విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర బంద్‌కు ఎపి ఎన్జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య రంగాలు బంద్‌కు సంఘీభావంగా దుకాణాలు మూసివేశారు. సినిమా ధియేటర్ల యాజమాన్యాలు సైతం రెండు ఆటలు నిలిపివేసి మద్దతు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు గత 43 రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో రవాణా వ్యవస్థ స్తంభించగా, బంద్‌లో ఆటోలు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నగరంలో వాతావరణం అప్రకటిత కర్ఫ్యూను తలపించింది. పూర్ణామార్కెట్ సహా హోల్ సేల్ వ్యాపారస్తులు, ఫుట్‌పాత్ వ్యాపారస్తులు సైతం బంద్‌కు సంఘీభావంగా దుకాణాలను మూసివేశారు. హోటలియర్స్ అసోసియేషన్ సీమాంధ్ర బంద్‌కు మద్దతు ప్రకటించి ఒకరోజు హోటళ్లను మూసివేశారు. చిరువ్యాపారస్తులు కూడా బంద్‌లో పాల్గొని దుకాణాలను స్వచ్ఛంధంగా మూసివేశారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహించారు. రోడ్లపై వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. బంద్‌లో భాగంగా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సమైక్యాంధ్ర నినాదంతో ఎపి ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ జెఎసి ప్రతినిధులు మద్దిలపాలెం, ఆశీలుమెట్ట, జివిఎంసి, జగదాంబ, కలెక్టరేట్, గురుద్వార, సత్యం జంక్షన్, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు మద్దిలపాలెం జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు.
ప్రయాణీకుల ఇక్కట్లు
బంద్‌తో రైల్వే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి నగరంలో బంద్ ప్రభావం కన్పించడంతో గోదావరి, విశాఖ రైళ్లలో విశాఖ వచ్చిన ప్రయాణీకులు గమ్యస్థానాలు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు సైతం ఆటోలు తిరగక, నిరసన కారుల రాస్తారోకోలతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణీకులకు కష్టాలు తప్పలేదు.
జెఎసి విద్యార్థుల అరెస్టు
సమైక్యాంధ్రకు మద్దతుగా తలపెట్టిన బంద్‌లో భాగంగా కార్యాలయాలను మూయించేందుకు ప్రయత్నించిన విద్యార్ధి జెఎసి ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపధ్యంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసివేసినప్పటికీ సిరిపురం హెచ్‌ఎస్‌బిసి ఉద్యోగులు విధులకు హాజరుకావడంతో విద్యార్థి జెఎసి నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర సాధననేపధ్యంలో జరుగుతున్న బంద్‌కు మద్దతు తెలపకుండా విధులకు హాజరుకావడాన్ని తప్పుపట్టారు. సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకుని జెఎసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఆరేటి మహేష్, కాంతారావు, పొలిటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావులను అదుపులోకి తీసుకుని అనంతరం వదిలిపెట్టారు.
మద్దిలపాలెం వద్ద ఎయు రీసెర్చ్‌స్కాలర్ల నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎయు రీసెర్చ్ స్కాలర్లు మద్దిలపాలెం కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా ఫోరం కన్వీనర్ సురేష్ మీనన్ మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు ద్రోహులుగా పేర్కొన్నారు. రాష్ట్రం విభజన జరిగిపోయిందంటూ కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఐటి హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడాన్ని ఖండించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకున్న హైదరాబాద్ విభజన తర్వాత తెలంగాణా పరమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఇంతపెద్ద ప్రాజెక్టును హైదరాబాద్‌కే కట్టబెట్టడం వెనుక సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల స్వార్ధం, చేతగాని తనం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ఐటి హబ్‌ను విశాఖ, విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోగారావు, హరీష్, సత్యనారాయణ, మూర్తి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
సిరిపురంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు సిరిపురం కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిరిపురం సర్కిల్‌వద్ద పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మొహరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఆటో డ్రైవర్ల ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపిఎన్జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు ఆటో వర్కర్లు బంద్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆటో వర్కర్లు అక్కయ్యపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోలతో జరిపిన ర్యాలీ ఆకట్టుకుంది. తోపుడు బళ్ల వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తోపుడుబళ్ల వర్తకులు నర్సింహనగర్ నుంచి దొండపర్తి సూర్య ధియేటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వర్తకులు తోపుడు బళ్లతో ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే ఉల్లి వర్తకులు జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్ వద్ద ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. హోటలియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ యజమానులు, వర్కర్లు జివిఎంసి వద్ద నిరసన ప్రదర్శన జరిపారు.
జివిఎంసి ఉద్యోగుల మోటార్ సైకిల్ ర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా జివిఎంసి ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జగదాంబ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని సమైక్యంగా ఉంచుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మన్యంలో బంద్ విజయవంతం
పాడేరు, సెప్టెంబర్ 24: రాష్ట్ర విజభన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి మంగళవారం నిర్వహించిన బంద్ విశాఖ మన్యంలో విజయవంతమయ్యింది. ఉద్యోగులు చేపట్టిన బంద్‌లో అన్ని వర్గాల వారు స్వచ్చంధంగా పాలుపంచుకుని తమ మద్దతు ప్రకటించడంతో ఏజెన్సీ వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా ముగిసింది. బంద్ సందర్భంగా ప్రయివేట్ వాహనాలను నిలిపివేయడంతో గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. ఎటువంటి వాహనాలు కూడా తిరగకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బంద్ దృష్ట్యా ద్విచక్ర వాహనాలను సైతం సమైక్యవాదులు అనుమతించకపోవడంతో వివిధ వర్గాల వారు ఎక్కడివారే అక్కడే నిలిచిపోవలసి వచ్చింది. ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ బంద్ పాటించారు. స్థానిక అగ్నిమాపక దళం కేంద్రం వద్ద ప్రధాన రహదారిపై ఉద్యోగులు బైఠాయించి రోడ్డుపైనే హౌసీ ఆడుతూ జై సమైక్యాంధ్ర నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై వంటావార్పు చేపట్టి రోడ్డుపైనే భోజనాలు చేశారు. మహిళా ఉద్యోగులు, మహిళలు ప్రధాన రహదారిపై ధింసా నృత్యం ప్రదర్శిస్తూ సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఉద్యోగులు నిర్వహించిన బంద్‌కు సంఘీభావంగా స్థానిక వర్తకులు పాడేరులో ప్రదర్శన చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. బంద్ సందర్భంగా పాడేరులో వివిధ బ్యాంకులు, పెట్రోలు బంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సినిమాహాలు మూతపడగా పట్టణంలోని అన్ని రకాల దుకాణాలను వ్యాపారులు స్వచ్చంధంగా మూసివేసారు. దీంతో పాడేరు పట్టణ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏజెన్సీలోని హుకుంపేట, జి.మాడుగుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు తదితర మండలాల్లో కూడా సమైక్య బంద్ సంపూర్ణంగా జరిగింది. జి.మాడుగులలో మంగళవారం జరగాల్సిన వారపు సంత బంద్ దృష్ట్యా వెలవెలబోయింది. బంద్ దృష్ట్యా ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్ పాడేరు పట్టణంలో పర్యటిస్తూ బంద్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి ఎక్కడా ఎటువంటి అల్లర్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జె.ఎ.సి. నాయకులు రూడి అప్పారావు, కె.గంగన్నపడాల్, అంబిడి శ్యాంసుందరం, ఎల్.అప్పారావు, యు.టి.కోటేశ్వరరావు, కె.దేముళ్లనాయుడు, రేగం సూర్యనారాయణ, తురక రమణ, కె.సుబ్రహ్మణ్యం, పలువురు నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.