‘కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త’- అని వెనుకటి రోజుల్లో జర్నలిజం పాఠాలు చెప్పేవాళ్లు. కానీ, ఓ కుక్క పెద్దపులిని కరిస్తే అది ఏమిటి? వార్తా? కాదా? ఏమో గానీ- ఇది మాత్రం వాస్తవం.
పన్నా (మధ్యప్రదేశ్) పెద్దపులుల సంరక్షణా కేంద్రంలో- మూడు సంవత్సరాల వయసున్నదే అనుకోండి- ఓ ‘‘పెద్దపులి కూనని’’ ఊరకుక్క ఒకటి కొద్ది రోజుల క్రితం కరిచింది. అది పులితోకని గట్టిగా కొరికేసింది. ‘గాండ్రు.. గాండ్రు’మనే పులి ఒక్కసారి కుయ్యోమొర్రోమంది. దాన్ని తక్షణం క్వారంటైన్ వార్డుకి తరలించారు. కరిచింది పిచ్చెక్కిన కుక్క కావచ్చునుగా..? అని వైద్యులు పరిశీలించారు. ఆ మాట వాస్తవమే. అది పిచ్చెక్కిన శ్వానమే. ఇద్దర్ని కరిచింది. ఆ తర్వాత వన్యమృగ సంరక్షణ ప్రాంతమైన ఆ అడవిలో దూరింది. నూట యాభై కేజీల బరువున్నదా పులి. (దాని పేరు 2పి212) మొదట కుక్కని నిలువరించింది. కానీ, కుక్క భయపడలేదు. పులి కోరలనుండి తప్పించుకుని దాని తోకని గట్టిగా కరిచేసింది. ఆ తర్వాత పరుగులు తీసింది.
పాపం..! ఆ పులికి రాబిస్ నిరోధక ఇంజక్షన్లు పొడుస్తున్నారు. పన్నా పులి క్షేత్రంలో రెండు ఆడ పులులున్నాయి. ఒక్కో పులి మూడేసి పిల్లల్ని కన్నాయ. పులి చాలా ‘ఖరీదైనది’ కదా? దాన్ని చంపుట మహా నేరము. అదిసరే గానీ, పులి ఎవరినైనా చంపుతేనో? అది ఘోరము. అంతేగా..?
అక్కడ టీచర్.. ఇక్కడ దొంగ..!
‘దొంగతనము చేయరాదు, అది నేరము’ అని చెప్పాలి గురువు గారు. కానీ- ఆ ఉపాధ్యాయుడే దొంగతనం చేస్తే- ‘అది తప్పు’ అని శిష్యుడు గురువు గారికి చెప్పకూడదు కదా? అంచేత- తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న 34 సంవత్సరాల అయ్యవారు ఒకడు పక్కనే వున్న కాంచీపురం జిల్లాలోకి పోయి, అక్కడ అతివల మెడలోని ఆభరణాలను అతి లాఘవంగా కత్తిరించేసి, అక్కణ్నుంచి సదరు బంగారం ఎత్తుకుని వెల్లూరు వచ్చేస్తూంటాడు. దోచిన బంగారం దాచేస్తాడు.
ఆ అయ్యవారేం చేస్తూంటాడంటే- బుద్ధిగా పిల్లలకి పాఠాలు చెబుతూ- ఓ పది రోజుల అత్యవసరమయిన పని వుందని అంటూ సెలవు పెడతాడు. పొరుగు జిల్లాలోని వూళ్లో తన ‘పార్ట్‌టైమ్ జాబ్‌ను’ పూర్తిచేసుకుని, ఉద్యోగం లోకి తిరిగి బుద్దిగా- చాక్‌పీసూ, డస్టరూ, బెత్తమూ తీసుకుని- తయారైపోతూంటాడు.
అతని వద్ద పోలీసులకి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బంగారు గొలుసులు, పుస్తెల తాళ్లూ వగైరా దొరికాయి. నిజానికి ఈ ‘మాధన్ మారన్’ అనే టీచర్ మీద అదివరకే 2012లోనే చైన్ స్నాచింగ్ కేసులు చాలానే ‘ఓసూరు’ అనే గ్రామంలో వున్నాయిట! కానీ, కోర్టుల నుంచి ‘స్టే’ తెచ్చుకుని, వెల్లూరుకు వచ్చి మళ్లీ టీచర్ ఉద్యోగం సంపాదించాడట. మాధన్ మారన్‌ని ‘మారవా?’ అంటే- మారను అంటాడు..?
‘కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త
english title:
veeraji
Date:
Wednesday, September 25, 2013