విజయవాడ, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మూడో రోజైన బుధవారం కూడా నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్ని మూతబడ్డాయి. మరోవైపు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల మున్సిపల్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె 43వ రోజుకు చేరింది. కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిరవధిక సమ్మె కొనసాగించాలని ఎస్‌విఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీర్మానించారు. సమ్మె సందర్భంగా జీతాలకు నోచుకోని కార్మికుల స్థితిగతులపై కూలంకషంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో జెఎసి కన్వీనర్ ఎ విద్యాసాగర్, ఎంప్లారుూస్ యూనియన్ ప్రాంత కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, జోనల్ సెక్రటరీ వైవి రావు, నాయకులు హనుమంతరావు, బర్మా ప్రభాకర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రాంత కార్యదర్శి ఆర్ సుబ్బారావు, నాయకులు ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 57 రోజులుగా నిర్విరామంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ నాయకత్వంలో కృష్ణానదిలో ఆకర్షణీయమైన రీతిలో బోట్ ర్యాలీ నిర్వహించారు. భవానీ ఐలాండ్ ఘాట్‌లో దాదాపు 25 నాటు పడవలు సిద్ధం చేసారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వాటిల్లోకెక్కి సమైక్యాంధ్ర పతకాలు చేపట్టారు. అయితే వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నదంటూ ముందుగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కొద్ది సేపు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ సందర్భంగా అవినాష్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి 100 మంది ప్రయాణించే బోదిశిరి లాంచీను సిద్ధం చేశారు. గజఈతగాళ్లు నాటు పడవల్లో చుట్టూ ఉండేలా ఏర్పాటు చేసుకుని కొద్ది సేపు ర్యాలీ నిర్వహించారు. అవినాష్ మాత్రం వ్యూహాత్మంగా నాటు పడవలోనే బయలుదేరారు. ఈ సందర్భంగా నినాదాలు హోరెత్తాయి. చివరగా దుర్గమ్మ సాక్షిగా కృష్ణమ్మకు హారతినిస్తూ తమ ఆకాంక్ష నెరవేరేలా చూడాలని ప్రార్థించారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి నేతలు ఎన్‌ఎస్ రాజు, దండమూడి రాజేష్, పర్వతనేని,కొరివి చైతన్య, రమేష్ చౌదరి, మాజీ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజుకు చేరిన 72 గంటల దీక్ష
ఉద్యమంలో భాగంగా తెలుగు యువత నేత నగర అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ మరో 30మంది యువకులతో కలిసి పటమట ఎన్టీఆర్ సర్కిల్లో ప్రారంభించిన 72 గంటల దీక్ష మూడో రోజుకు చేరింది. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. వీరిలో తెలుగుదేశం జిల్లా, నగర అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె నాగుల్ మీరా, మాజీ ఎంపి గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, కాట్రగడ్డబాబు, ఎంవిఆర్ చౌదరి, కేశినేని నాని, జెఎసి చైర్మన్ ప్రొ నరసింహారావు, కన్వీనర్ ప్రొ శామ్యూల్, విశాలాంధ్ర మహాసభ నాయకులు ఓ మధుసూదనరావు, వి శ్రీనివాసరావు, చంద్రహాస హర్షవర్ధన్, భానుచందర్, నందిగిరి కిషోర్, శివకుమార్ తదితరులున్నారు.
150 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ
శ్రీగౌతమ్ హైస్కూల్ డైరెక్టర్ ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో రెండు వేల మంది విద్యార్థులు 150 అడుగుల జాతీయ పతాకం 3 వేల బెలూన్లతో ఒన్‌టౌన్‌లో ప్రదర్శన నిర్వహించి చివరగా చిట్టినగర్‌లో మానవహారంగా నిలిచి నినాదాలు చేశారు.
