Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హోరెత్తుతున్న సమైక్య పోరు

$
0
0

ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, సెప్టెంబర్ 25: వంటావార్పులు, ర్యాలీలు, మానవహారాలు, జాతీయ రహదారుల దిగ్బంధం, కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం, కొవ్వొత్తుల ప్రదర్శనలతో జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రతిరోజు సమైక్యవాదులు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మండిపడుతున్నారు. ప్రధానంగా ఆర్‌టిసి కార్మికుల సమ్మెతో ప్రయాణికులను ప్రైవేటు వాహనాల యజమానులు నిలువునా దోచుకుంటున్నారు. గతంలో వాహనాలకు కిస్తీలు చెల్లించలేక వడ్డీ వ్యాపారులు వాహనదారులను బెదిరించి వాహనాలను తీసుకెళ్లేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుత నెలతోపాటు, వచ్చేనెల కిస్తీలను కూడా చెల్లిస్తూ ప్రైవేటు వాహన యజమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదిలాఉండగా బుధవారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెవెన్యూ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా పంచాయతీరాజ్ ఉద్యోగులు స్థానిక చర్చి సెంటరు వద్ద రోడ్లు ఊడ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. హౌసింగ్‌బోర్డు వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది చర్చి సెంటరు వద్ద కెసిఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కెసిఆర్‌కు డబ్బుపిచ్చి పట్టిందంటూ కెసిఆర్ వేషధారికి డబ్బులు దండ వేసి నిరసన తెలిపారు. ఒంగోలు నగర కార్పొరేషన్ సిబ్బంది వాటర్ ట్యాంకులతో నిరసన తెలిపారు. వికలాంగులు ఒంగోలు నుండి శ్రీకాకుళం వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని జంక్షన్ వద్ద బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. కాగా ప్రైవేటు బస్సుల బంద్ కార్యక్రమం కూడా జరిగింది. హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహన యజమానుల సమ్మెతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు ఉంటే పలువురు కార్లల్లో దూరప్రయాణాలకు వెళ్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రభుత్వ పాలన స్తంభించిపోవటంతో అన్నివర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంమీద సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతోంది.

గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు
నెలకు తగ్గిన 20 కోట్ల వ్యాపారం
బోణీలు కాక లబోదిబోమంటున్న బంగారం వ్యాపారులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమ సెగ చివరకు మద్యం వ్యాపారంపై కూడా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గడమే కాక వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 321 మద్యం షాపులు ఉండగా వాటి పరిధిలో నెలకు లక్షా 50 వేల కేసుల మద్యాన్ని విక్రయించాల్సి ఉంది. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమ ధాటికి ఆ విక్రయాలు ఒక లక్షా 35వేల కేసుల మద్యానికి పడిపోయింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 20 కోట్ల రూపాయల మేర పడిపోయింది. ప్రధానంగా సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయటమే కాకుండా, ఆర్‌టిసి బస్సులను కూడా నిలిపివేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి అత్యవసర పనుల నిమిత్తంగానే జిల్లాకేంద్రమైన ఒంగోలు, మండల కేంద్రాలకు వస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రభుత్వపరంగా లావాదేవీలు జరిగితే నగదు బదిలీ అవుతుంది. అదేవిధంగా భూముల క్రయవిక్రయాలు కూడా లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు కోట్ల రూపాయల్లో జీతాలు వస్తాయి. ఒకపక్క జీతాలు లేకపోవటం మరోపక్క ప్రభుత్వపరంగా వచ్చే కాంట్రాక్టు బిల్లులు నిలిచిపోయాయి. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరగడం లేదు. స్థూలంగా చెప్పాలంటే సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీని ప్రభావం అన్ని వ్యాపారాల పైనా పడింది. జిల్లాకేంద్రమైన ఒంగోలు, మిగిలిన ప్రాంతాల్లో కోట్ల రూపాయల్లో బంగారం వ్యాపారం జరిగేది. సమైక్యాంధ్ర బంద్‌తో బంగారం విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయనే చెప్పవచ్చు. ఇటీవల ఒక వ్యాపారిని ఆంధ్రభూమి ప్రతినిధి పలకరించగా సమైక్యాంధ్ర ఉద్యమంతో కనీసం బోణీలు లేవని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రభుత్వ సిబ్బందికి, ఆర్‌టిసి కార్మికులకు జీతాలు లేకపోవటంతో కొంతమంది సిబ్బంది తమవద్ద ఉన్న బంగారం అభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జీవనయానం సాగిస్తున్నారు. మొత్తంమీద సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రధానంగా మద్యం వ్యాపారంపై పడిందనే చెప్పవచ్చు.

