విశాఖపట్నం, సెప్టెంబర్ 24: సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం సీమాంధ్ర జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్ళ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సమైక్యాంద్ర విద్యుత్ డిస్కామ్ జెఏసి చైర్మన్ గణపతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25, 27, 30 తేదీల్లో మంత్రుల ఇళ్ళ వద్ద ధర్నా కార్యక్రమాలుంటాయన్నారు. వచ్చేనెల రెండవ తేదీన గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం జరుపుతున్నట్టు చెప్పారు. వచ్చేనెల 29న వౌన ప్రదర్శన, 5న ఆటపాట, 8, 25 తేదీల్లో రాస్తారోకో, 10న బైక్ ర్యాలీ, 16, 23 తేదీల్లో ర్యాలీలు ఉంటాయని పేర్కొన్నారు. 15 19 తేదీల్లో ధర్నాలు, 30న స్వచ్చంధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. నవంబర్ ఒకటవ తేదీన పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తామన్నారు. వీటిలో జెఏసి ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమైక్య నినాదాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేడు లక్షగళ గర్జన
విశాలాక్షినగర్, సెప్టెంబర్ 24: ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో బుధవారం చోడవరం హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించే, సమైక్యాంధ్ర లక్షగళ గర్జనను విజయవంతం చేయాలని జెఎసి స్టేట్ ప్రెసిడెంట్ కె.హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ వద్ద జరిగిన కార్యక్రమంలో సమైక్యాంధ్ర లక్ష గళ గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను చేపట్టిందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఎన్జీఓలు, దినసరి కూలీలు స్వచ్ఛందంగా పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. ఈ సభలో చలసాని శ్రీనివాస్ పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి బాలకృష్ణ, ఆనంద్, అడారి కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మావోల పోస్టర్లు
ముంచంగిపుట్టు, సెప్టెంబర్ 24: ముంచంగిపుట్టు, పెదబయలు సరిహద్దు గ్రామాల్లో మంగళవారం సి.పి.ఐ. మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. పెదబయలు మండలంలోని రూఢకోట, ముంచంగిపుట్టు మండలం కుమడ, బూసిపుట్టు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు అంటించారు. ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో 14 మంది మావోయిస్టులను హతమార్చిన సంఘటన బూటకమని, పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని, బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని మావోయిస్టులు ఆ వాల్‌పోస్టర్లలో పేర్కొన్నారు. రూఢకోట అంబేద్కర్ సెంటర్ నుంచి సంతబయలు, కుమడ, బూసిపుట్టు గ్రామాల రహదారులకు ఇరువైపులా వావోల వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ సంఘటనతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.