ప్రాచీన భారతదేశంలో ప్రగతి,
సాంప్రదాయవాదం
ఎస్.జి.సర్దేశాయ్ (ఆంగ్లమూలం)
తెలుగు సేత:
వల్లంపాటి వెంకట సుబ్బయ్య-
వెల: రూ.180
పుటలు: 294,
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు.
వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి గతం గురించి సరైన అవగాహన ఉండాలి. చరిత్ర చదవని వారు చరిత్ర నేర్పే పాఠాలను కోల్పోతారు. దేశభక్తులు, ఉదారవాదులు అ యిన నాయకులు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిందనీ, దాన్ని నిలుపుకోవాలనీ నవతరానికి పిలుపునిస్తున్నారు. మన ప్రాచీన సంస్కృతిలో గొప్పవి, అభ్యుదయకరమైనవి అయిన అంశాలనేకాక, కాని అంశాల గురించి నవతరానికి తెలియచెప్పే ప్రయత్నం- ఎస్.జి.సర్దేశాయి ఆంగ్లంలో రచించిన పుస్తకానికి వల్లంపాటి వెంకట సుబ్బయ్య తెలుగు అనువాదం ‘ప్రాచీన భారతదేశంలో ప్రగతి, సంప్రదాయవాదం’లో జరిగింది.
ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలు చోటుచేసుకున్నాయి. మొదటి అధ్యాయం ‘్భరతదేశ చరిత్ర ప్రత్యేకతలు- అవిచ్ఛిన్నత మార్పు’ అన్న ప్రధాన శీర్షిక కింద ఇరవై వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ‘చారిత్రక ప్రగతికి కొలబద్దలు- మార్క్స్ లేవనెత్తిన సమస్యలు’, ‘గ్రీసు-్భరతదేశం’, ‘మగధ, గుప్తసామ్రాజ్యాల కాలంలోని సంబంధాలు’, ‘నగరాల్లో చేతివృత్తులు, వ్యాపారం అభివృద్ధి’ లాంటి వ్యాసాలు అనేక ఆసక్తికరమైన విషయాలు వివరించాయి.
తర్వాతి అధ్యాయం ‘్భవజాలం అభివృద్ధి- సామాజిక భావజాలం, అభివృద్ధి యుగ విభజన’ అన్న శీర్షికకింద ‘్భరతీయ తాత్విక సంప్రదాయం’, ‘బ్రాహ్మణ్యాలు- ఉపనిషత్తులు’, ‘క్రీ.పూ 600- క్రీ.శ 500’ ఇండో-గ్రీకు- శక- కుషాల్- శాతవాహన యుగం’ అన్న అంశాల మీద రాయబడిన వ్యాసాలు, ఆయా కాలాల జీవన సరళిని పరిచయం చేస్తాయి.
మూడవ అధ్యా యం ‘వేదాంతం- కర్మ, వేదాంతం-ప్రగతి’లో అయిదు వ్యాసాలు పొందుపరచబడ్డాయి. భౌతికవాదం, భావవాదం, మత చైతన్యం, కమ్యూనిస్టులు, మతంలోని ప్రగతిశీల ప్రేరణలు తదితర అంశాలమీద చర్చ పాఠకుల మెదడుకు మేత కల్పిస్తుంది.
‘సైన్సు-మూఢ విశ్వాసము’అన్న అధ్యాయంలో ఏడు వ్యాసాలున్నాయి. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, మగధ- గుప్త సామ్రాజ్యాల కాలం, చరకుడు- శుశ్రుతుడు, ఆయుర్వేదం అభివృద్ధి తదితర అంశాల మీద దృష్టిసారించాయి.
ఐదవ అధ్యాయం ‘తత్త్వశాస్త్రంలో ఘర్షణ-దాని సామాజిక ప్రాధాన్యత’ అన్న శీర్షిక కింద, ఏడు వ్యాసాలున్నాయి. ఇందులో భారతీయతత్వ ఆలోచనా సరళుల్ని అంచనావేయడంలో ఉన్న క్లిష్టత, స్వభావవాదులు చేసుకున్న సర్దుబాట్లు, తత్వశాస్త్రం ఎందుకు తదితర అంశాలు వివరించబడ్డాయి.
ఆఖరి అధ్యాయం ‘గతం-వర్తమానం’లో వేదాంతం, ఆధునిక సైన్సులో వక్రీకరణలు, చరిత్ర-మతతత్వం, లౌకికతత్వం, పునరుద్ధరణ వాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం కోసం జరిగే పోరాటంతో భావజాల రంగంలో జరిగే పరిణామాలు తదితర అంశాలుమీద వివరణలున్నాయి.
పుస్తకం చివరలో ఇచ్చిన వివరణలు, పాఠకుల విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయి. సంస్కృత పదాలు, పేర్లు జిజ్ఞాసువుల జ్ఞాన దాహాన్ని తీర్చుకోడానికి ఉపయోగిస్తాయి.
రచయిత- తన ప్రత్యర్థుల అభిప్రాయాల్లోని మంచిని చూడలేకపోయాడన్న విమర్శ సహేతుకమా? కాదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరికివారే వెతుక్కోవాలి.