
గుంటూరు, ఆగస్టు 20: ఒకపక్క రాష్ట్ర విభజనకు అనుకూలమేనని లేఖ ఇచ్చిన చంద్రబాబు మరోపక్క సీమాంధ్రలో ఆత్మగౌరవం పేరుతో బస్సుయాత్ర చేస్తానంటూ బయలుదేరుతున్నారని, ఆయన ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తారో చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిలదీశారు. గుంటూరులో ఆమె చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారం రెండోరోజుకు చేరింది. తనను కలిసిన మీడియాతో వేర్వేరు అంశాలపై విజయమ్మ మాట్లాడారు. విభజన ప్రకటన రాకముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, అదేసమయంలో టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసివుంటే విభజన ప్రకటన నిలిచిపోయేదన్నారు. రెండు ప్రాంతాల్లో ఓట్లు, సీట్ల కోసం ప్రయత్నిస్తున్న బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కడుపుమండిన ఎపిఎన్జీవోలు ఆందోళన చేస్తుంటే వారిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అత్యంత దారుణమైన విషయమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి అన్నిరకాలుగా భద్రత కల్పిస్తామని చెప్పారు. వృథా అవుతున్న మిగులు జలాలను, వరదనీటిని సద్వినియోగం చేసుకుని కరవు ప్రాంతాలను సైతం సస్యశ్యామలం చేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సాగునీటి పథకాల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. రైతుల మోములో చిరునవ్వులు చూసేలా వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని సాకారం చేయాల్సిన ప్రభుత్వం నిలువునా నిర్లక్ష్యం చేసి కలలకే పరిమితం చేసిందన్నారు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు సకాలంలో నీటిని అందించి వరదలు, తుఫాన్‌ల నుంచి పంటలను రక్షించేందుకు చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవటం దారుణమన్నారు.
‘
గుంటూరులో ఆమరణ దీక్షలో వైఎస్ విజయమ్మ