విజయనగరం/పార్వతీపురం, ఆగస్టు 20: సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సీమాంద్ర ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం యోచించినా తాము బెదిరేది లేదని ఎపి ఎన్‌జివో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా పార్వతీపురం, తరువాత జిల్లా కేంద్రంలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం కెసిఆర్ మిలియన్ మార్చ్ చేస్తే, తాము సమైక్యాంధ్ర కోసం త్వరలో కోటి మందితో మార్చ్ చేయనున్నామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు 4.5 లక్షల మంది ఉన్నారని వీరందరినీ జైల్లో పెట్టడానికి దమ్ముందా అని సవాల్ విసిరారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న నాయకులను అరెస్ట్ చేస్తే, ప్రజలే ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపించాలని కోరారు. రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి మద్దతుగా నిలబడాల్సిన ఎంపిలు ఢిల్లీలో ఉండి ఇంకా ఏమి వెలగబెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో కోటి మందితో హైదరాబాదులో భారీ బహిరంగ సభ పెట్టడానికి యోచిస్తున్నామని, ఇందుకు సమైక్యవాదులు తమ పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌తో అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధాలున్నాయన్నారు. ఇపుడు హైదరాబాద్ మాది అనే హక్కు ఎవరికీ లేదన్నారు. హైదరాబాద్ అందరిదీ అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే నాయకులన్నారు.
ఎన్‌జివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
english title:
k
Date:
Wednesday, August 21, 2013