విశాఖపట్నం, ఆగస్టు 20: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రకటన స్వపక్షంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ సృష్టించుకున్న సామ్రాజ్యం బీటలువారే పరిస్థితి కనిపిస్తోంది. విభజనను నిరసిస్తూ అన్ని పార్టీలూ సమైక్యాంధ్ర ఉద్యమంలోకి దిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ జెఎసిలకు మద్దతుగా నిలబడి ఉద్యమంలో చోటు దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామారావు, విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు తమ పదవులకు రాజీనామాలు చేసినట్టు ప్రకటించి, ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. పిసిసి అధ్యక్షునిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయకపోవడం, ఉద్యమం ఆరంభమై 20 రోజులవుతున్నా, కనీసం ఒక్కసారి కూడా విజయనగరం రాకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర విభజనపై ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఆయన వ్యవహరించకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. గత పదేళ్ళుగా విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఇప్పుడా పరిస్థితి రాష్ట్ర విభజన నిర్ణయంతో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు రాజీనామాలు చేసి ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన సందర్భంలో బొత్సను కలిసిన ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ పదవిని వదులుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు బొత్స ససేమిరా అన్నారు. దీంతో విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య బొత్స ఝాన్సీ కూడా పదవికి రాజీనామా చేయకపోవడం పట్ల స్వపక్షీయులు, ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా, మేనల్లుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరు రాజీనామాలు చేసినట్టు ప్రకటించినా, స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వలేదంటూ టిడిపి నేత అశోకగజపతిరాజు పాయింట్ లేవనెత్తారు. ఉత్తరాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. కనీసం ఉద్యమంలోకి రాలేనటువంటి బాలరాజు కూడా తను సమైక్యవాదినేనంటూ సమయం దొరికినప్పుడల్లా ప్రకటిస్తున్నారు.
- ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత -
english title:
s
Date:
Wednesday, August 21, 2013