కడప, సెప్టెంబర్ 18:సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఢిల్లీ పీఠానికి సమైక్యాంధ్రుల సెగ తాకించేందుకు బుధవారం కడప నగరంలో పెద్దఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమకారులు మానవహారాన్ని నిర్వహించారు. తొలుత 20 కిలోమీటర్ల పొడవునా మానవహారాన్ని నిర్వహించేందుకు ఉద్యమకారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే జనవాహిని భారీ ఎత్తున తరలి రావడంతో 36 కిలోమీటర్ల పొడవునా మానవహారాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండే కడప నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది జనాలు తరలి రావడం జరిగింది. కడప శివారు ప్రాంతంలోని రింగురోడ్డులో పులివెందుల, రాయచోటి, రిమ్స్ మార్గాల్లో వేలాది మంది బారులు తీరారు. సమైక్యాంధ్ర జేఏసీ, రాష్ట్ర పరిరక్షణ సమితి జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థి, మహిళా జేఏసీలు భారీ ఎత్తున తరలి వచ్చారు. పట్టణమంతా జనవాహినితో కిటకిటలాడి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రింగురోడ్డుకు ఉద్యమకారులు తరలి వెళ్లారు. ముఖ్యంగా రాయలసీమ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జేఏసీ నేత యం.అమర్‌నాధ్, రాష్ట్ర పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ యం.సుదర్శన్‌రెడ్డి, డిపిఆర్వో యంవి ప్రసాద్, జర్నలిస్టు యూనియన్ నేతలు సూర్యనారాయణ, రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవహారానికి ప్రజలు, ఉద్యోగులు, మహిళలను రప్పించారు. వీరంతా మానవహారం నిమిత్తం రింగురోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులు తీరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, ఆంటోనీ, కెసిఆర్, కోదండరాం తదితరులను వ్రాయలేని భాషలో దూషిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలను నిరసనల రూపంలో తెలియజేశారు. అధికార పార్టీకి చెందిన జిల్లానేతల ఇళ్లను ముట్టడించే పెధ్దఎత్తున పథకాన్ని రూపొందిస్తున్నారు. మొత్తం మీద సమైక్యాంధ్ర ఉద్యమకారులు మానవహారం కార్యక్రమానికి అంచనాలు మించి భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. ఉద్యమం రోజు రోజుకు తీవ్రతరమై ఢిల్లీ పీఠానికి ఇప్పుడిపుడే సెగలు వ్యాపిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికపై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, ప్రవేటు బస్సులను పూర్తిగా నిలుపుదల చేసి, శాంతియుతంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించే దిశగా సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ ఉద్యమాన్ని పెద్దఎత్తున తీవ్రతరం చేస్తున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఢిల్లీ పీఠానికి సమైక్యాంధ్రుల సెగ తాకించేందుకు
english title:
a
Date:
Thursday, September 19, 2013