విజయనగరం, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు మిలాఖత్ కావడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి కేసులో సిబిఐ ప్రాధమిక విచారణ పూర్తి చేసినప్పటికీ కేసును ముందుకు సాగనీయకుండా నీరుగార్చడం విచారకరమన్నారు. మంగళవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను లూటీ చేసి వారి జీవితాలతో ఆడుకుంటుందని ఆయన ఘాటుగా విమర్శించారు. చట్టం అమలుకు సహకరించడం లేదన్నారు. ముద్దాయికి బెయిల్ వస్తే వేడుకలు జరుపుకోవడం విచిత్రమన్నారు. జగన్ కేసులో మంత్రులు, ఐఎఎస్ అధికారులు అంతా వ్యవస్థాపక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. సిబిఐ చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉద్దేశపూర్వకంగానే కుట్రకు పాల్పడి ధర్యాప్తును కొనసాగించలేదన్నారు. ఇది ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. రికమెండేషన్ ఉన్నచోట చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయడం లేదన్నారు. ఇదిలా ఉండగా జాతీయ సమైక్యత మండలి (ఎన్‌ఐసి) సమావేశంలో అస్సాం వాళ్లు బోడోలాండ్ గురించి మాట్లాడిన, మన రాష్ట్రంలో సమస్యలపై నోరు విప్పకపోవడం సిగ్గు చేటన్నారు. ఏదేని సమస్యలను చర్చకు తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలన్నారు. మన దేశంలో ప్రధాని సమస్యలను పరిష్కరించేందుకు పర్యటించిన దాఖలాలు లేవన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు, సీట్ల కోసం జగన్ ఒక్కడికే బెయిల్ మంజూరు చేసిందన్నారు. తెలంగాణాలో కెసిఆర్‌తోను, సీమాంధ్రలో జగన్‌తో పొత్తు కుదుర్చుకొని తెలుగుదేశం పార్టీని అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. పట్టణంలో సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని, ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై ధర్నా చేస్తుంటే ఫొటొలు తీసి వారిని బెదిరించారని, తాజాగా గజపతినగరంలో ఉపాధ్యాయునిపై కాంగ్రెస్ అనుచరులు దాడి చేశారని ఆయన మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఏ కార్యక్రమం చేసినా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు చేశామని చెబుతుంటారని, మంత్రి బొత్స తనకు ఏ ఆదేశాలు ఇచ్చారో బయటపెట్టాలని ఆయన కోరారు. కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం కోసం కాంగ్రెస్ నాయకులు పోరాటం చేస్తున్నారంటే జనం నమ్మే పరిస్థితిలో లేరని, చిత్తశుద్ధి ఉంటే మంత్రి బొత్స, ఎంపీ ఝాన్సీలక్ష్మి ఇంటి వద్ద ధర్నాచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు త్రినాద్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ, కర్రొతు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు మిలాఖత్ కావడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో
english title:
ashok
Date:
Wednesday, September 25, 2013