కంటోనె్మంట్, అగస్టు 29: నాల్గుసంవత్సరాల క్రితం తమ వద్ద పనిచేసినప్పుడు ఏడు తులాల బంగారు నగలు దొంగిలించాడని, దానికి ప్రతిగా 6 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒకవ్యక్తిని కిడ్నాప్‌చేసి వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తున్న వారిని అరెస్టుచేసి వారి చెర నుండి బాధితుడిని కాపాడినట్టు నార్త్ జోన్ డిసిపి జయలక్ష్మీ తెలిపారు. గురువారం ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం కోల్‌కతా నివాసి జ్ఞానేశ్వర్ మైతే నగరంలో నగలవ్యాపారం నిర్వహిస్తున్న ఇంద్రజిత్ కోలే వద్ద పని చేశాడు. ఆదే సమయంలో జ్ఞానేశ్వర్ మైతే ఏడు తులాల బంగారు నగలు అపహరించి పారిపోయాడు. తిరిగి జానేశ్వర్ మోతే ఈనెల 18న నగరానికి వచ్చి రాంగోపాల్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హోటల్‌లో దిగాడు. తర్వాత అతని నుంచి బంధువులకు ఫోన్ బంద్ అయ్యింది. దానికి బదులుగా ఇంద్రజిత్ కోలే నుండి బెదిరింపుఫోన్‌లు మోతే కుటుంబ సభ్యులకు రావడం ప్రారంభమయ్యాయి. వారు వచ్చి ఆరు లక్షల రూపాయలు తీసుకువస్తేనే అతడిని విడిపిస్తామని హెచ్చరించారు. దీంతో అతని బావమరిది సన్‌దీప్ వౌరి గురువారం నగరానికి చేరుకుని నార్త్‌జోన్ డిసిపి జయలక్ష్మిని కలిసి విషయం తెలిపాడు. వెంటనే ఆమె గోపాలపురం పోలీసులను ఆదేశించడంతోసిఐ శివభాస్కర్, ఎస్‌ఐ కోటయ్య బృందం రంగంలోకి దిగి సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కవాడిగూడలోని తాళ్ళబస్తీలో ఇంద్రజిత్ కోలే వద్ద బందీగాఉన్న జ్ఞానేశ్వర్ మోతేను విడిపించారు. నిందితుడు ఇంద్రజిత్ కోలే, లే అతనికి సహకరించిన సంజయ్ కోలే, సోనా పండిత్‌లను అరెస్టు చేసినట్టు డిసిపి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు ఫిర్యాదు అందిన నాలుగు గంటలలోపే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని ఆమె అభినందించారు.
హెచ్‌సియులో పూర్వ విద్యార్థి ఆత్మహత్యా యత్నం
శేరిలింగంపల్లి, ఆగస్టు 29: గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఐ.దేవయ్య(26) హెచ్‌సియులో ఎంఫిల్ పూర్తిచేశాడు. పిహెచ్‌డి ప్రవేశానికి పరీక్ష రాశాడు. ఇటీవల ఫలితాలు రాగా దేవయ్యకు అవకాశం రాలేదు. గురువారం మధ్యాహ్నం ప్రొఫెసర్ వద్దకు వెళ్లి పిహెచ్‌డిలో సీటివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి వెళ్లిపోయాడు. సెక్యూరిటీ ఆఫీసర్‌కు ప్రొఫెసర్ విషయాన్ని తెలపగా క్యాంపస్‌లో వెతికారు. సాయంత్రం 5గంటలకు అతన్ని గుర్తించి అపోలో ఆసుపత్రికి తరలించారు. చేయిపై బ్లేడుతో కోసుకున్నాడని పోలీసులు తెలిపారు.
