వెంకటగిరి, సెప్టెంబర్ 25: వెంకటగిరివాసుల ఇలవేల్పు గ్రామశక్తి పోలేరమ్మ జాతర బుధవారం ప్రారంభం కావడంలో పట్టణం జనంతో కిటకిటలాంది. పట్టణ నడిబొడ్డునున్న పోలేరమ్మ దేవస్ధానం వద్ద బయట ప్రాంతాలను నుంచి భక్తులు బుధవారం నుంచి మొక్కులు తీర్చుకోవడం ప్రారంభించారు. బుధవారం ఉదయం నుంచి పోలేరమ్మ అమ్మవారి ఇల్లుగా భావించిన కుమ్మరివీధిలోని కుమ్మరి ఇంటి పూజలు చేసి సాంప్రదాయబద్దంగా అమ్మవారి ప్రతిమను భక్తుల దర్శనార్ధం సాయంత్రం ఆరుగంటలకల్లా తయారు చేశారు. మొదటి సారిగా అమ్మవారిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆర్‌డివో మధుసూదన్‌రావు, తహశీల్దార్ కృష్ణమూర్తి, దేవాదాయశాఖ అధికారులు, చైర్మన్ పులి ప్రసాద్‌రెడ్డి , కమిటీ సభ్యులు పూలమాలలు వేసి దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున కుమ్మరింట అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 11 గంటల వరకు కుమ్మరింట అమ్మవారిని ఉంచి ఆ తరువాత అక్కడ నుంచి అత్తవారిల్లుగా భావించే జీనిగలవారివీదికి అమ్మవారిని నిరాడంబరంగా తరలిస్తారు. తరువాత సాంప్రదాయబద్దంగా కాంపాళెం నుంచి గాలిగంగల సాంగ్య రావడంతో అత్తవారింట ఉన్న పోలేరమ్మ ప్రతిమకు కళ్లు, దిష్టిచుక్కను పెట్టి పూర్తి స్థాయిలో అమ్మవారి అలంకరించి చప్పరం (రథం) పై ఉంచి వేలాది మంది భక్తుల నడుమ, విద్యుత్ దీప కాంతులతో, దివిటీల వెలుగుల మధ్య యువకుల కేరింతలతో, బాణాసంచా మధ్య అత్తవారింటి నుంచి పట్టణ నడిబొడ్డునున్న అమ్మవారి దేవస్థానం వద్దకు తెల్లవారి మూడు గంటలకు భక్తుల దర్శనార్ధం తీసుకొస్తారు.
భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి బొమ్మ
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన త్రిముఖ అమ్మవారి బొమ్మ భక్తులను అకట్టుంది. పోలేరమ్మ దేవస్థానం ముఖ ద్వారా ఎదురు గా ఏర్పాటు చేసిన ఈ బొమ్మ విగ్రహం కళ్లు కదులుతూ, స్వాసను వదులుతూ, పీలుస్తూ ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుంటున్నారు.ఇంటింటా చిన్నారుల సందడి: గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో భాగంగా పట్టణంలో చిన్నారులు మడి బిక్షాటన చేయడం ఇక్కడ సాంప్రదాయం. దీంతో చిన్నారులు చేతిల్లో ఇక చిన్న గినె్న, గ్లాసు తీసుకొన్ని అందులో వేప ఆకులు వేసుకొన్ని ప్రతి ఇంటికి వెళ్ళి పోలేరమ్మ బిక్షం పెట్టండి పోతురాజుకు టెంకాయి కొట్టండి అది పగలక పోతే మానెత్తిన కొట్టండి అంటూ చిన్నారులు బిక్షాట చేస్తారు. అలా చేయడం వల్ల అమ్మవారు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో కాపాడుతుందని ఇక్కడివారి నమ్మకం. అందుకే జాతర మొదటి రోజున చిన్నారులు మడిబిక్షాటన చేస్తారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో మరో సమిధ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఏపిఎస్ ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు గుండెపోటుతో మరణించాడు. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామంతో సమైక్యాంధ్ర ఆందోళనకారుల్లో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. వెంటనే నిరసన కార్యక్రమాల ఉద్ధృతి పెంచి నగరంలోని రోడ్లన్నీ స్తంభింపజేశారు. ఈ నెల 26న నెల్లూరుజిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసి రిలే దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. యూటిఎఫ్, ఉపాధ్యాయ జేఏసిల ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వేదాయపాళెం కూడలి వద్ద ముదిరాజ్ సంఘం నేతృత్వంలో రిలే దీక్షలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం మండల కేంద్రమైన పొదలకూరులో కార్పెంటర్ల ర్యాలీ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం చిరమన