కౌలాలంపూర్, సెప్టెంబర్ 21: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్ ‘ఎ’లో శనివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 13-0 తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసింది. స్టార్ ఫార్వర్డ్ రాణి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు మొత్తం ఎనిమిది గోల్స్ సాధించగా, వందన కతారియా మూడు, పూనమ్ రాణి, జోయ్‌దీప్ కౌర్ చెరొక గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే హాంకాంగ్‌పై విరుచుకుపడిన భారత్ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ నమోదు చేసింది. భారత క్రీడాకారిణుల విజృంభణకు హాంకాంగ్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆద్యంతం ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ ఈ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా వచ్చే ఏడాది మే 31 నుంచి జూన్ 14వ తేదీ వరకూ నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సంపాదించడమే లక్ష్యంగా ఎంచుకుంది. ఈ దిశగా తొలి ఆడుగు వేసింది. ఆదివారం చైనాతో పోరుకు సిద్ధమవుతున్నది. పురుషుల విభాగంలో జరిగిన ఆసియా కప్‌లో రాణించిన భారత్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సంపాదించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలోనూ భారత్ ఈ అర్హత సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాల మేరకే భారత మహిళల తొలి మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. అయతే, చైనాతో జరిగే మ్యాచ్ ఈ జట్టు ప్రతిభకు పరీక్షగా నిలవనుంది. ఆ మ్యాచ్‌లోనూ ఇదే స్థాయలో రాణిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు క్వాలిఫై కావడంలో మరో అడుగు ముందుకేస్తుంది. ఈ నేపథ్యంలో చైనాతో మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
హాంకాంగ్‌పై భారత్ ఘన విజయం * ఆసియా కప్ మహిళల హాకీ
english title:
rani
Date:
Sunday, September 22, 2013