హైదరాబాద్ వీకెండ్ ఈసారి కామిక్ కాన్‌తో ఫ్రెండ్షిప్ చేసింది. హైటెక్స్ కనె్వన్షన్ సెంటర్‌కు చేరిన కామిక్ కాన్ -రెండు రోజులపాటు
హైదరాబాద్ యూత్‌తో ఆటాడుకుంది. పాటలు పాడింది.
లెక్కలేనన్ని కబుర్లు చెప్పింది. దేశంలోని ఎక్కడెక్కడి యువతనో
తీసుకొచ్చి ఇక్కడి కుర్రతరానికి పరిచయం చేసింది.
వేషాలేయించింది. వెర్రి అల్లరి చేయించింది. ఇక్కడివాళ్లు,
ఎక్కడెక్కడి వాళ్లలోని -టాలెంట్స్‌ను ప్రదర్శనకు పెట్టింది. జస్ట్ ఫన్‌గా చెప్పాలంటే -హైదరాబాద్ యూత్‌ని రఫ్పాడించింది. కేక పెట్టించింది.
మరోచోటికి తనతో రమ్మని ఆహ్వానం
పలుకుతూ -కూతపెట్టి మరోచోటికి బయలుదేరింది.
కామిక్ -ఓ భాష.
కాదు, కామిక్ -ఓ బొమ్మ
కాదు కాదు, కామిక్ అంటే -అర్థాన్ని పదార్థాన్ని, ఆలోచనని ఆకాశాన్ని, సామాన్య విషయాన్ని శాస్త్ర ప్రక్రియను -మనిషికి పనికొచ్చే ఏ అంశాన్నైనా మనసుకు హత్తుకునేలా అతి సులువుగా చెప్పగలిగే బొమ్మల భాష. అదే హైదరాబాద్ హైటెక్స్‌లో రెండురోజుల పాటు ఉత్తుంగతరంగంగా సాగింది. ఢిల్లీలో పుట్టి, అక్కడే అడుగులు వేయడం మొదలెట్టిన ఈ కామిక్ కాన్, దేశవ్యాప్తంగా సంచరిస్తూ రెండురోజులు హైదరాబాద్‌లో కొలువుదీరింది. కుర్రతరంతో కలిసి సందడి చేసింది.
**
ఎక్కడినుంచో వచ్చినా ఇక్కడి సంప్రదాయం, సంస్కృతితో కలగలిసిపోయి ఒక ఒరవడిని సృష్టించుకున్న ‘ఇండియన్ కామిక్’కు సాహిత్య ప్రక్రియలో ఓ ప్రత్యేకత ఉంది. పురాణాలు, ఇతిహాసాల నుంచి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనల వరకూ విషయాన్ని సులువుగా చెప్పేందుకు, ఆలోచనలను బొమ్మల రూపంలో చూపేందుకు అనేకమంది చేసిన ప్రయత్నంతో ఇదొక పరిశ్రమగా స్థిరపడింది. అయితే, మరుగున పడిపోతున్న కామిక్ పరిశ్రమను పదికాలాలపాటు పరిరక్షించుకునే ప్రయత్నం కొద్దిరోజుల క్రితం ప్రారంభమైంది. అదే ‘కామిక్ కాన్’. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీనుంచి బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌కు -ఈ వీకెండ్‌లో హైదరాబాద్‌లో హాల్ట్ దొరికింది. నిరాదరణకు గురవుతున్న కామిక్ సంస్కృతిని కొత్త తరాలకు పరిచయం చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నది దీని ప్రయత్నం. స్థానికంగా ఉండే యంగ్ టాలెంట్స్‌ను ఈ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కించుకుని వారిని ప్రోత్సహించాలన్నది ముఖ్య ఉద్దేశం. అందుకే -‘కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్’ శరవేగంతో దూసుకుపోతోంది. దేశంలోని ముఖ్య పట్టణాలను టచ్‌చేస్తూ అక్కడవున్న కామిక్ రచయితలు, ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, కారికేచరిస్టులు, పబ్లిషర్లు, కామిక్ డ్రామా ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ, కామిక్ పరిశ్రమ పురోభివృద్ధికి పెద్దఎత్తునే కృషి జరుగుతోంది.
***
ఒక్కరా ఇద్దరా.. అచ్చంగా పదివేల మంది. అందులో ఎందరో యువ రచయితలు.. గొప్ప కళాకారులు.. కామిక్ పుస్తకాలను పదిమందికీ అందించే పబ్లిషర్లు. వీరందరినీ ఆకట్టుకోగలిగే అగ్రశ్రేణి రచయితలు. కామిక్ వేషాల్లో కళ్లను కట్టిపడేయగలిగిన ఆర్టిస్టులు. ఒకరితో ఒకరు మాటకలిగే అవకాశం దొరికింది. ఒకరుకొకరు అనుబంధాన్ని పంచుకునే వేదిక దొరికింది. వీటన్నింటికీ -కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ ఆధారమైంది. హైదరాబాద్ కుర్రతరంలోని ఉత్సాహం, ఉద్వేగం, ఆనందం, అల్లరితనాన్ని చూసిన తరువాత -దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు చేరాలన్న సంకల్ప ప్రణాళికను కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడినుంచే రూపొందించుకుంది.