గ్రామంలో వంటావార్పు చేపట్టారు. ఏఎస్‌పేట శ్రీహజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో వికలాంగులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ప్రార్ధనలు నిర్వహించారు. కాగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ అశువులు బాసిన ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు ఆత్మకు శాంతి కలగాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉద్యోగ జేఏసి నేతృత్వంలో సంతాపసభ నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జేఏసి గౌరవాధ్యక్షులు ఆచార్య ఎం శ్రీనివాసులురెడ్డి, కన్వీనర్ కె వేణుగోపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సుజయ్‌కుమార్ మాట్లాడుతూ సోమశేఖర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆశయాలు సాధించేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇంకెందరు చనిపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి సమైక్యాంధ్రకు తిరిగి కట్టుబడి ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి మరణ పరిణామాలతో ఆందోళనకారుల్లో తీవ్ర మనస్థాపం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో యూనివర్శిటీ జేఏసి మహిళా ప్రతినిధులు ఆర్ మధుమతి, సునీత, హనుమారెడ్డి, అందె ప్రసాద్, హుస్సేనయ్య, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, విజయకుమార్, రమేష్‌రెడ్డి, విజయ, సుందరరావు, రాజారాం, శ్రీలత, హరిత, సుబ్బారెడ్డి, గాయత్రి, విమల, తదితరులు పాల్గొన్నారు. బిజెపి నేతలు మిడతల రమేష్, ఆకు విజయలక్ష్మి, కోటేశ్వరరావులు కూడా మరో ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు.
పిల్లలకు పౌష్టిహారం అందించండి
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 25: గర్భవతులు గర్భం దాల్చిన సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, అలా తీసుకున్న తల్లులు ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ మెడికల్ కళాశాలలో ఆయూష్మాన్‌భవ అను పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ నారాయణ ఆసుపత్రిలో 12 నెలలలోపు పిల్లల కోసం ఆయూష్మాన్‌భవ పథకం ప్రవేశపెట్టడం సంతోషించ దగ్గవిషయమన్నారు. ఖర్చు గోరంత, సంరక్షణ కొండంత అనే రీతిలో నారాయణ ఆసుపత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గవిషయమన్నారు. ఈ పథకానికి 234 రూపాయలు చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు నిర్వహిస్తారన్నారు. ఈ మిలీనియం ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పౌష్టికాహారానికి సంబంధించిన పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. గర్భంలో ఉన్న బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితం, విద్య అందించగలమన్న ఆత్మ విశ్వాసం వచ్చిననాడే పిల్లలకు జన్మనివ్వాలని తల్లులకు పిలుపునిచ్చారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల పౌషికాహారం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రపంచంలో ఎయిడ్స్ షుగర్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయూష్మాన్‌భవ పథకంలోకి వచ్చిన పిల్లలకు ఒక సంవత్సరం పాటు పలు పరీక్షలు, చికిత్సలను నారాయణ హాస్పటల్ ఉచితంగా నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ వీరనాగిరెడ్డి, ఐసిడిసి ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, నారాయణ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయకుమార్, సిఇవో పట్ట్భారామిరెడ్డి, ఎజిఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు మందు జరిగిన కార్యక్రమంలో పథకాన్ని స్వీకరించిన పిల్లల తల్లిదండ్రులకు కార్డులు అందజేశారు.