రోడ్డుపై తరగతులు
ఉపాధ్యాయుల సమ్మెతో గత నెల రోజులుగా తరగతులు జరుగకపోవటంతో సత్యనారాయణపురం ఎకెటిపి మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఏలూరి శంభుప్రసాద్ సమీపంలోని గ్రంథాలయం ఎదుట నడి రోడ్డుపై పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో
వెబ్‌సైట్ ప్రారంభం
పటమట, సెప్టెంబర్ 25: సీమాంధ్రలోని 13 జిల్లాలలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో అందరికి తెలిసే విధంగా అన్ని ప్రముఖ పత్రికల్లో ఫోటోలతో సహ ప్రతి రోజు వార్తా విశేషాలను ప్రచురిస్తున్న సంగతి విదితమే. దీనికి తోడు వైబెసైట్ ద్వారా కూడా సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు నగరంలోని డేటా క్రియషన్స్ సంస్థ ఒక ప్రత్యేక వైబెసైట్ రూపొందించిందని డైరెక్టర్ మహ్మద్ యూసఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సమైక్యాంధ్ర మూమెంట్ డాట్ కామ్’ పేరుతో తయారు చేసిన ఈ వెబైసైట్‌లో సమైక్యాంధ్ర ఉద్యయం ప్రారంభమైన నాటి నుండి సీమాంధ్ర జిల్లాలలో జరుగుతున్న వివరాలను ముఖ్యంగా పోటోలను ఇందులో పొందపరచడం జరిగిందన్నారు. ఏ ప్రాంతం నుంచి అయినా తెలుసుకునేందుకు వీలుగా దీనికి విజయవాడ వైబ్‌సైట్‌ను తయారు చేయడానికి 45 రోజులు పట్టిందని తెలిపారు.
సకాలంలో టెన్త్ సిలబస్ పూర్తి చేయాలి
కార్పొరేషన్ టీచర్లకు కమిషనర్ పండాదాస్ ఆదేశం
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 25: నగర పాలకసంస్థ పాఠశాలల్లో పదవ తరగతి విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వారి విద్యాబోధనకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ జిఎస్ పండాదాస్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కుందావారి కండ్రిక, నేతాజీ నగర్ లోని బివి సుబ్బారెడ్డి కార్పొరేషన్ స్కూల్ పనితీరుతోపాటు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుతోపాటు ఇప్పటి వరకూ జరగాల్సిన సబ్జెక్టు బోధనల పూర్తిపై పరిశీలన జరిపిన ఆయన స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసారు. సమైక్య సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు పదవ తరగతి బోధనలపై ప్రత్యేక చర్యలు తీసుకుని వారి వారి సబ్జెక్టుల బోధనలు సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌లో విద్యాభ్యాసం చేసే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఉత్తీర్ణతకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. అలాగే ప్రస్తుతం జరగాల్సిన త్రైమాసిక పరీక్షల నిర్వహణకు కూడా ఆవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు, వారి ప్రతిభను పరిశీలించిన కమిషనర్ సబ్జెక్టులలో వెనకబడి ఉన్న విద్యార్థులను కూడా మెరుగైన విద్యాబోధన చేయాలన్నారు. గత సంవత్సరం ఉత్తీర్ణత కన్నా ఈ విద్యాసంవత్సరంలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించేలా కృషి చేయాలని హితవుపలికారు. కార్యక్రమంలో కార్పొరేషన్ విద్యాశాఖ ఇన్‌చార్జ్ డాక్టర్ ఎ నూకరాజు, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి కె దుర్గాప్రసాద్, స్కూల్స్ సూపర్‌వైజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వేద పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు
పటమట, సెప్టెంబర్ 25: రోటరీ కృష్ణవేణి ఆధ్వర్యంలో బుధవారం దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఇంద్రకీలాద్రి వేద పాఠశాల బాలురకు సంస్కృతంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. రామయణం, మహాభారతం జనరల్ నాలెడ్జి అంశాలలో నిర్వహించిన పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 35 మంది వేద పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ కృష్ణవేణి అధ్యక్షులు చిలకపాటి రామ్‌చంద్ మాట్లాడుతూ రోటరీ యూత్ సర్వీసెస్‌లో భాగంగా నిర్వహించిన సంస్కృత క్విజ్ పోటీలలో బాలురు పురోహిత సాంప్రదాయ వస్తధ్రారణతో ఆకట్టుకోవడం జరిగిందన్నారు. ఈ క్విజ్ పోటీలలో అచ్యుతరామయ్య శర్మ బృందం 94 మార్కులతో మొదటి స్థానం, శ్రావణకుమార్ బృందం 85 మార్కులతో రెండవస్థానం, 68 మార్కులతో మూడవ స్థానంలో విజేతలుగా నిలిచారని తెలిపారు.
