న్యూఢిల్లీ, ఆగస్టు 13: జిడిపిలో ద్రవ్యలోటును 3.7 శాతానికి పఠిమితి చేసేందుకు, తగ్గిపోతున్న రూపాయి విలువను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సోమవారం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల సుంకాన్ని 10 శాతం పెంచింది. ‘మేలిమి బంగారం, ప్లాటినంపై ఉన్న కస్టమ్స్ సుంకం 8 శాతం నుంచి 10 శాతం, వెండిపై ఆరు శాతం ఉన్న సుంకం 10 శాతం పెరుగుతుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. వీటితోపాటు ముడి బంగారం/గాఢ బంగారం/నాణాలు,కడ్డీలు, వెండి కడ్డీలు తదితరాలపై 7 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతం వరకు పెరుగుతుంది. ‘వీటన్నింటి వల్ల దిగుమతుల సుంకం రూపేణా (దిగుమతులు ఇప్పుడున్న స్థాయిలో కొనసాగితే) 4830 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది’అని ఆ మంత్రిత్వ శాఖ తెలియచేసింది. ఇక వెండితో తయారయ్యే వస్తువులు, రాగి, జింక్, లెడ్‌స్మెల్టింగ్ వస్తువుల దిగుమతి సుంకం 4 శాతం నుంచి రెట్టింపయి 8 శాతానికి పెరుగుతుంది. దిగుమతుల సుంకం పెంపు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇవి కాక అముఖ్య వస్తువులపై కూడా దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితా సిద్ధం కాగానే పెంపును వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పెరిగిన బంగారం ధర
న్యూఢిల్లీ ఆగస్టు 13: ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాన్ని 10 శాతం పెంచడంతో మంగళవారం ధర ఒక్కసారిగా 10 గ్రాములు 830 రూపాయలు పెరిగింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో స్టాకిస్టులు, నగల తయారీదారులు సుంకం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో ముమ్మరంగా కొనుగోళ్లకు పాల్పడడంతో ఈ ధర పెరిగి నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే బులియన్ వర్తకులు మాత్రం 10 గ్రాముల ధర 600 రూపాయలు పెరుగుతుందని అంటున్నారు. దిగుమతి సుంకం పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది తప్ప దిగుమతులు తగ్గవని, పైగా బంగారం దొంగ రవాణా పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా చెన్నైలో 10 గ్రాముల బంగారం 830 రూపాయలు పెరిగి 29,810 రూపాయలకు చేరగా, ముంబయిలో 260 రూపాయలు పెరిగి 29,660 రూపాయలకు చేరింది. కోల్‌కతాలో 600 పెరిగి 29,965 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 565 పెరిగి 10 గ్రాముల ధర 29,285 రూపాయలకు చేరింది.