
ముంబయి, ఆగస్టు 13: దేశంలో కొత్త బ్యాంకుల ఏర్పాటు, చిన్న బ్యాంకులు ఏకీకృతం అవుతున్న నేపథ్యంలో భారీ బ్యాంకుల ఏర్పాటు విషయంలో అప్రమత్తత అవసరమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు మంగళవారం హెచ్చరించారు. 2008 సంవత్సరం ఆర్థిక సంక్షోభాన్ని ఉదహరిస్తూ,‘ఏకఛత్రాధిపత్య గల భారీ బ్యాంకుల ఏర్పాటు కంటె నాలుగైదు పెద్ద బ్యాంకులు ఉంటే సరిపోతుందని, మరీ భారీ బ్యాంకుల వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పత్పన్నమవడంతో పాటు అదే స్థాయిలో కూలిపోయే ప్రమాదం కూడా ఉంది’అని ఆయన హెచ్చరించారు. ‘అటువంటి పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే వీలుండడమే కాక ప్రభావం అంతే తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎఫ్‌ఐసిసి నిర్వహించిన ఎఫ్‌ఐబిఎసి బ్యాంకింగ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. బ్యాంకుల ఏకీకృతం వల్ల మూలధనం వృద్ధి చెందడం, రుణాల మంజూరులోవృద్ధి, జిడిపి వృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లభ్యత, కార్పొరేట్లకు ఆర్థిక అవసరాలు తీరడం, నిర్వహణ సామర్ధ్యం పెరగడం, పర్యవేక్షణపై దృష్టిపెరగడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆయితే వాటి ఏకఛత్రాధిపత్యం పెరిగే కొద్దీ మార్కెట్‌లో అవాంఛనీయ పోటీ, నిధులు పక్కదారి పట్టడం, కొల్లగొట్టడం వంటివి పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. అయితే ప్రపంచ స్థాయి బ్యాంక్‌ల ఏర్పాటుకు, ఎదిగేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. మనదేశానికి చెందిన స్టేట్ బ్యాంక్ ప్రపంచంలో భారీ బ్యాంక్‌లలో 60 వ స్థానంలో ఉన్నా ఆ స్థాయికి చేరేందుకు చాలా సమయం పట్టిందన్నారు. కాగా భవిష్యత్‌లో మనదేశానికి చెందిన బహుళ బ్యాంకులు ఏర్పడే వీలుందని ఆయన తెలిపారు.1991లో నరసింహం కమిటీ నివేదిక తర్వాత బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ పెరిగిందని చెప్పారు. చిన్న బ్యాంకుల ప్రయోజనాలను ఆయన వివరిస్తూ, అవి ఆర్థిక సమ్మిళతానికి దోహదపడడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు, ఇతర అసంఘటిత రంగాలకు ఉపయోగకరంగా సేవలను అందచేస్తాయన్నారు. కానీ అమెరికాలో చిన్న బ్యాంక్‌లు వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్‌కు రుణాలు ఇవ్వడం ద్వారా నష్టాలను ఎదుర్కొని చితికి పోయాయని చెప్పారు. కాగా డిపాజిట్లు సేకరించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్‌బిఎఫ్‌సిలు) ఆర్‌బిఐ నియంత్రించడం మంచిదని, అంతేకాని వాటిని యునైటెడ్ ఫైనాన్షియల్ అథారిటీ యజమాయిషీ కింద ఉంచడం వల్ల ఆర్థిక సుస్థిరత దెబ్బతినే వీలుందని అన్నారు. ఈ సదస్సులో అన్ని బ్యాంకుల ఎండిలు, చైర్మన్లు, సిఇవోలు ఇతర ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొన్నారు. (చిత్రం) ముంబయిలో మంగళవారం ఎఫ్‌ఐబిఎసి సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్‌బిఐ గవర్నర్ డి.సుబ్బారావు, సదస్సులో పాల్గొన్న యాక్సిస్ బ్యాంక్ ఎండి శిఖాశర్మ, బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ విఆర్ అయ్యర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ కెఆర్ కామత్, ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సిఎండి ఎం.నరేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్ సిఇవో చందా కొచ్చార్.