కొనసాగుతున్న లాయర్ల సమైక్య దీక్షలు
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు జ్యుడీషియల్ ఎంప్లారుూస్, న్యాయవాదుల గుమస్తాలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో సీమాంధ్రలో పెల్లుబికిన వ్యతిరేకతతో గత 56 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఉద్యమంలో భాగస్వామ్యం వహిస్తున్న బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించి రోజుకో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బార్ అసోసియేషన్ హాలు వద్ద ప్రారంభమైన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బుధవారం నాటి దీక్షలో న్యాయవాదులు లాం సత్యనారాయణ, వేల్పుల కోటయ్య, ఎడ్లూరి రత్నం, సిహెచ్ ఇమ్మానియేలు రాజు, పి రవికుమార్, పి మధు, పి శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్, ప్రధాన కార్యదర్శి లాం చిన ఇజ్రాయేలు, ఉపాధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యులు సంఘీభావం తెలియచేశారు. ఇదిలావుండగా మరోవైపు జ్యుడీషియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు ఉద్యోగులు, లాయర్ల సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం కోర్టుల వద్ద నుంచి పుష్పా హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల సిహెచ్ సత్యనారాయణ, వై సుబ్బారెడ్డి, గిరిధర్, అమర్‌నాధ్, బాలకృష్ణ, రాజేష్, రాజ్‌కుమార్, నవీన్ పాల్గొన్నారు.
నేటి నుండి అత్యవసర సేవలూ బంద్
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన నిరసిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎపి ఎన్‌జీవోలు చేపట్టిన సమైక్య ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర పుర పాలక, నగర పాలక సంస్థల ఇంజనీరింగ్ జెఏసి తలపెట్టిన మూడ రోజుల పాటు అత్యవసర సేవల బంద్ గురువారం ప్రారంభం కానున్నది. ముఖ్యంగా నగర పాలక సంస్థ లోని అన్ని ప్రాంతాల్లోను అత్యవసర సేవలైన మంచినీరు, డ్రైనేజీ పారుదల, వీధి దీపాల నిర్వహణ తదితర సేవలకు విఘాతం కలుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రజలకు సమాచారం ఇచ్చిన ఇంజనీరింగ్ జెఏసి నాయకులు ప్రజలు కూడా తమ సమైక్య ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. ఇంజనీరింగ్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొనేందుకు గాను నగర పాలక సంస్థ కమిషనర్‌కు మాస్ క్యాజువల్ లీవ్‌కు సంబంధించిన నోటీసులు కూడా అందజేయడం జరిగింది. 72 గంటలపాటు జరిగే అత్యవసర సేవల బంద్ కారణంగా నగర పరిధిలోని ప్రజలకు అందే సేవలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అవసరమైన ప్రత్యమ్నాయ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ జిఎస్ పండాదాస్ ప్రకటించారు. ఇంజనీరింగ్ ఉద్యోగులు మాస్ లీవ్ పెట్టినా ప్రజలకు అందించే తాగు నీటి సరఫరా జరుగుతుందని, ఎటువంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా ప్రజలకు సేవలలో విఘాతం, ఆటంకం కలిగితే 0866-2573223 ఫోన్ నెంబర్‌కు సమాచారం ఇస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర సాధనకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం
మైలవరం, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర సాధన కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని టిడిపి జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజా చైతన్య యాత్ర తొలిరోజైన బుధవారం మైలవరంలో పాదయాత్ర అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉమా మాట్లాడుతూ విభజన ప్రకటనకు వ్యతిరేకంగా తాము స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పిస్తే ఇంత వరకూ స్పీకర్ తమను పిలవకుండా, అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేస్తే ఢిల్లీ పీఠం కదిలి విభజన ప్రక్రియ ఆగుతుందని తెలిసినా వారు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన జరగదని లగడపాటి రాజగోపాల్ ఎన్నో కబుర్లు చెప్పాడని, తన వద్ద బ్రహ్మాస్త్రం ఉందని నమ్మబలికి ఆయనకు ల్యాంకో సంస్థకు రిజర్వ్ బ్యాంకు ద్వారా 