బెంగళూరు, సెప్టెంబర్ 21: వెస్టిండీస్ ‘ఎ’తో శనివారం జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 93 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా విండీస్ ‘ఎ’ 16.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ యువరాజ్ సింగ్ అర్ధ సెంచరీతో రాణించి భారత్ ‘ఎ’ విజయానికి బాటలు వేశాడు. లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టి విజయాన్ని సంపూర్ణం చేశాడు. విండీస్ ‘ఎ’ బౌలర్ ఆండ్రీ రసెల్ హ్యాట్రిక్ సాయంతో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. టాస్ గెలిచిన యువీ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, ఉన్ముక్త్ చాంద్ మొదటి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. 21 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 35 పరుగులు సాధించిన ఉతప్పను వీరసామి పెరుమాళ్ ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపడంతో భారత్ ‘ఎ’ తొలి వికెట్ కూలింది. ఉన్ముక్త్ చాంద్ 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి, ఆష్లే నర్సే బౌలింగ్‌లో కిర్క్ ఎడ్వర్డ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బాబా అపరాజిత్ కేవలం మూడు పరుగులు చేసి నర్సే బౌలింగ్‌లోనే ఎడ్వర్డ్స్‌కే దొరికిపోయాడు. ఈ దశలో కెప్టెన్ యువరాజ్, కేదార్ జాధవ్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి విండీస్ ‘ఎ’ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్‌కు 80 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, 19వ ఓవర్‌ను బౌల్ చేసిన ఆండ్రీ రసెల్ వరుస బంతుల్లో వీరిద్దరినీ అవుట్ చేసి విండీస్ ‘ఎ’కు ఊరట కలిగించాడు. యువీ 35 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52, జాధవ్ 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 చొప్పున పరుగులు సాధించారు. ఆతర్వాతి బంతికే యూసుఫ్ పఠాన్‌ను ఆండ్రీ ఫ్లెచర్ క్యాచ్ పట్టగా అవుట్ చేసిన రసెల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతికి నమన్ ఓఝాను పెరుమాళ్ క్యాచ్ పట్టడంతో అవుట్ చేసిన అతను వరుసగా నాలుగు బంతుల్లో నాలుగో వికెట్‌ను కూడా కూల్చాడు. చివరిలో సుమిత్ నర్వాల్ ఏడు బంతుల్లో, ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 18, వినయ్ కుమార్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచారు.
భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ ‘ఎ’ 21 పరుగుల వద్ద కెప్టెన్ కీరన్ పావెల్ (8) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత వికెట్ల పతనం కొనసాగింది. ఓపెనర్ ఫ్లెచర్ (32), వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ డెవన్ థామస్ (21) కొంత సేపు భారత్ బౌలింగ్‌ను ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. చెప్పుకోదగిన పోరాటం చేయకుండానే విండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పేలవంగా ముగించింది. హోరాహోరీ తప్పదనుకున్న ఈ మ్యాచ్ ఏక పక్షంగా ముగియడం క్రికెట్ అభిమానులను నిరాశ పరచింది.
సంక్షిప్తంగా స్కోర్లు
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 (ఉతప్ప 35, చాంద్ 47, యువరాజ్ సింగ్ 52, కేదార్ జాధవ్ 42, రసెల్ 4/45, నర్సె 2/18).
వెస్టిండీస్ ‘ఎ’ ఇన్నింగ్స్: 16.2 ఓవర్లలో ఆలౌట్ 121 (ఫ్లెచర్ 32, బొనె్నర్ 18, థామస్ 21, రాహుల్ శర్మ 5/23, వినయ్ కుమార్ 2/22, యువరాజ్2/24).
ఏకైక అనధికార టి-20 మ్యాచ్‌లో సత్తా చాటిన యువీ, రాహుల్
english title:
uv, rahul
Date:
Sunday, September 22, 2013