చెన్నై, సెప్టెంబర్ 21: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన చిరకాల ప్రత్యర్థి, డిఎంకె అధినేత ఎం.కరుణానిధిపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిఎంకె ప్రభుత్వ హయాంలో కరుణానిధి, ఆయన కుటుంబ సభ్యులు తమిళ చలనచిత్ర పరిశ్రమను తమ కబంధ హస్తాల్లో ఉంచుకుని గుత్త్ధాపత్యం చెలాయించారని, సినీ పరిశ్రమలో వారు ఇతరులెవ్వరినీ ఎదగనివ్వలేదని ఆమె విమర్శించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతీయ సినిమా శతవార్షికోత్సవాలను ప్రారంభిస్తూ జయలలిత శనివారం ఈ విమర్శలు చేశారు. రాష్ట్రంలో తాను అధికారాన్ని చేపట్టకముందు సినీ పరిశ్రమ ఎటువంటి దుస్థితిలో మగ్గిపోయిందో అందరికీ తెలుసిన విషయమేనని డిఎంకె, కరుణానిధిపై ఆమె పరోక్షంగా నిప్పులు చెరిగారు. తాను అధికారాన్ని చేపట్టిన అనంతరం తమిళ సినీ పరిశ్రమ గత రెండు సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేస్తోందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జయలలిత ఈ సందర్భంగా వివరించారు. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేందుకు రాయితీలను పెంపొందించడంతో పాటు చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని, వీడియో పైరసీని కఠినమైన గూండా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో పాటు చలనచిత్ర కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. వెలుపలి రాష్ట్రాల నుంచి పొట్ట చేతబట్టుకుని వస్తున్న ఎంతో మంది కార్మికులకు తమిళ సినీ పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటోందని ఆమె అన్నారు.
ఇతరులెవరినీ ఎదగనీయలేదు * కరుణానిధి కుటుంబంపై జయలలిత ధ్వజం
english title:
jayalalitha
Date:
Sunday, September 22, 2013