హైదరాబాద్, ఆగస్టు 21: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు పార్టీ నేతలు పరిటాల సునీత, సీతక్క, గుండు సుధారాణి, సత్యవతి రాథోడ్, శోభా హైమవతీ తదితరులు రాఖీ కట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగింటి ఆడపడుచులు రక్షాబంధన్‌ను జరుపుకోవడం సంతోషదాయకమని, ఒక కుటుంబంలోనేగాక యావత్ సమాజంలో సోదర భావాన్ని పెంపొందించడంతోపాటు సామరస్యానికి ఈ పండుగ పునాది వేస్తుందన్నారు.
..................
చంద్రబాబు చేతికి రాఖీలు కడుతున్న తెలుగు మహిళలు
..................
బాబు ‘బస్సు’కు అడ్డంకులు?
హైదరాబాద్, ఆగస్టు 21: ఈ నెల 25వ తేదీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ బస్సు యాత్రకు విఘాతం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ఇరు ప్రాంత నేతలతో సమావేశమై తేదీలను ఖరారు చేయాలని టిడిపి నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు యాత్ర శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు యాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. అయతే ప్రస్తుతం ఆంధ్రాలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. టిడిపికి చెందిన సీమాంధ్ర నేతలు ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత నెల 30వ తేదీన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు చంద్రబాబు వౌనం పాటించారు. ఆ తర్వాత నిశ్శబ్ధాన్ని చేధించి కొత్త రాజధానికి 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పదే పదే ప్రకటనలు చేశారు. కానీ రెండోసారి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం అఖిల పక్ష కమిటీని నియమించి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడుఆత్మగౌరవ యాత్ర చేపడితే ఎటువంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. కాని సీమాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించే పరిస్ధితులు లేవని నిఘా వర్గాలు ప్రభుత్వానికి, టిడిపి పార్టీకి సూచించినట్లు తెలిసింది.