విశాఖపట్నం, ఆగస్టు 20: సీమాంధ్ర రోడ్లన్నీ జన సంద్రమయ్యాయ. ఎన్‌జిఓలు, కార్మికులు, వివిధ జెఎసిల ఆధ్వర్యంలో కోల్‌కతా-చెన్నై 16వ నెంబరు జాతీయ రహదారిని మంగళవారం దిగ్బంధించారు. విశాఖ నగరంలోని కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై ఎన్‌జిఓలు, పశు సంవర్థకశాఖ, వ్యవసాయశాఖ ఉద్యోగులు భారీ సంఖ్యలో వచ్చి బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి 10.45 గంటల వరకూ ఈ రోడ్డును దిగ్బంధించారు. హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాయకరావుపేట వై జంక్షన్ వద్ద ఉద్యోగ, ఉపాధప్యాయ వర్గాలతోపాటు, తోపుడుబండ్ల వ్యాపాలు, ఇతర జెఎసిలు కూడా హైవేపై సుమారు అరగంటపాటు బైఠాయించారు.విశాఖ నగరంలో ఎంసెట్ కౌన్సిలింగ్‌ను ఆర్టీసీ ఎన్‌ఎంయు కార్మికులు, ఎన్‌జిఓలు అడ్డుకున్నారు. రెండో రోజు కౌన్సిలింగ్ కూడా జరగలేదు. టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. విశాఖ నగరం నుంచి వివిధ ప్రదేశాలకు బయల్దేరుతున్న ప్రైవేటు బస్సులను ఆర్టీసీ కార్మికులు మంగళవారం అడ్డుకోవడంతో అవి ఇక్కడే నిలిచిపోయాయి.
కిషోర్ చంద్రదేవ్ రాజీనామాకు డిమాండ్
శ్రీకాకుళం: మంగళవారం జాతీయ రహదారిపై అడుగడుగునా రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఆటో కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం ముఖద్వారం వద్ద ఎన్టీవోల జెఎసీ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధించారు. సీతంపేట మండల కేంద్రంలో గిరిజనులు సమైక్య దీక్షల్లో పాల్గొని కేంద్ర మంత్రి కిషోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నేతలు దీక్షలు కొనసాగిస్తున్నారు.
అదే జోరు.. అదే హోరు
విజయనగరం: మంగళవారం పట్టణంలో ఉద్యోగ జెఎసి చైర్మన్ పి.అశోక్‌బాబు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఉద్యోగ జెఎసి, వై జంక్షన్ వద్ద న్యాయశాఖ, ఆర్టీసీ కార్మికులు రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్‌సింగ్‌ల మనస్సు మార్చాలని కోరుతూ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఐదు వేల కొబ్బరికాయలు కొట్టారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లిలో ర్యాలీలు నిర్వహించారు.
నడిరోడ్డుపై ఉద్యమకారుడు మృతి
రాజమండ్రి/ఏలూరు: గోదావరి జిల్లాల్లో ఉద్యోగులు మంగళవారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 16వ నంబరు జాతీయ రహదారిపై లాలాచెరువు, రావులపాలెం వద్ద ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. కాకినాడలో ఇంద్రపాలెం వంతెన, అచ్చంపేట, శంఖవరం, తాళ్లరేవు వద్ద కూడా ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు సాగిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. కోనసీమలోని బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో 121శివాలయాల్లో సమైక్యాంధ్రను రక్షించాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తూ పూజలు జరిగాయి. గొల్లప్రోలు కత్తిపూడి-పిఠాపురం రహదారికి అడ్డుగా తాపీ మేస్ర్తిలు గోడ కట్టి తమ నిరసనను తెలిపారు. రాజమండ్రిలో పశువైద్యులు, సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న గంగుల నాగవెంకట కృష్ణ(48) రోడ్డుపై నినాదాలు చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. భీమడోలుకు చెందిన సుతాని వెంకటేశ్వరరావు (55) గుండెపోటుతో మృతిచెందాడు. కాకినాడలో వెలసిన ఫ్లెక్సీలలో ఇద్దరు కేంద్ర మంత్రుల ఫొటోలు చీరలతో దర్శనమివ్వడం వివాదానికి తెర తీసింది. ఈ వ్యవహారం సమైక్యవాదుల్లో ఘర్షణకు కారణమైంది. జెఎన్‌టియుకె ప్రధాన ద్వారం వద్ద విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మంత్రులు ఎంఎం పళ్ళంరాజు, కె చిరంజీవి వారి పదవులకు రాజీనామా చేయకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ చీర కట్టి ఉన్న కేంద్ర మంత్రుల ఫొటోల ఫ్లెక్సీలను వర్సిటీ శిబిరం వద్ద సోమవారం రాత్రి జెఎన్‌టియుకె జెఎసి ఏర్పాటుచేసింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు అర్ధరాత్రి ఫ్లెక్సీలను తొలగించారు. ఉదయం జెఎన్‌టియుకె విద్యార్థులు ఘటనా స్థలికి చేరుకునేసరికి ఫ్లెక్సీలు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కాకినాడ జెఎన్‌టియుకె కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఎంసెట్-2013ను వాయిదా వేసినట్టు వర్సిటీ అధికార్లు బోర్డులు ఏర్పాటుచేశారు.
