నల్లబారుతున్న మేఘం
తమిళ మూలం:
డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్.
తెలుగు అనువాదం: ఎజి యతిరాజులు
వెల: 25రూ./
ప్రతులకు:ప్రజాశక్తి బుక్ హౌస్,
1-1-187/1/2, చిక్కడపల్లి,
హైదరాబాద్- 500 020.
అంబరవీధిలో కాంతులీనే మేఘమాలను చూస్తే ఎవరైనా పరవశించి పోతాం. మనల్ని మానసికంగా మరో లోకానికి తీసుకుపోయే మేఘాల గురించి ఎన్నో సందేహాలూ ఉన్నాయి. మేఘాల గురించి పిల్లలు ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వలేక పెద్దవాళ్లు సైతం ఇబ్బందులు పడుతుంటారు. తమిళంలో డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ రాసిన ‘నల్లబారుతున్న మేఘం’ పుస్తకం మన సందేహాలను నివృత్తి చేసేందుకు దోహద పడుతుంది. చిన్నారులు ఆసక్తికరంగా చదివేలా దీన్ని ఎజి యతిరాజులు తెలుగులోకి సరళమైన భాషలో అనువదించారు. మేఘాలంటే ఏమిటి? అవి ఎలా పుడతాయ? అవి ఎన్ని రకాలు? అన్ని మేఘాలూ వర్షిస్తాయా? ‘కృత్రిమ వర్షం’ అంటే ఏమిటి? యజ్ఞాలు, యాగాలు చేస్తే వర్షం కురుస్తుందా? చినుకు ఎలా పుడుతుంది ?... వంటి అనేక ప్రశ్నలకు ఈ పుస్తకంలో శాస్ర్తియమైన సమాధానాలు లభిస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల దుమ్ము, ధూళి పెరిగిపోయి మేఘాలు నల్లబారుతున్నాయని రచయిత ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుంటే ఈ పరిస్థితులు ఇంకా విషమించవచ్చని పేర్కొన్నారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల ఇప్పటికే పరిశుభ్రమైన గాలి కరవైందని, ఈ తరుణంలో యజ్ఞాలు, యాగాలు చేస్తే కాలుష్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎంత? వర్షం కురవాలన్నది ప్రకృతిలో సహజసిద్ధంగా జరుగుతుందే తప్ప, ‘వరుణ యాగాల’తో ఫలితం ఉండదని తేల్చి చెప్పారు.