గుంటూరు, సెప్టెంబర్ 18: సమైక్యవాదులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. బుధవారం నాటికి ఉద్యమం 50వ రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్రే లక్ష్యంగా ఉద్యమకారులు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు మండూరి వెంకట రమణ, రావిపాటి సాయికృష్ణ, నూనె పవన్‌తేజ తదితరుల ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురంలోని మీ-సేవా కేంద్రాన్ని మూయించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విభజన నిర్ణయంపై పునరాలోచన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని ప్రకటన చేసే వరకు తాము విశ్రమించబోమని, ఆందోళనలు చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని, వెంటనే తమ పదవిలకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా మీ-సేవా కేంద్రం మూతపడటంతో పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు ఐరన్- హార్డ్‌వేర్, పెయింట్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నాయకులు నగరంలో మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కొమ్మినేని సీతారామయ్య, కార్యదర్శి కోటా దుర్గాప్రసాద్, పసుపులేటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ వ్యాపార వర్గాల వారు నిర్వహించిన బైక్ ర్యాలీని సమైక్యాంధ్ర గుంటూరు జిల్లా పొలిటికల్ జెఎసి చైర్మన్ ఆతుకూరి ఆంజనేయులు ప్రారంభించారు. స్థానిక ఆర్ అగ్రహారంలోని కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం నుండి ప్రారంభమైన ర్యాలీ పూలకొట్ల సెంటర్, అరండల్‌పేట, డొంకరోడ్డు, కొత్తపేట, నాజ్‌సెంటర్ మీదుగా ఫ్యాన్సీ కల్యాణ మండపం వరకు జరిగింది. స్థానిక అరండల్‌పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షలో కె భవానీ ప్రసాద్, జి శ్రీనివాస్ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సంఘ రాష్ట్ర కన్వీనర్ వి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కోనా దేవదాస్, ఎస్‌ఎం సుభాని తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కాగా గుంటూరు జిల్లా ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన చేశారే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. అలాగే జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న దీక్షలు 30వ రోజుకు చేరుకోగా దీక్షలో 30 మంది మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో, కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు, కొత్తపేటలోని పశువైద్యశాల వద్ద వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి.
సమైక్యవాదులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.
english title:
s
Date:
Thursday, September 19, 2013