తిరుపతి సింహగర్జన
తిరుపతి: సమైక్యాంధ్ర అని ప్రకటించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వక్తలు పిలుపునిచ్చారు. శాప్స్, తిరుపతి సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం సమైక్యాంధ్ర సింహగర్జన జరిగింది. ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తనదైన శైలిలో కలిసి వుండే కనకదార కురిపించి చూపుదాం.. తెలుగుజాతి ఒకటేనని ముమ్మాటికి చాటుదాం.. అనే పాట, ఎట్లాగ అంటున్నావు బిడ్డా.. ఎట్లయితది హైదరాబాద్ నిలిచేది గడ్డా...అనే పాట.. వొయి తెలుగువాడ...అది అదె వెలుగువాడ.. అంటూ సమైక్యాంధ్రపై గేయాలు ఆలపించి ప్రజల్లో మరింత ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అహింసాయుత పద్ధతుల్లో ఉద్యమంచేసి డిమాండ్లు సాధించుకోవాలన్నారు.
వచ్చేనెల రేషన్ సరుకులు హుళక్కే
నెల్లూరు/ ఒంగోలు : సకల జన సమ్మెల్లో మంగళవారం నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలోకి వచ్చే సివిల్ స్టాక్ పాయింట్ల ఇన్‌చార్జిలంతా మెరుపుసమ్మెకు దిగారు. దీంతో వచ్చేనెల రేషన్ సరుకులు ప్రజలకు అందే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచే గెజిటెడ్ అధికారులు, ఎన్‌జిఓల నుంచి నాలగవ తరగతి సిబ్బంది వరకు అందరూ సకల జన సమ్మెలో అడుగులు వేస్తుండటం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచే సివిల్ స్టాక్ పాయింట్ ఇన్‌చార్జిలు సైతం సమ్మెలో పాల్గొందామంటే నిత్యావసర వస్తు సరఫరా పరిధిలో విధి నిర్వహణ దృష్ట్యా ఆచి తూచి వ్యవహరించారు. ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఉద్యమాలు మహోగ్రరూపం దాల్చుతున్నాయి. ఎరికివారే ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. పార్లమెంటు బయట, సమావేశాల్లోను సమైక్యాంధ్ర వాణిని వినిపిస్తున్నారు. దామచర్ల జనార్ధన్ సారధ్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ జరిగింది. సోనియాగాంధీ శవయాత్ర జరిగింది. పేస్‌కాలేజి సెంటరులోని జాతీయరహదారి దిగ్బంధించారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ 48గంటల దీక్షను సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టారు.
కొనసాగుతున్న ఆమరణ దీక్షలు
కడప: కడప జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఊపందుకుంది. సమైక్యాంధ్ర కోసం వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలకు మద్దతుగా భారీగా ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. మంగళవారం జమ్మలమడుగులో మూగ, చెవిటి, అంధులు కలిసి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రైల్వేకోడూరులో ఆమరణదీక్ష చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్షా శిబిరాన్ని సందర్శించిన విప్లవగేయ కళాకారిణి వంగపండు ఉష పాడిన సమైక్య గీతాలు ఆకట్టుకున్నాయి. దిష్టిబొమ్మ దహనాలు జోరుగా సాగుతున్నాయి. చెన్నూరు మండలం కొక్కరాయిపల్లెకు చెందిన జాల సుబ్బరాయుడు (50) టివిలో రాష్ట్రం విడిపోతోందనే ప్రచారాన్ని తట్టుకోలేక గుండె ఆగి మృతి చెందినట్లు బంధువులు చెప్పారు.
నిరసనలతో అట్టుడికిన అనంత
అనంతపురం: అనంతపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య సముదాయాల యజమానులు, కార్మిక, కర్షక, కుల సంఘాలు, మహిళలు, న్యాయవాదులు, వైద్యుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు స్ట్ఫారూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం
కర్నూలు: కర్నూలు జిల్లాలో సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. ప్రజలు పట్టుదలగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రశే్న లేదని సమైక్యవాదులు భీష్మించుకు కూర్చున్నారు. జిల్లాలో మంగళవారం విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎంసెట్ కౌనె్సలింగ్ రెండవ రోజు రద్దయింది. ప్రభుత్వ విద్యాసంస్థలు వరుసగా 20వ రోజు మూతబడ్డాయి.
తిరుపతిలో మంగళవారం జరిగిన సమైక్యాంధ్ర సింహగర్జన *విజయనగరంలో ‘సమైక్య’ ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన * రాజమండ్రిలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన ఉద్యోగులు