సరోజినిధేవి కంటి ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు
నార్సింగి, ఆగస్టు 29: సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో సుమారు నాలుగుకోట్ల వ్యయంతో పలుఅభివృద్ధి పనులతో పాటు కంటి ఆపరేషన్‌కు సంబంధించిన పనిముట్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళీ అన్నారు. గురువారం ఉదయం సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో పెరుగు శివారెడ్డి ధర్మసత్రంతో పాటు నవజాత శిశువుల చికిత్సల కోసం ఆర్‌ఓపి సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో సుమారు నాలుగు కోట్ల వ్యయంతో పలు పనిముట్లతో పాటు వైద్యానికి సంబంధించిన యంత్రాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అతిపెద్ద కంటి ఆసుపత్రి సరోజినిదేవి కంటి ఆసుపత్రి అని, ఈ ఆసుపత్రిలో రోగుల కోసం మరిన్ని సదుపాయాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ నందకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో గత కొన్నిరోజులుగా కోట్ల రూపాయల వ్యయంతో కొత్తకొత్త యంత్రాలతో పాటు పనిముట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆసుపత్రి పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రిలోకంటిచికిత్సల కోసం ఆధునిక పరికరాల అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అందుకు మంత్రి ఆసుపత్రిలో రోగుల కోసం అధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రోఫెసర్లు, డాక్టర్లు, రాథోడ్, రవీందర్‌గౌడ్, గంగాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తెలుగుదేశం
పార్టీ వైపే :.చంద్రబాబు
ఘట్‌కేసర్, ఆగస్టు 29: తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని మాజీముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఘట్‌కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామ సర్పంచ్‌గా గెలిచిన బాషగళ్ల అండాలు మేడ్చల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ నక్కప్రభాకర్‌గౌడ్‌తోపాటు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వెళ్లి చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడానికి ఎంతోకృషి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయామని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అందుకే తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఆనాడు తాము చేసిన కార్యక్రమాలను ప్రజలు మర్చిపోలేదని, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు గ్రహించారని అన్నారు. అందుకే ప్రజలు సర్పెంచ్ ఎన్నికల్లో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలు ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపి అత్యధిక స్థానాలు కట్టబెట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పెంచ్‌లు సైతం అదే స్ఫూర్తితో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. అటు పదవికి తగిన న్యాయం చేస్తూనే పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలిచి అభివృద్ధికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సర్పంచ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ ఉద్యమం
వికారాబాద్, ఆగస్టు 29: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి జెఎసి జిల్లా అధికార ప్రతినిధి ప్రేమ్‌రాథోడ్ అన్నారు. గురువారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా వివిధ కళాశాలల్లో విద్యార్థి జెఎసి కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జెఎసి రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్‌పటేల్ ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వభారతి డిగ్రీ, వికాస్ జూనియర్ కళాశాలల్లో కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో విద్యార్థి జెఎసి జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుజిత్ మఠంలా, ప్రభాకర్, విఠల్, ప్రేమ్‌సింగ్, సుమన్, వెంకట్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశ్వభారతి డిగ్రీ కళాశాల విద్యార్థి జెఎసి
అధ్యక్షుడిగా పాండు
విశ్వభారతి డిగ్రీ కళాశాల తెలంగాణ విద్యార్థి జెఎసి అధ్యక్షుడిగా జి.పాండు ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా రత్నం, వెంకటేశ్, మహేశ్, సుధాకర్, అధికార ప్రతినిధులుగా అశోక్‌కుమార్, నర్సింలు, ప్రభాకర్‌రెడ్డి, నరేశ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్, విఠల్, రవి, పరమేశ్వర్, మల్లేశం, నర్సింలు, వాసు ఎన్నికయ్యారు. బాలికల కమిటీ అధ్యక్షురాలిగా కె.మంజుల, ఉపాధ్యక్షురాలిగా ఎస్.గీతారెడ్డి, రుబీనా, విశాల, అనిత, అధికార ప్రతినిధులుగా అనూష, రిషిక, తన్వీర్, జయశ్రీ, చంద్రకళ, పావని, స్పందన ఎన్నికయ్యారు.