7వేల 500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించగానే కేంద్రం వద్ద హీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, సీమాంధ్రలో జగన్‌తోనూ పొత్తుపెట్టుకుని తిరిగి అధికారంలోకి రావటానికి సోనియాగాంధీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 56రోజులుగా సీమాంధ్రలో ఆందోళన చేస్తుంటే కనీసం ఒక్కరోజైనా పట్టించుకోని జాతీయ మీడియా లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ జైలునుండి విడుదలై ఊరేగుతుంటే ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. జగన్ అధికారం కోసం కాంగ్రెస్ సైతం వంతపాడుతోందని, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పాలన ఉండదని, లూటీలు, దహనాలు, దోపిడీలు, హత్యలు జరుగుతాయన్నారు. ఇందుకు ఉదాహరణ మొన్న మైలవరంలో జరిగిన సంఘటనేనన్నారు. వైకాపా నేతలు కొందరు అమాయకులైన కార్యకర్తలతో వచ్చి తమపై దాడికి దిగారంటే వారి అరాచకం, రౌడీ రాజకీయాలు ఏమేరకు ఉన్నాయో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర విడిపోతే సీమాంధ్ర ఎడారే అవుతోందని సమైక్యాంధ్రగా ఉంచేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమేనని ఆయన అన్నారు. విజయవాడు పార్లమెంటు కన్వీనర్ కేసినేని నాని మాట్లాడుతూ జగన్‌కు బెయిల్ కాంగ్రెస్ కుట్రలో భాగమేనన్నారు. రాష్ట్రం విడిపోతే అన్ని విధాలుగా నష్టపోయేది సీమాంధ్రే నన్నారు. దీనిని కాపాడుకునేందుకు అందరూ సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఇంకా పార్టీనేతలు విజయబాబు, బుల్లిబాబు, శోభన్‌బాబు, లీలాప్రసాద్ తదితరులు ప్రసంగించారు. సర్పంచ్ నందేటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ షేక్ సహానాబేగం, కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మైలవరం వీధులలో సమక్యాంధ్రకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
అట్టహాసంగా ప్రారంభమైన ఉమ ప్రజాచైతన్య యాత్ర
మైలవరం, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తలపెట్టిన ప్రజాచైతన్య యాత్ర బుధవారం మైలవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక పార్టీ కార్యాలయం నుండి వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబునగర్‌కు చేరుకుని అక్కడినుండి పాదయాత్రగా మైలవరంలోని దాదాపు పది వార్డులలో పాదయాత్ర ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. ఈపర్యటన సందర్భంగా ఆయా వార్డులలో ఆయన మహిళలను పలుకరిస్తూ సమస్యలను గురించి అడుగుతూ ముందుకు సాగారు. కనకతప్పెట్లు, కార్యకర్తల జెండాలతో పాదయాత్ర ఆసాంతం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. మైలవరంలోని ఆదాంపురం, ముస్లిం బజారు, నూజివీడురోడ్ గుండా పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్దకు చేరుకుని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడినుండి రామాలయం వీధి, వడ్డెర బజారు, తారకరామానగర్ తదితర ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించిన అనంతరం బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని అక్కడ బహిరంగసభ నిర్వహించారు. పార్టీ నేతలు కేసినేని నాని, బుద్దా వెంకన్న, విజయబాబు, బుల్లిబాబు, లీలాప్రసాద్, శోభన్‌బాబు, అంజిరెడ్డి, పీతా శ్రీనివాసరాజు, జంపాల శీతారామయ్య, వేణుగోపాల్‌రెడ్డి, ఉయ్యూరు నరశింహారావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
సీమాంధ్రను ఈస్టిండియాకు అమ్మి హైదరాబాదు నిర్మించారు:వైవిబి