2014 జూన్ నాటికి
పెన్నా బ్యారేజీ పనులు పూర్తి
కోవూరు, సెప్టెంబర్ 25: నెల్లూరు పెన్నా బ్యారేజి నిర్మాణ పనులను 2014జూన్ నాటికి పూర్తిచేస్తామని ఇంజనీర్ ఇన్‌ఛీఫ్ మురళీధర్ వెల్లడించారు. బుధవారం నెల్లూరు పెన్నా బ్యారేజి నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు పెన్నా బ్యారేజి నిర్మాణ పనులును పరిశీలించామన్నారు. బ్యారేజి నిర్మాణ పనులకు అదనంగా 29 కోట్ల రూపాయలు మంజూరు చేశారా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిర్మాణ పనులకు 29 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. తొలుత ఆయన నెల్లూరు పెన్నా బ్యారేజి పనులకు సంబంధించి నిర్మాణ పనులపై జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజైన్ చేసినట్లు పనులు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. బ్యారేజ్ బేస్‌లైన్ నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టారా, నిర్మాణానికి వాడాల్సిన మెటల్, కాంక్రీట్ నాణ్యతాప్రమాణాలను పాటించారా లేదా అని, ప్రతి జాయింట్ దగ్గ రబ్బర్‌సీల్ పెట్టారాలేదా అని, ఇంకాఎన్ని పియర్స్, ఫైల్స్ బ్యాలెన్స్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
కుమారులకు అధికారం కట్టబెట్టేందుకు
దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు
నెల్లూరు, సెప్టెంబర్ 25: ఇద్దరు తల్లుల స్వార్థం కోసం కుమారులకు అధికారం కట్టబెట్టేందుకు దేశాన్ని, రాష్ట్రాష్టాన్ని సర్వనాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విమర్శించారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సోనియా, వైఎస్ విజయమ్మలపై తీవ్రస్థాయిలో రవిచంద్ర ధ్వజమెత్తారు. సమైక్యంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య విభజన పేరుతో చిచ్చు పెట్టి, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద అవినీతి కుంభకోణానికి కేంద్రబిందువైన జగన్‌మోహన్‌రెడ్డికు బెయిల్ రావడం అందర్ని ఆశ్చర్యపరిచిందన్నారు.
ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓట్లు వేసే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు కాంగ్రెస్‌పార్టీతో పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబునాయుడుపై కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాడుతున్న భాష బాగోలేదని , ఆయన ఇప్పటికైనా భాష మార్చుకోకుంటే తగినరీతిలో బుద్దిచెప్తామని హెచ్చరించారు. అలాగే 2014 ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని చెట్టుకు కట్టేసి కొడతారో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, అన్నం దయాకర్‌గౌడ్, నూనె మల్లికార్జుయాదవ్, బద్దెపూడి రవీంద్ర, కాకర్ల తిరుమలనాయుడు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర గ్రామీణ చైతన్య రథం ప్రారంభం
నాయుడుపేట, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలలోనే కాక గ్రామీణ ప్రాంతాల ప్రజలు భాగ స్వాములు కావడం లేదని గ్రహించిన ఐకాస, గ్రామీణ ప్రాంతాల ప్రజలలో సమైక్యాంధ్రపై చైతన్యం కల్పించాలన్న ఉద్దేశంతో బుధవారం సమైక్యాంధ్ర గ్రామీణ చైతన్య రథాన్ని ఐకాస చైర్మన్ చేవూరి చెంగయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం ద్వారా మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలకు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించి వారిలో కూడా ఉద్యమ కాంక్షను రగిలించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాస సభ్యులు ఎఎం అజయ్ కుమార్, దాసరి శ్రీనివాసులు, గోపాల్, గోవిందయ్య, గురవయ్య, గడదాసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బుచ్చిలో ....