వికాస్ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా శ్రీకాంత్
వికాస్ కళాశాల కమిటి అధ్యక్షుడిగా కె.అశోక్, ఉపాధ్యక్షుడిగా వేణు, సంగమేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, శేఖర్, ధన్‌రాజ్, వినోద్, ప్రసాద్, శ్రవణ్‌కుమార్, అధికార ప్రతినిధులుగా సందీప్, రమేష్, శ్రీకాంత్, శేఖర్, అనిల్, లాలయ్య, సాయికుమార్ ఎన్నికయ్యారు.
రీగల్ స్పోర్ట్స్ అంతర్ పాఠశాలల వాలీబాల్ టోర్నీ
వర్డ్ అండ్ డీడ్, బివిబి జూబ్లీహిల్స్ జట్ల గెలుపు
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 29: ముషీరాబాద్ ప్లేగ్రౌండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నరేష్ స్మారక ట్రోఫీ, రీగల్ స్పోర్ట్స్ అంతర్ పాఠశాలల వాలీబాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో వర్డ్ అండ్ డీడ్, శ్రీనివాస స్మారక హైస్కూలు, హెచ్‌పిఎస్ రామంతాపూర్, జడ్‌పిహెచ్‌ఎస్ కొత్తగూడ, మేడ్చల్, విజ్ఞాన్ దేశ్‌ముఖి స్కూలు, బివిబి జూబ్లీహిల్స్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి. గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో జడ్‌పిహెచ్‌ఎస్ కొత్తగూడ-బి జట్టు 25-14, 25-10 స్కోరు తేడాతో ప్రభుత్వ బాలుర హైస్కూలు, హిల్‌స్ట్రీట్‌పై, శ్రీనివాస స్మారక హైస్కూలు 25-16, 25-20 తేడాతో జడ్‌పిహెచ్‌ఎస్-ఎ జట్టుపై, వర్డ్ అండ్ డీడ్ 25-23, 25-8 తేడాతో హెచ్‌పిఎస్ రామంతాపూర్‌పై, హెచ్‌పిఎస్ రామంతాపూర్ 25-13, 25-15 తేడాతో కెకెఆర్ గౌతమ్ స్కూలుపై, జడ్‌పిహెచ్‌ఎస్ మేడ్చల్ 25-17, 25-12 తేడాతో విజ్ఞాన్ బోట్రీపై, విజ్ఞాన్ దేశ్‌ముఖి స్కూలు 25-15, 25-12తో డిఎవి కూకట్‌పల్లిపై, భారతీయ విద్యాభవన్ జూబ్లీహిల్స్ స్కూలు 25-10, 25-23 తేడాతో హిందూ పబ్లిక్ స్కూలుపై గెలుపొందింది. బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో సెయింట్ పాయిస్ గర్ల్స్ హైస్కూలు 25-8, 25-6 స్కోరు తేడాతో ప్రత్యర్థి తక్షశిల పబ్లిక్ స్కూలుపై, విజ్ఞాన్ బోట్రీ-ఎ జట్టు 25-22, 25-11 తేడాతో సెయింట్ ఆంథోనీ సికిందరాబాద్‌పై, డిఎవి కూకట్‌పల్లి 25-19, 25-7 తేడాతో కేశవరెడ్డి స్మారక స్కూలుపై, హోలీ ఫ్యామిలీ స్కూల్ 25-12, 25-9 తేడాతో విజ్ఞాన్ బోట్రీ-బి జట్టుపై, సెయింట్ ఆంథోనీ 25-11, 25-15 తేడాతో విజ్ఞాన్ బోట్రీ-బి జట్టుపై, విజ్ఞాన్ బోట్రీ-ఎ జట్టు 15-25, 25-15, 15-12 తేడాతో హోలీ ఫ్యామిలీ స్కూలుపై గెలుపొందింది.