ఉయ్యూరు, సెప్టెంబరు 25: నాడు నైజాం నవాబు ఏలుబడిలో ఉన్న సర్కారు, సీడెడ్ జిల్లాలను ఈస్టిండియా కంపెనీకి అమ్మి ఆ సొమ్ముతో నైజాం పూర్వీకులు హైదరాబాదు నగరాన్ని నిర్మించారనే విషయం తెలంగాణవాదులు గ్రహించాలని శాసనమండలి మాజీ సభ్యుడు వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా 52రోజులుగా ఇక్కడ జరుగుతున్న రిలే దీక్షా శిబిరంలో బుధవారం మండలంలోని చినఓగిరాల రైతులు పాల్గొన్నారు. అంతకుముందు నాగళ్లు, కొడవళ్లు, పలుగులు, పారలు చేతపట్టి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా వచ్చిన రైతులు స్థానిక సెంటరులోని దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్షలో ఉన్న రైతులను రాజేంద్ర కలిసి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించారు. హైదరాబాదు నగర నిర్మాణంలో సీమాంధ్రుల శ్రమ దాగి ఉందన్నారు. తెలంగాణ విముక్తికి సాగిన సాయుధ పోరాటంలో కూడా జిల్లాలోని కాటూరు, యలమర్రు నుంచి చాలామంది పాల్గొన్నారన్నారు. నాడు, నేడు తెలంగాణ అభివృద్ధిలో సీమాంధ్రుల తోడ్పాటు, శ్రమ దాగి ఉన్నాయని వైవిబి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. కాగా రైతులు దీక్షా శిబిరం చుట్టూ అరటి బోదెలు కట్టి, నాగళ్లు పెట్టి దీక్షకు దిగడం ఆకర్షించింది. ఈ కార్యక్రమాలను జెఎసి నాయకులు శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, పర్యవేక్షించారు.
కంచికచర్లలో భారీ ప్రదర్శన
కంచికచర్ల, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బుధవారం కంచికచర్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్‌టిసి, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జెఎసి నేతలు ఎవి శివారెడ్డి, బిక్షాలు, విక్టర్ నగేష్, శేషం వెంకటేశ్వరరావు, రాయన్న, గంగిరెడ్డి రంగారావు, కందుల వెంకట్రావు, అబ్బూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిరసనల హోరు
నందిగామ, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్‌టిసి జెఎసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జాతీయ రహదారిపై అంబారుపేట బైపాస్ రోడ్డు వద్ద అర్ధనగ్నంగా బైఠాయించి కొద్దిసేపు ఆందోళన చేశారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను అడ్డుకొని నిరసన తెలియజేశారు. తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జెఎసి నేతలు శ్యాంబాబు, జి వెంకటరత్నం, ఏసుదాసు, కొత్తా శ్రీనివాసరావు, మాధవరావు, ఆనంద్, గంగాధర్, వెంకట్రావు, వీరపాల్, ఉపాధ్యాయ సంఘాల నేతలు శేఖర్‌బాబు, సురేష్, శ్రీ్ధర్, ఆర్‌టిసి ఉద్యోగులు కరీముల్లా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎడ్లబండి తోలుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కనె్నకంటి జీవరత్నం, ఇ రంగారావు, న్యాయవాదులు లక్ష్మీనర్శింహరావు, కమలాకరరావు, సురేష్, సుబ్రమణ్యం, అద్దంకి మణిబాబు తదితరుల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ వద్ద రోడ్డుపై షటిల్ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
ఉద్ధృతమైన సమైక్య ఉద్యమం
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 25: రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధాలు జరుగుతాయంటూ, నీటి కోసం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిపేలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన నీటి యుద్ధ ఘట్టం విశేషంగా ఆకర్షించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసిల ఆధ్వర్యంలో రాష్ట్రం విడిపోతే నీటి కోసం కర్రలతో కొట్టుకోవడం, కత్తులతో పొడుచుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయంటూ నీటి బిందెను తాడుతో ఇరు ప్రాంతాల వారు మాకంటే మాకు అని లాగుతూ దాని కోసం కర్రలతో కొట్టుకుని, కత్తులతో పొడుచుకుంటున్నట్లు సన్నివేశాన్ని ప్రదర్శించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్‌తో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జెఎసి నేతల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, రిక్షా కార్మికులు రిక్షాలు తొక్కి నిరసన తెలియజేశారు. ఆర్‌టిసి కార్మికులు ఉదయం పట్టణం నుండి తరలివెళుతున్న ప్రైవేటు వాహనాలను కొద్దిసేపు ఆపి వాటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలో జగ్గయ్యపేట క్రికెట్ అసోసియేషన్ నేతలు మాజీ కౌన్సిలర్ విద్యాసాగర్, శ్రీనివాసరెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, ఎ నాగరాజు తదితరులు కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, వైఎస్‌ఆర్ సిపి నేత నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు.