బుచ్చిరెడ్డిపాళెం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో భాగంగా బుచ్చి పట్టణంలో కూడా బంద్ విజయవంతమైంది. మంగళవారం ఈ బంద్‌లో భాగంగా పట్టణంలోని దుకాణాలు, బ్యాంక్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు మూతపడ్డాయి. అక్కడక్కడా తెరచి ఉన్న దుకాణాల్ని జేఏసి నాయకులు వెళ్లి మూయించి వేశారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు, మెడికల్, హెల్త్, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ కూడలిలో వంటావార్పు నిర్వహించారు. వివిధ వేషధారణల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
నాయుడుపేట, సెప్టెంబర్ 25: అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉన్న రాష్ట్రాన్ని విడదీయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని నాయుడుపేట సమైక్యాంధ్ర ఐకాస జెఎసి చైర్మన్ చేవూరి చెంగయ్య పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతిని, ప్రజలను విడదీయాలని కొందరు స్వార్థ రాజకీయ నాయకులు పన్నిన కుట్ర ఫలితంగా నేడు సీమాంధ్రలోని ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు శాంతి యుతంగా గత 58 రోజులుగా చేపడుతున్న ఉద్యమాన్ని సైతం కేంద్రం పట్టించుకోక పోవడం దారుణమాన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు బస్సు యాత్ర
మనుబోలు సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్దేశాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లాస్థాయి ఉపాధ్యాయ నాయకులు కళాబృందాలతో కలసి గురువారం స్థానిక హైస్కూల్‌లో మండలస్థాయి సమావేశం జరపనున్నట్లు స్థానిక తహశీల్దార్ వెంకట నారాయణమ్మ తెలిపారు. బుధవారం యాత్రకు సంబంధించిన ఏర్పాట్లును గురించి స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జాయంట్ యాక్షన్ కమిటి నాయకులు, ఉపాధ్యాయ నాయకులు, రాజకీయ నాయకులతో కలిపి మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎంపిడిఓ కె హేమలత మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. గురువారం జరిగే బస్సు యాత్రకు మండలంలోని రైతులు మహిళలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కొరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక ఎంఇఓ సూర్యనారాయణరావు, ఉపాధ్యాయ జెఎసి నాయకులు కిషోర్, రఫి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎం సాయిమోహన్‌రెడ్డి, కలికి వేణుగోపాల్ రేడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటడం మహోన్నత కార్యక్రమం
ముత్తుకూరు, సెప్టెంబర్ 25: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించి చెట్లగా ఎదిగేలా కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ అధికారి వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం దొరువులపాళెం పంచాయతీ తూర్పు నాగలదొరువుప్రాంతంలో గ్రామీణ పర్యావరణం, వ్యవసాయాభివృద్ధి సంస్థ అధ్యక్షులు మురళి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు పరిసర ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో కాలుష్యం పెరుగుతుందన్నారు. కాలుష్య నియంత్రణ కోసం పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడం అవసరమన్నారు. రీడ్స్ అధ్యక్షులు ధర్మయ్య మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక గ్రామాల్లో మొక్కలు నాటడంతో సహా పర్యావరణంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సుమారు ఐదువందల మొక్కలకుపైగానే నాటారు. ఉపసర్పంచు ధారా మనోహర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
సమైక్యపోరులో మాదే అంకితభావం
* సీతారామపురం జేఏసి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనా కార్యక్రమాల్లో తమదే అంకితభావమంటూ జిల్లాలోని సీతారామపురం జేఏసి నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. బుధవారం పత్రికల్లో ప్రచురితమైన అరగుండు తెచ్చిన తంట ! వార్తాకథనంపై సదరు జేఏసి నాయకులు స్పందించారు. ఈ సంఘటన జరిగి 15రోజులు అవుతోందని ఇప్పుడు వారి కుటుంబంలో ఎటువంటి కలతలులేవన్నారు. ఆ ఉపాధ్యాయుడి కుటుంబం అన్యోన్యంగా ఉండేలా చూసే బాధ్యత తమది అంటూ వెల్లడించారు. ఇటీవల ఉదయగిరి గర్జనలో కూడా తమ మండల జేఏసినే కీలక భూమిక వహించిందని తెలిపారు.