మట్టి వినాయకులకు ప్రాధాన్యతనివ్వాలి
కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 29: వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని మట్టితో చేసిన వినాయక విగ్రహాలకు ప్రాధాన్యతనిచ్చి వాతావరణ కాలుష్యానికి సహకరించాలని కూకట్‌పల్లి టిఆర్‌ఎస్ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు అన్నారు. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం కూకట్‌పల్లి నైనాగార్డెన్స్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులతో పీస్ కమిటీ సమావేశాన్ని కూకట్‌పల్లి సిఐ చంద్రకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పద్మారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వినాయక భక్తబృందం ఆధ్వర్యంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని, ఇకముందు కూడా అదేవిధంగా కొనసాగించాలని కోరారు. బోనాలు, రంజాన్ రెండు పండుగలు ఒకేసారి వచ్చినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టిన కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి పోలీసులను అభినందించారు. అనంతరం సిఐ చంద్రకాంత్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మండపాల విషయంలోఆయా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల లోపుమైకులను కట్టివేయాలని కోరారు. మండపాల పరిసర ప్రాంతాలలోవాహనాలతో వచ్చే వారిపై దృష్టి పెట్టి టిఫిన్‌బాక్స్‌లు వంటి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించిన యెడల పోలీసులకు సమాచారం అందచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సునీల్‌రెడ్డి, నిమ్మల సంతోష్, అభిలాష్‌రావు, షేక్‌గౌస్, బొట్టు విష్ణు, ఉమావతిగౌడ్, గోపయ్యగౌడ్, అనిత, కార్పొరేటర్ బాబురావు, కర్క పెంటయ్య పాల్గొన్నారు.
నిజాంపేట్‌లో పట్టాల సమస్యను పరిష్కరిస్తా
ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్
జీడిమెట్ల, ఆగస్టు 29: నిజాంపేట్ గ్రామంలో ప్రజలకు 2006 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలకు పొజిషన్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో నిజాంపేట్ గ్రామస్థులు పట్టాలతో పాటు మంజీరానీటి సమస్యపై ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా కూన మాట్లాడుతూ 2006లో నిజాంపేట్ గ్రామస్థులు సుమారు 200 మందికి హోంమంత్రి చేతుల మీదుగా పట్టాలను ఇచ్చారన్నారు. అప్పుడు ఇచ్చిన పట్టాలకు గ్రామంలోని సర్వేనంబరు 334లో పొజిషిన్‌ను చూపగా కలెక్టర్‌గా ఉన్న వాణీప్రసాద్ ఇళ్లను కట్టుకోవద్దని నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ వద్దకు గ్రామస్థులందరినీ తీసుకువెళ్లి అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో మంజీరానీటి సమస్యపై జలమండలి ఎండితో చర్చించి సాధ్యమైనంత త్వరలో నీటి సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపిటిసి మేకల వెంకటేశ్, నాయకులు లీడర్ నర్సింహ్మారెడ్డి, ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, నిజామ్, వేణు, మురళీ, లక్ష్మి, సుశీలమ్మ, భారతమ్మ పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
జీడిమెట్ల, ఆగస్టు 29: ట్రాఫిక్ నిబంధనలను అదిగమిస్తే కఠిన చర్యలు తప్పవని అల్వాల్ ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య ఆటో డ్రైవర్లకు తెలిపారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర చౌరస్తాలో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటోడ్రైవర్లతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో నూతనంగా ప్రవేశపెట్టిన 108 జీవోను గురించి స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా అల్వాల్ ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ 108 జీవో ప్రకారం పెంచిన చలాన్లను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆటోడ్రైవర్లంతా డ్రైవింగ్ లైసెన్సుతో పాటు ఆటోకు సంబంధించిన ఇన్సూరెన్స్, ఆర్‌సి తదితర కాగితాలు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులకు చూపించాలని, ఒకవేళ వీటిలో ఏవి లేకపోయిన 108 ట్రాఫిక్ జివో ప్రకారం ఆటోడ్రైవర్‌కు 500 రూపాయలు, ఆటో యజమానికి 1000 రూపాయల చొప్పున మొత్తం పదిహేను వందల రూపాయల జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఆటోలో ప్రయాణికులకు కనిపించే విదంగా ఆటోడ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్‌ను రాయించాలని, ఆటోకు ముందు, వెనుకఆటో నంబర్‌ను స్పష్టంగా కనిపించేలా రాయించాలన్నారు.