రెండవ రోజుకు చేరిన ఆమరణ దీక్ష
సమైక్యాంధ్రకు మద్దతుగా బిసి సంఘం పట్టణ అధ్యక్షుడు తూమాటి కృష్ణ, వడేగర్ విజయకుమార్ చేపట్టిన ఆమరణ దీక్ష రెండవ రోజుకు చేరింది. బుధవారం దీక్షా శిబిరం వద్ద వారిని పలువురు నేతలు ప్రముఖులు కలిసి మద్దతు ప్రకటించారు. సమైక్య రాష్ట్రం ప్రకటించే వరకూ తాము దీక్ష విరమించేది లేదంటూ కృష్ణ, విజయకుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ దీక్షలు
పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ, ఉపాధ్యాయ, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జరుగుతున్న రిలే దీక్షా శిబిరం 35వ రోజుకు చేరుకుంది. బుధవారం దీక్షా శిబిరంలో విశ్వతేజ టుటోరియల్స్ కరస్పాండెంట్ బూర ప్రసాద్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కూర్చోగా ఈ దీక్షా శిబిరాన్ని జెఎసి నాయకులు వాసిరెడ్డి బెనర్జీ, ముండ్లపాటి ప్రభాకరరావు, దివ్వెల మోహనరావు, నరెడ్ల కిషోర్, కందిమళ్ల రామకోటేశ్వరరావు, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, నక్కా బాబూరావు, ముక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సాయంత్రం జెఎసి ఆధ్వర్యంలోనే తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే అంధకారం అవుతుందని అన్నారు. ముందుగా ఈ ర్యాలీని జెఎసి నాయకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు ఊట్ల నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
వత్సవాయిలో.....
వత్సవాయి: సమైక్యాంధ్రకు మద్దతుగా మండల కేంద్రంలో జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం 29వ రోజుకు చేరింది. బుధవారం దీక్షా శిబిరంలో వెంకటేశ్వర స్కూల్ విద్యార్థులు కూర్చున్నారు. వీరికి జెఎసి నేతలు పలువురు సంఘీభావం తెలిపారు.
కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
నూజివీడు, సెప్టెంబర్ 25: నూజివీడులో సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంటోంది. స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమైక్యాంద్ర సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విభజన జరిగితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జెఎసీ నాయకులు చంద్రశేఖర్, అలెగ్జాండర్, ఫరూక్, పగడాల సత్యనారాయణ, పివి కుమార్, సాంబశివరావు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు బుధవారం భారీ స్థాయిలో ఆందోళన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు పికె ప్రసాద్, నరసింహారావు, చంద్రశేఖర్, బాబు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధించేవరకు పోరాటం చేస్తామని వీరు స్పష్టం చేశారు. స్థానిక న్యాయస్థానముల ప్రాంగణం వద్ద న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని నూజివీడు బార్ అసోసియేషన్ అద్యక్షుడు ఎన్‌ఎ ఖాన్, కార్యదర్శి మురళీకృష్ణ ప్రారంభించారు. రిలే నిరాహారదీక్షలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. పురపాలక సంఘం ఉద్యోగులు కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులు రాష్ట్ర విభజనవలన వచ్చే సమస్యలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరిస్తూ చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు.
