చెన్నై, సెప్టెంబర్ 21: తన అల్లుడు మెయ్యప్పన్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెన్నై సూపర్ కింగ్స్ అధినేత, బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పష్టం చేశాడు. ఇది కేవలం మెయ్యప్పన్‌కు మాత్రమే పరిమితమైన అంశమని, తాను జోక్యం చేసుకోబోనని చెన్నైలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. తాను బోర్డు అధ్యక్ష పదవి నుంచి వైదొలగే ప్రసక్తే లేదని అన్నాడు. తనపై అనర్హత వేటు పడలేదని, కాబట్టి ఎవరూ తనను పదవి నుంచి తొలగించలేరని చెప్పాడు. మెయ్యప్పన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. మెయ్యప్పన్‌పై ఆరోపణలు వచ్చిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అతనిని సస్పెండ్ చేశామని తెలిపాడు. ఇప్పుడు అతనికి ఫ్రాంచైజీతో ఏ విధమైన సంబంధాలు లేవన్నాడు. కోర్టులో తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడం, మళ్లీ ఐపిఎల్‌లో కీలక పాత్ర పోషించడం అన్నవి అతనికి సంబంధించిన అంశాలని చెప్పాడు. ఇందులో తాను చేసేది లేదా చేయగలిగింది ఏమీ లేదని తెలిపాడు. మెయ్యప్పన్‌పై చార్జిషీటు దాఖలైనంత మాత్రాన తాను రాజనామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ‘మీరెవరూ నన్ను వెళ్లగొట్టలేరు’ అంటూ మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ప్రతిసారీ తన రాజీనామా కోరడం మీడియాకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చార్జిషీటును తాను చూడలేదని, అందులోని అంశాలు తెలియకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నాడు. ఈనెల 29న జరిగే సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తానని చెప్పాడు. మీడియా అవునన్నా, కాదన్నా బోర్డు అధ్యక్షుడ్ని తానేనని అన్నాడు. బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు ఇంతకు ముందే చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పాడు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా అని విలేఖరులు పదేపదే ప్రశ్నించినా శ్రీనివాసన్ లేదని సమాధానమిచ్చాడు. చార్జిషీటులో తన పేరు లేదని, ఇప్పటి వరకూ ఎవరూ తనపై ఆరోపణలు చేయలేదని అతను గుర్తుచేశాడు. ‘నాకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకొని నేనెందుకు రాజీనామా చేయాలి’ అని పాత్రికేయులను నిలదీశాడు. ఆధారాలు లేని కథనాలను ప్రచారం చేయవద్దని కోరాడు.
తేల్చిచెప్పిన బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్* మెయ్యప్పన్ వ్యవహారంతో సంబంధం లేదని స్పష్టీకరణ
english title:
srini
Date:
Sunday, September 22, 2013