ముంబయి, ఆగస్టు 13: ఆటోరంగంలో మాంద్యం పరిస్థితులు నెలకొన్నా మహీంద్ర అండ్ మహీంద్ర జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంఘటిత నికర లాభం 13.46శాతం అధికంగా సాధించి 1,164.6 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. వ్యవసాయ దారుల సామగ్రి అమ్మకాలు బాగుండడం, ఖర్చు అదుపు చేయడం తదితర కారణాల వల్ల ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ 1,026.4 కోట్ల రూపాయల నికర లాభాన్ని గడించింది. ఆదాయం 17,670.81 కోట్ల నుంచి పెరిగి ఈ త్రైమాసికంలో 19,356.03 కోట్లు సాధించినట్లు పేర్కొంది. (చిత్రం)ముంబయిలో వార్షిక సమావేశంలో మాట్లాడుతున్న వమహీంద్ర కంపెనీ చైర్మన్, ఎండి ఆనంద్ మహీంద్ర.
టాటా స్టీల్ లాభం రూ.1139 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో 90.51 శాతం వృద్ధి సాధించి 1,139 కోట్ల రూపాయల మేర సంఘటిత నికర లాభాన్ని ఆర్జించినట్లు టాటా స్టీల్ మంగళవారం ప్రకటించింది. పన్నుల చెల్లింపులో గణనీయమైన మొత్తం తగ్గడం ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. కిందటేడాది ఏప్రిల్-జూన్ మాసాల్లో 597.88 కోట్ల రూపాయల మేర నికర లాభం సాధించినట్లు టాటా స్టీల్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో 2013-14 సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర అమ్మకాలు 3 శాతం తగ్గి 32,550.21 కోట్ల రూపాయలు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో టాటా స్టీల్ అమ్మకాల ద్వారా 33,547.73 కోట్ల రూపాయలు ఆర్జించింది. పన్నుల రూపేణా గత త్రైమాసికంలో 898.63 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయగా, ఈ త్రైమాసికంలో 61 శాతం తగ్గి 351.39 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో దేశీయ వ్యాపారలావాదేవీల వల్ల కంపెనీ ఏకీకృత నికర లాభం 1,356.11 కోట్లు రాగా గత సంవత్సరం 1356.56 కోట్ల రూపాయలు వచ్చింది. ఏకీకృత అమ్మకాలు 6.15 శాతం పెరిగి ఈత్రైమాసికంలో 9,363 కోట్ల రూపాయలు ఆర్జించగా గత సంవత్సరం 8,820.19 కోట్లు సాధించింది.
డిఎల్‌ఎఫ్ అమ్మకాల ద్వారా రూ.2430 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెట్టింపు జరిపి 2,430 కోట్ల రూపాయలు ఆదాయం సాధించినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్ మంగళవారం తెలిపింది. అంతేకాక ఈ ఆదాయం ద్వారా 6 శాతం రుణాన్ని తీర్చినట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ 30 నాటికి 20,369 కోట్ల రూపాయలు రుణం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 17,500 కోట్ల రూపాయు తీర్చాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
హిందాల్కో లాభం 12 శాతం వృద్ధి
ముంబయి, ఆగస్టు 13: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.61 శాతం పెరిగి 474 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ మంగళవారం ప్రకటించింది. ఇతరాదాయాలు పెరగడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 424.77 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఇలా ఉండగా దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, వివిధ శాఖల నుంచి అనుమతులు రావడంలో జరుగుతున్న జాప్యం తదితర కారణాల వల్ల ఒడిసాలో అల్యూమినియం శుద్ధి కర్మాగారం, జార్ఖండ్ అల్యూమినియం ప్రాజెక్టుల పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నికర అమ్మకాలు 3.31 శాతం తగ్గి 5,766.69 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని, కాపర్ వ్యాపారం వల్ల ఆదాయం 3,635.77 కోట్లు తగ్గిందని కంపెనీ తెలిపింది. మాంద్యం వల్ల స్మెల్టర్‌లో కాపర్ ఉత్పత్తి క్షీణించినట్లు వెల్లడించింది. అల్యూమినియం వ్యాపారం 7.2 శాతం పెరిగి 2,211.14 కోట్ల రూపాయలు సాధించినట్లు పేర్కొంది.
ఐవోసికి రూ.3,093.23 కోట్లు నష్టం
న్యూఢిల్లీ, ఆగస్టు 13: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసి) నికర నష్టం తగ్గి 3,093.23 కోట్ల రూపాయలు వచ్చింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఐవోసికి 22,450.95 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. టర్నోవర్ 96,860.69 కోట్ల నుంచి పెరిగి 110,466.61 కోట్లకు చేరింది. ముడి చమురును శుద్ధి చేసి ఇంధన రూపంలోకి మార్చడంతో ప్రతి బ్యారల్‌కు 1.67 డాలర్ల వంతున కంపెనీకి ఆదాయం లభించింది. కిందటేడాది ఈ మార్జిన్ 4.81 డాలర్ వంతున నష్టం సంభవించేది.