విభజన ఇప్పుడు అవసరమా...?
పలు సమస్యలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు న్యాయవాదులు, సంఘసేవకులు ప్రశ్నించారు. న్యాయవాద జెఎసీ ఆధ్వర్యంలో స్థానిక ఆమర్ భవన్‌లో బుధవారం రాష్ట్ర విభజనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. జెఎసీ కన్వీనర్ యు నాగప్రసాద్, న్యాయవాదులు డెలారాం, జెడి గాంధీ, సత్యప్రకాష్, నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాన్, కార్యదర్శి మురళీకృష్ణ, కృష్ణా విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి వెంకట బసవేశ్వరరావుతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదు
గుడివాడ, సెప్టెంబర్ 25: స్వార్థ తెలంగాణ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, సమైక్యాంధ్ర ఉద్యమ నేత అశోక్‌బాబుపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సమైక్యాంధ్ర జెఎసి జిల్లా సంయుక్త కార్యదర్శి మండలి హనుమంతరావు హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అశోక్‌బాబు నాలుక కోస్తామంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో బుధవారం అర్ధనగ్నంగా ఎండలో ఒంటికాలిపై గెంతుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో మండలి మాట్లాడుతూ గత 57రోజులుగా 13జిల్లాల్లో కోట్లాది మంది తెలుగు ప్రజలు అశోక్‌బాబు నాయకత్వంలో ఉద్యమిస్తున్నారన్నారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు స్వార్థ తెలంగాణ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. దీన్ని సమర్ధంగా ఎదుర్కొంటామని మండలి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఫరీద్ బాషా, కార్యదర్శి జి రాజేంద్రప్రసాద్, జెఎసి నేతలు పాల్గొన్నారు. అశోక్‌బాబు నాలుక చీలుస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన తెలంగాణ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ శ్రీ కోదండ రామాలయం ఎదుట ఉపాధ్యాయులు పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.
రూరల్ ఉపాధ్యాయుల వంటావార్పు
గుడివాడ రూరల్ మండల ఉపాధ్యాయులు స్థానిక ఎండివో కార్యాలయం ఎదుట బుధవారం వంటావార్పు నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ జెఎసి చైర్మన్ దీవెనరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్నిరంగాలూ తీవ్రంగా నష్టపోతాయన్నారు. జెఎసి నేతలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడ పట్టణంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో జరుగుతున్న దీక్షలు బుధవారానికి 51వ రోజుకు చేరాయి. శిబిరాన్ని రవాణా శాఖ జెఎసి జోనల్ కన్వీనర్ డి శ్రీనివాస్ ప్రారంభించారు. దీక్షలో బీసి సంక్షేమ సంఘ, ఉద్యోగ సంఘ నేతలు కూర్చున్నారు. ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సెంటర్లో జరుగుతున్న దీక్షలు 23వ రోజుకు చేరాయి. దీక్షలను ఉపాధ్యాయ సంఘ నేత డి చంద్రశేఖర్ ప్రారంభించారు. దీక్షలో ఉపాధ్యాయులు బి భాగ్యలక్ష్మి, సౌజన్య, డి జ్యోత్స్న, కె లక్ష్మి, నాగలక్ష్మిలు కూర్చున్నారు. దీక్షలకు జెఎసి చైర్మన్ బి గోవర్ధనరావు, కన్వీనర్ ఎఎస్‌వి ప్రసాద్ నేతలు కె చంద్రశేఖర్, గుండు శ్రీను, పి వేణుగోపాల్, టివి సత్యనారాయణలు మద్దతు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న దీక్షలు 42వ రోజుకు చేరాయి. దీక్షలను జెఎసి నేత జి రాజశేఖర్ ప్రారంభించారు. దీక్షలో ఉద్యోగులు సిహెచ్ రవిబాబు, ఎన్ ఉమాశంకర్, ప్రేమ్‌చంద్, రాములు కూర్చున్నారు.
