విజయవాడ, ఆగస్టు 20: సమైక్యాంధ్ర ఉద్యమం మహోద్ధృతంగా సాగుతోంది. ఎన్జీఓస్ పిలుపు మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగ జెఎసి ఆధ్వర్యాన హైదరాబాద్ - చెన్నై జాతీయ రహదారిని గొల్లపూడి వద్ద దిగ్బంధించారు. కోల్‌కత్తా - చెన్నై జాతీయ రహదారిని రామవరప్పాడు రింగు సెంటర్‌లో దిగ్బంధించి మానవహారం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, ఎపీఎన్జీఓస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, విద్యార్థి సంఘాల నాయకులు దీక్షలు చేశారు. ముత్యాలంపాడులో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిల్ కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర విభజనపై మాక్ కోర్టు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగానే వుండాలని తీర్పిచ్చారు. ఐఎంఎ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ 15కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని నష్టపోయింది.
కృష్ణా జిల్లావ్యాప్తంగా
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర కోసం పోరాటం రానురానూ మహోద్యమంగా మారుతోంది. మంగళవారం జిల్లా అంతటా ఆందోళనలు హోరెత్తాయి. జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఉదయం నుండి రాత్రి వరకు ఆందోళనకారులు రోడ్లపై నిరసనలు తెలిపారు. జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నారుూబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి కోనేరు సెంటరులో ‘క్షవర దర్బారు’ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు ప్రధాన రహదారిని దిగ్బంధించి సమైక్యాంధ్ర ప్రమిదలతో అలంకరించారు. పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రాజీవ్, ఇందిరా, సోనియా, రాహుల్, కెసిఆర్ మాస్క్‌లతో సమైక్యాంధ్రపై వీధినాటకం ప్రదర్శించారు. బంటుమిల్లిలో బంద్ జరిపి బైక్ ర్యాలీ, ఉయ్యూరులో 250 ఎడ్లబండ్లతో ప్రదర్శన, మహాధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన ‘కెసిఆర్ తిట్ల సభ’ ఉద్యమకారులను, పట్టణవాసులను ఆకర్షించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు తిట్ల సభ నిర్వహించి శోష వచ్చేవరకు కెసిఆర్‌ను తిట్టిపోశారు. సమైక్యవాదులంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల దండకం వినిపించారు.
అట్టుడుకుతున్న గుంటూరు
గుంటూరు: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థుల పోరుబాటతో జోరందుకున్న సమైక్య ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, తెలుగుదేశం నేతల నిరవధిక నిరాహార దీక్షలతో సీమాంధ్రలోనే సమైక్య ఉద్యమానికి కేంద్రబిందువుగా మారిన గుంటూరు జిల్లా ప్రజా, వ్యాపార సంఘాల రిలే దీక్షలు, భారీ ప్రదర్శనలు, రాస్తారోకోలతో అట్టుడుకుతోంది. గుంటూరు నగరంలో ఎన్జీవోలు, న్యాయశాఖ ఉద్యోగులు, మెడికల్ రిప్స్, జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు జరిగాయి. కలెక్టరేట్ ఎదుట, శంకర్‌విలాస్ సెంటర్, లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, చుట్టుగుంట సెంటర్‌లో ఎన్జీవోలు మానవహారం నిర్వహించి, రోడ్డుపైనే వంటావార్పు జరిపి నిరసన తెలిపారు. ప్రైవేటు బస్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో బస్సులతో భారీ ప్రదర్శన నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. హిందూ కళాశాల సెంటర్‌లో నారుూబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
తిరుపతిలో సమైక్యాంధ్ర గజల్స్ ఆలపిస్తున్న గజల్ శ్రీనివాస్ * జనంతో నిండిన అనంతపురం నగర వీధులు* విజయవాడ కనకదుర్గమ్మ వారథి వద్ద స్తంభించిన ట్రాఫిక్