీ ప్రయాణికులను బెదిరించి వారి నుంచి దాదాపు వెయ్యి రూపాయలు దోచుకున్న ఇద్దరి దొంగలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మర్రిపాలెం స్టేషన్ నుంచి నెమ్మదిగా నడుస్తున్న త్రివేండ్రం-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన ఇద్దరు దొంగలు ఎక్కారు. అప్పటికే పూటుగా తాగిన మైకంలో జనరల్ బోగీలోనున్న ఇద్దరు ప్రయాణికులను పగులగొట్టిన బీర్ బాటిల్ చూపి బెదిరిస్తూ వారి వద్దనున్న డబ్బును డిమాండ్ చేశారు. దీంతో బయపడిన వారిద్దరు సుమారు వెయ్యి రూపాయలు ఇచ్చేసారు. ఈలోపు స్టేషన్‌కు చేరుకున్న ఈ ఎక్స్‌ప్రెస్ బోగీలో ఉండే వీరిద్దర్ని గమనించిన పోలీసులు వెంటనే దించి విచారించారు. నేరం అంగీకరించడంతో వీరద్దరిపై కేసులు నమోదు చేశారు.