శకుంతల- పద్యకావ్యము
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ,
రూ.200/-
ప్రతులకు
డా.అయాచితం నటేశ్వరశర్మ,
7-36-9, నిజాంసాగర్ రోడ్,
కామారెడ్డి- నిజామాబాద్ జిల్లా.
అయాచితం నటేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్రములలో గణనీయమైన పాండిత్యాన్ని సంపాదించారు. లోగడ వారు యాభైకి పైగా రచనలు చేశారు. అందులో భక్తిరస ప్రధానమైనవి, శతకములు, శివ మహిమ్నానువాదముల వంటివి ఉ న్నాయి. ఇప్పుడు కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలంలో యథామూలకంగా తెలుగులో పద్యకృతిగా అనువదించారు. మూలాన్ని మార్చకుండా, ఏమార్చకుండా రస ర మణీయంగా ఈ కృతి సా గింది. శాకుంతలమును లో గడ తెలుగులో వీరేశలింగంపంతులు వంటివారు యథా మూలకంగా నాటకంగానే అ నువదించటం మనకు తెలుసు. విశ్వవిఖ్యాత కృతుల్లో శాకుంతలం ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని నటేశ్వరశర్మ గారు అలవోకగా అనువదించారు. సందర్భోచితంగా వృత్త ఔచిత్యాన్ని పాటించినా ప్రధానంగా తేటగీతులకు ఎక్కువ స్థానం కల్పించారు.
‘‘కవి కులముల గురువు కాళిదాసుని నోట నిల చెలంగెనేది లలిత చరిత, దాని తెలుగుసేయతపియింప హృదయమ్ము పలుకుచుంటి కావ్యభక్తి తెలిసి’’ (ప్రథమాశ్వాసము) అని కవిగారు పేర్కొన్నారు. ‘‘ప్రయాణమంతఃకరణం ప్రవృత్తయం’’అనే మూల భావాన్ని కవిగారు ఇలా అనువదించారు’’. సాధువులను సందేహము బాధించిన వేళ వారు ప్రచలత మదినే సాధనముగ నొనరించి సమాధానము గొనెదరు ప్రమాణం చనుచున్. వ్యాస భారతములో అంగుళీయక వృత్తాంతము లేదు. దుష్యంతుని పాత్రలో శీలాన్ని కాపాడే నిమిత్తం కాళిదాసు చేసిన కల్పన ఇది- ‘తాత పాదులవని లోన తరుణవేళ నన్ను చేపట్టి యొసగిన నామధేయ చిణ్నితాంగుళికంచిది చేత గొనుము’ (పుట 90)- అయితే శక్ర తీర్థములో నదికి మొక్కినపుడు ఆమె దానిని జారవిడుచుకున్నది కదా! ‘‘తనయ శక్రతీర్థములోన తరలునపుడు నదికి మ్రొక్కెడివేళ నా నదిని జారి మునిగియుండును గాన నీ ముందు లేదు’’ ఈ పద్యములో సామాన్యులకు అర్థం కాని పదము ఒక్కటీ లేదు. దాదాపు అనువాదమంతా ఇదే విధంగా సాగింది. ఇది సప్తమాశ్వాస పరివ్యాప్తిగల ర చన. డాక్టర్ నటేశ్వరశర్మగారు తమ ప్రయత్నంలో సఫలీకృతులైనారు. సంస్కృతం రానివారు ఈ తెలుగు కృతిని చదువుకొని మూలాన్ని ఊహించుకోవచ్చు. ఈ గ్రంథాన్ని కవిగారు తన సుపుత్రికలకు అంకితం చేశారు. ఈ పుస్తకం శర్మగారు అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడ రచింపబడింది. ‘‘అమెరికా పర్యటనలోని ఆనందానుభూతులతోబాటు అభినవ కావ్యాన్ని కూడా మోసుకొచ్చి మాతృభూమిపై అడుగుపెట్టినట్లు కవిగారు తమ పీఠికలో చెప్పుకున్నారు. పద్యము కేవలము పండిత గ్రాహ్యము-అనే శంకను శర్మగారు ఈ కృతి ద్వారా తొలగించి జన సామాన్యానికి అందుబాటులోనికి తీసుకొని రావటం అభినందనీయం.