***
ప్రముఖ రచయితలు, కళాకారులుకు నిజంగా ఇదో గొప్ప అవకాశం. ఔత్సాహిక కళాకారుల్లో వినూత్న భావాలను పెంపొందించేందుకు ఈ వేదిక అనితరసాధ్యం. దీనికి అవసరమైన ప్లాట్‌ఫారమ్‌ను కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆహూతులంతా ఆనందం వ్యక్తం చేశారు. వీకెండ్ డేస్ శని, ఆదివారాల్లో సైబరాబాద్‌లోని హైటెక్స్ మైదానంలో కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన కార్యక్రమానికి దాదాపు పదివేలమంది హాజరయ్యారు. 2011లో కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నాల్గవ ప్రదర్శనను ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించింది. దేశవిదేశాలకు చెందిన రచయితలు, కళాకారులు వేదికపై ఆనందాన్ని, ఆలోచనలను పంచుకున్నారు. ‘సైబరాబాదీగా గర్వించు’ అనే నినాదాలున్న టీ షర్టులు ధరించారు. బాల, యువ కళకారులు హల్‌చల్ చేశారు. ‘ఆంధ్ర.. తెలంగాణ.. నేనెవరైనా కావొచ్చు. హైదరాబాద్‌ను ప్రేమించొచ్చు’ అన్న నినాదాలు మిన్నంటాయి. ‘హైదరాబాద్.. బిర్యానీబాద్’ అనే పదం రుచుల అనుబంధాన్ని గట్టిపరిచింది. చిన్నా, పెద్ద తేడాలేకుండా ఆహూతులంతా ఆనందంలో మునిగితేలారు. వివిధ కళారూపాలతో తమలోని తృష్ణను తీర్చుకున్నారు. జెఎన్‌టియుకు చెందిన నిశాంత్ శర్మ మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ సూపర్ హీరోల కలయిక నన్ను కట్టిపడేసింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘చోటాభీమ్, రాజీవ్ చిల్కాలు భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన సూపర్ హీరోలు కావడం విశేషం. కాల్పనిక పాత్రలో ఆహూతులు జీవించారు. ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన వేదిక లభించింది’ అంటూ యువ, బాల కళాకారులు తమ మనసు ఆనందాన్ని బయటపెట్టుకున్నారు. బొగ్గుముక్క గీతలతో వెలకట్టలేని ఆకృతులు సృష్టించిన ఆదిత్య చిలుమల చిత్రాలు ప్రదర్శనకు హైలెట్. ఇక గ్రాఫిక డిజైనర్ల సంతోషానికి అవధులే లేవు. డిజైన్ కల్చర్‌తో అందరినీ అబ్బురపరిచారు. జానపద కథలను చెప్పడంలో సుప్రసిద్ధుడైన రవితేజ గోవిందరాజులు మాట్లాడుతూ ‘ఈ నగరంలో గొప్ప ప్రతిభ ఉంది. దీన్ని వెలికి తీసేందుకు ఇండియన్ కామిక్ కాన్ కృషి చేస్తోంది. ఇది ప్రశంసించదగ్గ విషయం’ అన్నారు. ఐఐటి చెన్నై గ్రాడ్యూయేట్ రవితేజ గోవిందరాజు, పబ్లిషింగ్ రంగంలోని రమ్య శ్రీరామ్, ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేస్తున్న ప్రియతమ్, ఆదిత్య చిలుమల లాంటి వాళ్లు అనేకమంది కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్‌తో హైదరాబాద్‌ను కట్టిపడేశారు. మళ్లీ కామిక్ కాన్ ఎక్స్‌ప్రెస్ వచ్చేవరకూ ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటామని చెప్పి హైదరాబాద్ యూత్ డెయిలీ లైఫ్‌లోకి ఒదిగిపోయింది.
=============
యువతరం కోసం మళ్లీ ‘యువ’
ప్రారంభమైంది. జ్ఞాపకాలో, అనుభవాలో, అల్లరో,
ఆనందమో.. ఏ అంశంమీదనైనా పాఠకులతో
మీ ఫీలింగ్స్ పంచుకోవాలని అనిపిస్తే -ఈ పేజీకి
రాసి పంపించండి. బావుంటే తప్పక ప్రచురిస్తాం.
రచనలు పంపాల్సిన చిరునామా..
ఎడిటర్,
ఆంధ్రభూమి దిన పత్రిక
36, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్
=============