న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జాతీయ సెలక్టర్లు, కోచ్‌లు అక్రమాలకు పాల్పడి, ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు బాక్సర్లలో ఇద్దరిని మందలించి విడిచిపెట్టిన భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్) మరో బాక్సర్‌ను క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కజకస్థాన్‌లో వచ్చేనెల 11 నుంచి 27వ తేదీ వరకు జరిగే పోటీలకు ఆసియా గేమ్స్ రజత పతక విజేత మన్‌ప్రీత్ సింగ్ (91 కిలోల విభాగం), ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని దక్కించుకున్న మన్‌దీప్ జంగ్రా (69 కిలోల విభాగం), డిఫెండింగ్ జాతీయ చాంపియన్ సతీష్ కుమార్ (+91 కిలోల విభాగం)లను ఎంపిక చేయడంపై అర్జున అవార్డు గ్రహీత దినేష్ కుమార్ (91 కిలోల విభాగం), జాతీయ చాంపియన్ దిల్బాగ్ సింగ్ (69 కిలోల విభాగం), ప్రవీణ్ కుమార్ (+91 కిలోల విభాగం) బాహాటంగా విమర్శలు గుప్పించడం వివాదానికి కారణమైంది. ట్రయల్స్ సమయంలో సెలక్టర్లు, కోచ్‌లు కుమ్మక్కయ్యారని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని వారు ధ్వజమెత్తడానికి ఐబిఎఫ్ తీవ్రంగా పరిగణించింది. తమను కాదని తక్కువ స్థాయి బాక్సర్లను ఎంపిక చేశారని వారు ఆరోపించడాన్ని తప్పుపట్టింది. దినేష్, దిల్బాగ్, ప్రవీణలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఐబిఎఫ్ నోటీసులు అందుకున్న తర్వాత ఇచ్చిన వివరణలో తమ వ్యాఖ్యలపై దినేష్, ప్రవీణ్ విచారం వ్యక్తం చేశారు. తమను క్షమించాలని కోరారు. దిల్బాగ్ మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశాడు. ఇలావుంటే, క్షమాపణ కోరిన దినేష్, ప్రవీణ్‌లను క్రమశిక్షణ కమిటీ క్షమించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి హాజరుకావాలని దిల్బాగ్‌ను ఆదేశించింది.
నిబంధనలను అతిక్రమించలేదు
ఐపిఎల్ చెల్లింపులపై బిసిసిఐ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: విదేశీ మారక ద్రవ్య చట్టానికి తూట్లు పొడిచి, నిబంధనలను అతిక్రమించి చెల్లింపులు జరిపినట్టు వచ్చిన వార్తలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తోసిపుచ్చింది. ఎక్కడా అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 ఐపిఎల్ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు, నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఎంజి సంస్థకు ‘ఫెమా’ చట్టాన్ని బిసిసిఐ అతిక్రమించిందని, ఫలితంగా భారత ప్రభుత్వానికి సుమారు 1,600 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని బోర్డు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు 283 కోట్లు, ఐఎంజి సంస్థకు 88.48 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వివరించింది. చెల్లింపులను బట్టి చూస్తే 1,600 కోట్ల రూపాయల కుంభకోణానికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించింది. మీడియా వార్తల్లో నిజం లేదనడా నికి ఇదే నిదర్శమని బిసిసిఐ వ్యాఖ్యానించింది. బోర్డు లెక్క లు పారదర్శకంగా ఉన్నాయని పేర్కొంది.