ముంబయి, సెప్టెంబర్ 21: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో చార్జిషీటు దాఖలైంది. పందాలు కాశాడని ఆరోపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్‌కు సిఇవోగా వ్యవహరించిన గురునాథ్ మెయ్యప్పన్‌పై ముంబయి పోలీస్ అధికారులు శనివారం చార్జిషీటు దాఖలు చేశారు. అందులో పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ పేరుకూడా ఉంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఉదంతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ రణ్‌ధావా తాను మెయ్యప్పన్ తరఫున పందాలు కాసేవాడినని అధికారుల విచారణలో చెప్పాడు. విందూ వాంగ్మూలం ఆధారంగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు మెయ్యప్పన్‌ను నాలుగు నెలల క్రితం అరెస్టు చేశారు. ఆతర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ సంస్థ ఐపిఎల్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అంతేగాక, అతనికి మెయ్యప్పన్ స్వయానా అల్లుడు. దీనితో శ్రీనివాసన్ రాజీనామా చేయాలని బోర్డులోని ఒక వర్గం గట్టిగా డిమాండ్ చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాత్కాలికంగా బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతల నుంచి శ్రీనివాసన్ వైదొలిగాడు. అతని స్థానంలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వర్కింగ్ గ్రూప్ చీఫ్‌గా జగ్మోహన్ దాల్మియా పగ్గాలు చేపట్టాడు. అయితే, కొన్ని వ్యవహారాలను అధ్యక్షుడే స్వయంగా చూసుకోవాలని బోర్డ నిబంధనావళి స్పష్టం చేస్తున్న కారణంగా, అలాంటి విధులను నిర్వర్తించే అధికారాన్ని బోర్డు వర్కింగ్ కమిటీ మళ్లీ శ్రీనివాసన్‌కే అప్పగించింది. ఆతర్వాత జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశానికి, మార్కెటింగ్ కమిటీ సమావేశానికి శ్రీనివాసన్ అధ్యక్షత వహించాడు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలోనే శ్రీశాంత్, చవాన్‌లపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. స్పాట్ ఫిక్సింగ్ సమాచారం తెలిసి కూడా బోర్డుకు తెలపని కారణంగా రాజస్థాన్ ఆటగాడు సిద్ధార్థ్ త్రివేదీతోపాటు గతంలో అదే జట్టుకు ప్రాతనిథ్యం వహించిన అమిత్ సింగ్‌ను కూడా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. చండీలాపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అనంతరం జరిగిన మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఎయిర్ టెల్ స్థానంలో కొత్త స్పాన్సర్‌ను నియమించడానికి బోర్డు బిడ్స్‌ను ఆహ్వానించింది. ఈ రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించిన శ్రీనివాస్ తాను మరోసారి బోర్డు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈనెల 29న జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని భవిష్యత్తు తేలిపోతుంది.
ఇలావుంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూర్పు, వ్యూహాలు, ఆటగాళ్ల ఫిట్నెస్ వంటి పలు అంశాలను ముందుగానే బుకీలకు మెయ్యప్పన్ చేరవేసినట్టు ముంబయి పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో ఆరోపించారు. భారీ మొత్తాల్లో పందాలుకాసి, బుకీలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు పరోక్షంగా సహకరించాడని పేర్కొన్నారు. అతను సమాచారాన్ని విందూకు అందించగా, అతను పవన్ జైపూర్, సంజయ్ జైపూర్ వంటి బుకీలకు వివరించే వాడని ముంబయి పోలీసులు తెలిపారు. కాగా, ఈనెల మే 23న బెట్టింగ్ వ్యవహారంపై ప్రశ్నించేందుకు హాజరుకావాల్సిందిగా మెయ్యప్పన్‌కు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మే 24న మోసం, ఫోర్జరీ, ద్రోహం వంటి నేరాలక పాల్పడ్డాడన్న ఆరోపణలపై అతనిని అరెస్టు చేశారు. జూన్ 4న అతనికి బెయిల్ లభించింది.(చిత్రం) గురునాథ్ మెయ్యప్పన్ (ఫైల్ ఫొటో)
నేను నిర్దోషిని: రవూఫ్
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో తన ప్రమేయమేమీ లేదని, తాను నిర్దోషినని పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అసద్ రవూఫ్ స్పష్టం చేశాడు. ముంబయి పోలీసులు కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీటులో తనపేరు ఉన్నట్టు తెలిసిందని, వాస్తవానికి ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాతుతూ రవూఫ్ చెప్పాడు. మెయ్యప్పన్ తరఫున పందాలు కాసేవాడినని విచారణ అధికారుల ముందు అంగీకరించిన విందూ రణ్‌ధావా అదే సమయంలో రవూఫ్ పేరు కూడా వెల్లడించినట్టు సమాచారం. పందాలు కాసేందుకు అతను కూడా సహకరించాడని విందూ పేర్కొన్నాడని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై రవూఫ్ స్పందిస్తూ, తనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారని చెప్పాడు. విందూ కూడా వారిలో ఒకడని చెప్పాడు. అంతమాత్రం చేత తాను స్పాట్ ఫిక్సింగ్‌కు సహకరించానని అనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించాడు.