తక్కువ కష్టంతో ఎక్కువ సుఖాన్ని పొందాలనుకుంటారు సాధారణంగా ఎవరైనా. ఎక్కువ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? నేటి రోజుల్లో ఎక్కువ సంపాదన ఉన్నవాడే సకల సౌఖ్యాలనూ అనుభవిస్తున్నాడు. లేనివాడు ఎక్కడివాడక్కడే పడుంటున్నాడు. దాంతో యువతలో ఒక దట్టమైన ఆశ పెనుభూతంలా మనసుపై పడి రకరకాల ఆలోచనల్లో పడేస్తోంది. ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా? ఈ ఆలోచనలు మనసును అల్లుకోగానే వాళ్లకి ఆకర్షణీయంగా అందమైన స్వప్నం కళ్లముందు కనబడేలా చేసేది- టీవీలూ, సినిమాలూ! చదువులో రాణించాలంటే ఎంతో కష్టపడాలి మరి. చదువుల్లో ర్యాంకుల పోటీ.. ఆ తర్వాత ఉద్యోగాల్లో పోటీ... మొత్తానికంతా కష్టంగా కనిపిస్తుంది. అంతకన్నా ఈ రోజుల్లో ఎన్నో లైవ్‌షోలు! ఒక్కసారి టీవీలో ఏ యాంకర్‌గానో చేరిపోతే, చేతినిండా డబ్బు, బోలెడంత పేరు. కోరుకున్న స్వర్గం, తృప్తి, సుఖం. టీవీ షోలకన్నా ఒక మెట్టు ఎక్కువే సినిమాలు! మొదట ఎలాగో సినిమా రంగంలో కాలుపెడితే చాలు. మొదట్లో కొన్ని తిప్పలు పడ్డా లక్షలు చేతికొస్తాయి. పాతకాలంలో సినిమా వాళ్లకి గౌరవం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అందరికన్నా వాళ్లే ధనవంతులవడంతో మధ్యతరగతి, పేద ప్రజల దృష్టంతా వారిపైనే ఉండి, వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. సినిమావాళ్లు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకోవడానికి ఓ మామూలు చిన్న నటిని కాకుండా యాంకర్లకయితే వేలకు వేలు కుమ్మరించి ఘనంగా ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఇక ఏ షాపుల ఓపెనింగ్‌ల పేరిట రిబ్బన్ కటింగుకు పిల్చినా- వాళ్లేదో దివి నుండి దిగిన తారల్లా అంతా ఫీలవుతారు. ఆ రెండు నిమిషాలకీ మామూలు నటులైతే కొన్ని లక్షలూ, మరీ పెద్దనటులైతే భారీ మొత్తంలోనే నగదు అం దుకుంటున్నారు. ఇక, సినిమాల్లో బికినీలు వేసుకుని ఒక్క ఐటెమ్ సాంగ్ చేస్తే చాలు లక్షలూ, కోట్లూ! ఏదో ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే బో లెడు ధనం. అందుకే పాపం! నేటి యువతకు- ‘బాగా కష్టపడి చదువుకో..’ వంటి మాటలు మనసుకి ముళ్లులా గుచ్చుకుంటున్నాయి. చదువు బుర్రకెక్కడం లేదు. సినిమాల్లో, టీవీ షోల్లో న టులు వేసుకునే రకరకాల డ్రెస్సులు, వాళ్లకొచ్చే ఆదరణ, డబ్బూ.. వీళ్లని ఊహాలోకాల్లో ముంచేస్తున్నాయి. తామూ అలాగే ఉండాలని ఎన్నైనా పెడదారులు పడుతున్నారు. ఒక్కో సినిమా ఎన్నిసార్లైనా చూస్తున్నారు. అందులోని మసాలా డైలాగులు, మత్తెక్కించే దృశ్యాలకు హుషారెక్కిపోయ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ పిచ్చివాళ్లైపోతున్నారు.
ఇక, అందాల పోటీలు యువతకు మరొక ఆకర్షణీయమైన అంశం. చదువుకున్న, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవాళ్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం వేలం వెర్రిగా మా రింది. రకరకాల బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం, డబ్బులు తగలేసి సౌందర్య సాధనాలను కొనుక్కోవడం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఆసక్తితో తిరిగే యువతకి- పెద్దలు చెప్పే నీతులూ, పుస్తకాలూ బూతులుగానే కనిపించవూ? కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లలను టీవీ, సినిమాల వైపు ప్రోత్సహించడం మనం చూస్తూనే వున్నాం. పిల్లలు అలా చెయ్యకపోతే తమను గౌరవించడం లేదని బాధపడే తల్లిదండ్రులూ ఉన్నారు. స్నేహితులంటూ రకరకాల వ్యక్తులతో- ఏదో సాధించాలన్న వెర్రి ఆశతో జత కట్టి యువతీ యువకులు దారుణంగా మోసపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏం లాభం? ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, వంచన వంటి అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఇది ఎవరి పాపం? ఆకర్షించబడడం యువత తప్పు కాదు. ఊహాలోకాలను అందుకోవాలని అనాలోచితంగా అడుగులు వెయ్యడం తప్పేనని వాళ్లు తెలుసుకునేలోగా బలైపోతున్నారు. లాటరీలో డబ్బు వస్తుందని నెల నెలా బోలెడంత డబ్బు పోసి టిక్కెట్లు కొని సంసారాలు నాశనం చేసుకున్నవాళ్లు లేరూ? ఏదోలా సంపాదించేద్దామని పేకాటలూ, గుర్రప్పందాలూ అలవాటు చేసుకున్నవాళ్లూ లక్షలూ, కోట్లూ వున్నారు సమాజంలో. ఇవన్నీ కూడా వ్యసనాలే కదా? దురాశాపరులు ఈ వ్యసనాలకి సులభంగా అలవాటుపడడంలో ఆశ్చర్యమేముంది? వ్య సనాలను ప్రోత్సహించే వారికి శిక్షలేవీ? డ్రగ్స్ అమ్మి పట్టుబడినవారిని ఎందుకు ఉరితియ్యడం లేదు? ఇలాంటి దౌర్భాగ్యాలను అరికట్టకుండా- కేవలం పిల్లలకి రామాయణం, మహాభారతం వంటి పురాణాలు, నీతికథలు చెబితే వారి బుర్రకెక్కుతాయా? సెన్సార్ బోర్డు బికినీ డాన్సులూ, ‘ఐటెమ్ సాంగ్స్’లను అరికట్టడం సాధ్యంకాదా?
పలుకుబడికీ, పైసాకీ లొంగకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుంటే మంచి సమాజం రాదా? సమాజం చెడిపోయింది అంటాం. సమాజం అంటే ఎవరు? మనమూ, మన పిల్లలే కదా? సమాజం చెడిపోకుండా కాపాడడం మన ధర్మం కాదా? ఆలోచించండి! మన యువత బాగుపడాలని, విద్యలో వారు రాణించాలని కోరుకోవడమే కాదు.. ఈ దౌర్భాగ్యాలకు వారు లోనవకుడా రక్షించుకోవాలి. అందాల పోటీల్లో పాల్గొన్నా, సినిమాల్లో నటించినా- రంగు పూసిన అందం కొంతసేపే కదా..! ఇతర రంగాల్లో రాణించేవారిని తక్కువ వాళ్లని భావించడం, అందాల పోటీలే పరమార్థం అ నడం తగునా? కోలాహలంగా అర్ధనగ్న ప్రదర్శనలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి..? *
మరమరాలు
english title:
a
Date:
Wednesday, September 25, 2013