విజయనగరం, సెప్టెంబర్ 24: ఎస్.కోట మండలంలో కొట్టక్కి గ్రామం కోటమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన ఆర్డీవో సత్యనారాయణ సతీమణి కొట్టక్కి గ్రామ దేవతను దర్శించుకోడానికి రాగా, అక్కడ కారు డ్రైవరు సురేష్‌కు మరో ఆటో అతనికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు తలపడటంతో ఈ ఘర్షణలో 12 మందికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. గాయాలపాలైన వారిలో కొట్టాం గ్రామానికి చెందిన బి.కృష్ణ, గొల్లి శ్రీను, బి.కోటారావు, ఎం.గోవింద, డి.సురేష్‌లతోపాటు ధర్మవరం గ్రామానికి చెందిన వజ్రపు అప్పారావు, మధుసూదనరావు, ఎల్.సన్యాసప్పడు, ముత్యాలు, ఎల్.మురళీ ఉన్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు.
భర్త ఆచూకీ తెలపాలంటూ మహిళ ఆందోళన
గంట్యాడ, సెప్టెంబర్ 24 : ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన తన భర్త ఆచూకీ తెలియ జేయాలంటూ ఈ మండలం కొత్తవెలగాడ గ్రామానికి చెందిన కె. యర్రయ్యమ్మ, ఆమె కుటుంబీకులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి మంగళవారం ఆందోళన జరిపారు. ఈనెల 19న ఇద్దరు వ్యక్తులు తన భర్త రాజును బయటకు తీసుకువెళ్లారని ఇప్పటి వరకు తన భర్త ఆచూకీ తెలియ లేదని యర్రయ్యమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా సమాచారం తెలియలేదని దళితులపై చిన్నచూపు చూస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్సై అప్పలనాయుడు గ్రామానికి వెళ్లి అదృశ్యమైన రాజు కేసు దర్యాప్తులో ఉందని యర్రయ్యమ్మకు తెలిపారు.