కర్నూలు, సెప్టెంబర్ 18 : జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 50 రోజులు పూర్తి కావడంతో ఉద్యమకారులు ఆందోళనలను బుధవారం మరింత ఉద్ధృతం చేశారు. జిల్లా వ్యాప్తంగా ధర్నా, రాస్తారోకో, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై 50 రోజులు గడిచిందంటూ కర్నూలులో కళాతృష్ణ అనే కళాకారుడు కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట 50 అనే సంఖ్యను వేసి నిరసన తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. పశుసంవర్ధక శాఖ, ఆర్‌అండ్‌బి, వైద్య, ఆరోగ్య శాఖ, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ధర్నాలు కొనసాగాయి. వీరికి తోడు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జల మండలి వద్ద నీటి పారుదల శాఖ ఉద్యోగులు, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం వద్ద న్యాయవాదులు రిలే దీక్ష చేస్తున్నారు. కాగా రాష్ట్రం విడిపోతే ప్రజలు అడుక్కోవాల్సి వస్తుందని సమైక్యవాదులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. జిల్లాలోని బేతంచెర్ల, అవుకు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, నందికొట్కూరు, వెలుగోడు తదితర మండలాల్లో సమైక్య ఉద్యమం అలుపెరగకుండా సాగుతోంది. ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రికార్డు సృష్టించే దిశగా పయనిస్తోంది. ఆర్టీసీ చరిత్రలో బస్సులు ఇంత సుదీర్గకాలంగా డిపోలకు పరిమితమయ్యాయి. సమ్మె ప్రారంభమై సుమారు 40రోజులు కావస్తుండటం విశేషం. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పటికే రికార్డు సృష్టించగా ఎన్జీవోల సమ్మె కూడా రానున్న రెండు, మూడు రోజుల్లో రికార్డు సృష్టించనుందని చర్చించుకుంటున్నారు. కాగా గత 50 రోజులుగా మూతబడిన ప్రైవేటు విద్యా సంస్థలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెలో కొనసాగుతుండటంతో ప్రభుత్వ విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఉపాధ్యాయులు కూడా సమ్మెను విరమించి విద్యా సంస్థలను తెరవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అవసరమైన సమయంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉద్యమంలో పాల్గొనవచ్చని విద్య, ఉద్యమం రెండూ కొనసాగుతాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో మళ్లీ సోమవారం నుంచి విద్యా సంస్థలు వారం రోజుల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఎన్జీవోలు వెల్లడిస్తున్నారు. కాగా ప్రైవేటు ఆసుపత్రుల బంద్ కర్నూలు నగరంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు సంఘం పేర్కొంది. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వైద్య సదుపాయాలను నిలిపివేస్తామని ప్రభుత్వ సానుకూలంగా స్పందించకపోతే తాము ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొని వైద్య సేవలను నిలిపి వేస్తామని హెచ్చరిస్తున్నారు.
* ఉద్ధృతమవుతున్న సమైక్య ఆందోళనలు * జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదుల భిక్షాటన
english title:
v
Date:
Thursday, September 19, 2013