‘అత్తారింటి’ తీగలాగిన పోలీసులు
పైరసీ సీడీల గుట్టురట్టు
* ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్
* ఐదుగురి అరెస్టు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 25: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం పైరసీ సీడీల గుట్టును పోలీసులు రట్టు చేశారు. 55కోట్ల రూపాయల భారీ వ్యయంతో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన ఈ చిత్రం పైరసీ సీడీలు సినిమా విడుదలకు ముందుగానే జిల్లాలో విడుదలై కలకలం రేపాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంకు చేరువలో ఉన్న పెడనలో రెండు రోజుల క్రితం పైరసీ సీడీల అమ్మకాలు జరుగుతున్నట్లు మీడియాలో తీవ్రమైన ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు చీకటి అరుణ్‌కుమార్, కట్టా రవి, వూటుకూరి సుధీర్‌కుమార్, వీరంకి సురేష్, కొల్లిపర అనిల్‌కుమార్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎడిటింగ్ ల్యాబ్ అసిస్టెంట్ అరుణ్‌కుమార్ అని ఎస్పీ ప్రభాకరరావు విలేఖరులకు వెల్లడించారు. వినాయక చవితి పండుగకు రెండురోజుల ముందు అరుణ్‌కుమార్ ల్యాబ్ ఎడిటింగ్ రూమ్‌లో చిత్రం సీడీని మరో సీడీలోకి కాపీ చేసి మార్నింగ్ వాకింగ్ స్నేహితుడైన కట్టా రవికి ఇచ్చాడు. యూసఫ్‌గూడకు చెందిన రవి ఎపిఎస్పీ కానిస్టేబుల్. ఈ సీడీ చూసిన రవి పెడనలో ఉంటున్న తన స్నేహితుడు సుధీర్‌కుమార్‌కు స్పీడ్ పోస్టు ద్వారా పంపించాడు. సుధీర్‌కుమార్ చూసిన తర్వాత తన మిత్రుడైన వీడియోగ్రాఫర్ వీరంకి సురేష్‌కు ఇచ్చాడు. తన దగ్గర అత్తారింటికి దారేది సినిమా సీడీ ఉందని సురేష్ తన మిత్రుడు, దేవి మొబైల్స్ యజమాని కొల్లిపర అనిల్‌కుమార్‌కు చెప్పాడు. సురేష్ మాటలు నమ్మని అనిల్ సీడీ చూపిస్తేనే నమ్ముతానని అన్నాడు. దీంతో సురేష్ సీడీని అనిల్‌కు ఇచ్చాడు. ఇద్దరూ చూస్తుండగానే అనిల్ సీడీని తన కంప్యూటర్‌లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత అనిల్ ఆ డేటాను మెమరీ కార్డులు, సీడీలు చేసి విక్రయానికి పాల్పడ్డాడు. అలాఅలా అది ఇంటర్నెట్‌లోకి వచ్చేసింది. దీంతో స్పందించిన చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును ఛేదించి చిత్ర పరిశ్రమ ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఇంటర్నెట్‌లో అప్‌లోడైన విషయమై సైబర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలావుంటే తాను ఎలాంటి దురుద్దేశంతోనో సీడీలను లీక్ చేయలేదని ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్ అన్నాడు. స్నేహితుడు రవికి సరదాగా ఇచ్చానేతప్ప పైరసీ సీడీల వ్యాపారం చేయడానికి కాదన్నాడు. రవి కూడా తనలాగే స్నేహితుడికి ఇవ్వటంతో అలా మార్కెట్‌లోకి వచ్చిందన్నాడు. తెలిసీతెలియక చేసిన తన తప్పును మన్నించాలని చిత్ర నిర్మాతకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపాడు.
ఇంటి దొంగల పట్లఅప్రమత్తంగా ఉండాలి
* ఎస్పీ ప్రభాకరరావు సూచన
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 25: ఇంటి దొంగల పట్ల చిత్ర పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రభాకరరావు అన్నారు. ఎడిటింగ్ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమారే చిత్రం విడుదలకు ముందు సీడీలను లీక్ చేయటం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇంటి దొంగల పట్ల పరిశ్రమ