రాజమండ్రి/కాకినాడ, సెప్టెంబరు 18: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే కార్యక్రమంలో భాగంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపునకు అనుగుణంగా గురు, శుక్రవారాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు దిగ్బంధించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మాత్రమే నిరవధిక సమ్మె చేస్తుండటంతో రాష్ట్రప్రభుత్వానికి మాత్రమే సమైక్య సెగ తగలుతోంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా సమైక్య సెగ తగలాలంటే, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను కూడా బంద్ చేయించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి నిర్ణయించింది. దాంతో ఉద్యోగ సంఘాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గురు, శుక్రవారాల్లో కేంద్రప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించాలని నిర్ణయించారు. ఒఎన్‌జిసి, గెయిల్, పిఎఫ్, సిటిఆర్‌ఐ, ఆదాయపన్ను శాఖ కార్యాలయాలతో పాటు, బ్యాంకులను కూడా మూయించి, ఆయా కార్యాలయాల ముందు రోజంతా ధర్నా చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎన్‌జిఓలు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించేందుకు ఉద్యోగుల జెఏసి నాయకులు ప్రణాళికను రూపొందించారు. ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక్కొక్క బృందం దిగ్బంధించే విధంగా కార్యాచరణ రూపొందింది. రాజమండ్రి వంటి నగరంలో 13కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలను దిగ్బంధిస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సమైక్య సెగ తగులుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించేందుకు ఉద్యోగుల జెఏసి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా, కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగుల సంఘాలు కూడా సమైక్య ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాయి.
దొడ్డిదారి కార్యకలాపాలు
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా ఉద్యోగులు పట్టువదలకుండా పోరాటం సాగిస్తుంటే, కొన్ని శాఖలకు చెందిన అధికారులు మాత్రం దొడ్డిదారిన కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. చెక్కులపై సంతకాలు, బిల్లులు పాస్ చేయటం వంటి కార్యకలాపాలు సాగిస్తూ పబ్బం గడుపుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. ఒక శాఖకు చెందిన అధికారి ప్రయివేటు హోటల్‌లో కౌంటరు తెరిచి, లావాదేవీలు సాగిస్తున్నట్టు సమాచారం. జీతాలు రాకపోయినా అప్పులు చేసుకుని ఉద్యోగులు బతుకు బండి లాగుతుంటే, కొంత మంది అధికారులు ఇలాంటి చీకటి కార్యకలాపాలు సాగించటం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి అధికారులు పనిచేస్తున్న కార్యాలయాల ముందు పోస్టర్లు అతికించటం ద్వారా నిరసన తెలియచేయాలని కొంత మంది ఉద్యోగులు భావిస్తున్నారు.
కాగా జిల్లా కేంద్రం కాకినాడ సహా జిల్లా వ్యాప్తంగా 50వ రోజైన బుధవారం సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో తెలుగుతల్లి విగ్రహానికి దిష్టి తీశారు. ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా దీవించమని ఈ సందర్భంగా ఉద్యోగులు తెలుగుతల్లిని కోరారు. న్యాయవాదుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. బోట్ క్లబ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బంతాట ఆడి తమ నిరసన తెలియజేశారు. జె ఎన్‌టియుకె వద్ద విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో జరిగిన రిలే దీక్షల్లో యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచన సోనియాకే వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట గెజిటెడ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. విద్య, విద్యారోగ్య, మత్స్య, స్ర్తిశిశు సంక్షేమం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, న్యాయశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కాగా సెప్టెంబరు నెలాఖరు వరకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. 21వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ దీపాలను వెలిగించకుండా నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. 22,23 తేదీల్లో రాష్ట్ర విభజనకు నిరసనగా గ్రామస్థాయిలో శిబిరాలను ఏర్పాటుచేసి రాష్ట్ర విభజనను నిరసిస్తూ దాని వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించనున్నారు. ఈనెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు రాష్ట్ర జె ఎసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆరోజు పూర్తిస్థాయిలో జిల్లాను స్తంభింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 25, 26 తేదీల్లో ప్రైవేట్ బస్సులను నిలిపివేయనున్నారు. 27,28 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ పాటించనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు అన్ని రకాల ప్రైవేటు స్కూల్స్‌కు బంద్ ప్రకటించారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే కార్యక్రమంలో భాగంగా
english title:
s
Date:
Thursday, September 19, 2013