అనంతపురం, సెప్టెంబర్ 18: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 50 రోజులుగా చేపడుతున్న నిరసనల హోరుతో జిల్లా దద్దరిల్లిపోతుంది. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఉద్యమం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమతం కావడంతో సంస్థకు రూ. 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఉద్యోగులు విధులకు హాజరవకపోవడంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. దీంత ఎలాంటి పనులు జరగక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఉద్యమ ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. జిల్లాలో బుధవారం పెద్దఎత్తున ర్యాలీలు, దీక్షలు కొనసాగాయి. నగరంలో ఉపాధ్యాయులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ఆట-పాట కార్యక్రమాలు, సమైక్య నినాదాలతో హోరెత్తించారు. వైద్య ఆరోగ్య శాఖ ముస్లిం ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని అల్లాను ప్రార్థించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ జెఎసి ఆధ్వర్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఘోరీ కట్టి కర్మకాండలు నిర్వహించారు. చిరంజీవిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థుల ఆధ్వర్యంలో టవరక్లాక్ వద్ద 50 ఆకారంలో నిల్చొని, మానహారంతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు బొగ్గులతో నిరసన తెలిపారు. వ్యవసాయ, పశుసంవర్థశాఖ ఆధ్వర్యంలో నగరంలో భిక్షాటన చేశారు. సంగీత కళాకారులు 5 తలల బొమ్మతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట దీక్షలు ప్రారంభించారు. గుంతకల్లులో టిడిపి ఆధ్వర్యంలో బర్రెలకు రాజకీయ నాయకుల మాస్క్‌లు వేసి నిరసన తెలిపారు. ధర్మవరం ఐకాస ఆధ్వర్యంలో రైతు గర్జన నిర్వహించారు. కళ్యాణదుర్గంలో వీరశైవుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదరిలో జెఎసి ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ ‘రైతు ఆవేదన’ పేరుతో సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50వ రోజు కూడా ఉద్యమ జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన
english title:
s
Date:
Thursday, September 19, 2013