‘విభజన జరిగితే వర్గీకరణ లేనట్లే’
మార్కాపురం, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన జరిగితే ఈ ప్రాంతమాదిగల మనోభావమైన వర్గీకరణ మరుగునపడే అవకాశం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల ఎంఆర్‌పిఎస్ మాజీ అధ్యక్షులు దండు వీరయ్యమాదిగ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాల్సి ఉంటుందని, అయితే తెలంగాణవాదులు ఎందుకు ఈ ఆశయాన్ని వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కృష్ణమాదిగ ఇరుప్రాంతాల్లో వర్గీకరణ కోసం ఉద్యమాలు చేసి విభజన సమయంలో తెలంగాణకు మద్దతు పలకడం ఎంతవరకు న్యాయమని, అందుకు నిరసనగా తాను తన పదవికి రాజీనామా చేశానని, అక్టోబర్ 1వతేదీన తిరుపతిలో సీమాంధ్ర మాదిగ సంఘం ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నామని, అనంతరం విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మందకృష్ణమాదిగ గుంటూరులో ఏర్పాటు చేస్తున్న సభ అంబేద్కర్ ఆశయసభ కాదని, అవమానకరసభ అని వీరయ్యమాదిగ ఎద్దేవా చేశారు. ఎక్కడైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది రాజకీయనాయకులకే తప్పా పీడితవర్గాలకు ఎక్కడా న్యాయం జరగలేదని, సామాజిక అభివృద్ధి జరిగేవరకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేఖరుల సమావేశంలో సండ్రపాటి కాలేబుమాదిగ, న్యాయవాది సండ్రపాటి ప్రసాద్‌మాదిగ, వై జయప్రకాశ్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రచారకార్యదర్శి ఎం ఆశీర్వాదం, చాట్ల దానియేల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలే సమైక్య ఉద్యమ సారధులు
విద్యార్థి రిలే దీక్షల సభలో ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు కూలీ ఉద్యమాలు కావని, స్వచ్చంధంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చేస్తున్న ఉద్యమమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ ఎదుట విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన రిలే దీక్షల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమం చూసి అయిన సోనియాగాంధీ మనస్సు కరగలేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని కందుల అన్నారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ప్రజలే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు వారి అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు స్వార్ధపర రాజకీయ నేతలు తమ స్వలాభం కోసం ఉద్యమాలు చేస్తే పాలకులు వారికి అనుగుణంగా నడుచుకొని విభజించడం అన్యాయమని అన్నారు. విభజన జరిగితే విద్యార్థి, ఉద్యోగ, కర్షకులకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ జెఎసి కన్వీనర్ ఒద్దుల వీరారెడ్డి మాట్లాడుతూ సుమారు 60రోజులుగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే సీమాంధ్రకు చెందిన ఎంపిలు ఢిల్లీలో కూర్చోని నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటికైనా వారి నాటకాలను కట్టిపెట్టి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటే రానున్న రోజుల్లో వారికి ప్రజలే పట్టంకడుతారని అన్నారు. బుధవారం దీక్షలో టి ఉమామహేష్, కె నవీన్‌కుమార్, ఎ అజయ్‌కుమార్, కె సాయికుమార్, ఎన్‌వి సురేష్, పి శ్రీనివాసులు, ఎం భరత్‌కుమార్, వై రాము, పి రసూల్‌తోపాటు పలువురు దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటల సమయంలో ఎస్వీకెపి కళాశాల అధ్యాపకులు డి ధర్మానాయక్ నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

మోకాళ్ళపై అర్ధనగ్నంగా న్యాయవాదుల నిరసన
* మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగ జెఎసి
మార్కాపురం, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం మార్కాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోకాళ్ళపై అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పిఎల్ ప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన విరమించుకునే వరకు ఉద్యమం ఆగదన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, ఇతర వర్గాలకు చెందిన కార్మికులు స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మాత్రం కనువిప్పు కలుగలేదని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ పదవులను త్యిజించి ఉద్యమంలోనికి రావాలని సూచించారు.
* మోటారుసైకిల్ ర్యాలీ
ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం కోర్టుసెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలో మోటారుసైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల జెఎసిల ఆధ్వర్యంలో మండలంలోని తిప్పాయపాలెంలో నంద్యాల - గుంటూరు రహదారిపై గ్రామస్థులు ఏర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఉద్యోగ జెఎసి చైర్మన్ బివి శ్రీనివాసశాస్ర్తీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామస్థాయి నుంచి వస్తే బలంగా ఉంటుందని, త్వరలో పట్టణంలో చేపట్టబోయే లక్ష జన గళార్చనకు భారీసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. 60రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వడం కుదరని యాజమాన్యం చెప్పడం అన్యాయమని, వెంటనే బోనస్ ప్రకటించి కార్మికులకు న్యాయం చేయాలని ఆర్టీసీ జెఎసి నాయకులు టి ఉమామహేశ్వరరావు, దస్తగిరిలు డిమాండ్ చేశారు.

టిఆర్‌ఎస్, వైకాపాతో కాంగ్రెస్ కుమ్మక్కు
- మాజీ ఎమ్మెల్యే దివి శివరాం
కందుకూరు, సెప్టెంబర్ 25 : ఓట్లు.. సీట్ల రాజకీయాల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌తో సీమాంధ్ర ప్రాంతంలో వైకాపాతో కుమ్మక్కు అయ్యిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆరోపించారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో లక్ష కోట్లు ప్రజాధనాన్ని వెనకేసుకున్నారని, జగన్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, అయితే ప్రస్తుతం సిబిఐ అఫిడవిట్‌లో 43వేల కోట్ల రూపాయల అభియోగాలను 30 కోట్లకు చేర్చడం వెనుక రెండు పార్టీల అవగాహన ఉందని ఆయన ఆరోపించారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా కేసులో ఎ-1 నిందితుడిగా ఆరోపించబడుతున్న జగన్‌కు బెయిల్ లభించడం, ఎ-2, ఎ-5, ఎ-7గా ఉన్న వ్యక్తులకు బెయిల్ రాకపోవడం విడ్డూరమన్నారు. ఈ తతంగం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందని, రాష్ట్రంలో టిడిపిని నష్ట పరిచేందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
5 నుండి జిల్లాలో చంద్రబాబు ఆత్మ గౌరవ యాత్ర :
టిడిపి రాష్ట్ర అద్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆత్మ గౌరవ యాత్ర వచ్చే నెల 5న జిల్లాలో ప్రారంభం అవుతుందని శివరాం విలేఖర్లకు తెలిపారు. వచ్చే నెల 9న కందుకూరు నియోజకవర్గానికి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేరుకుంటుందని, అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు అంకమ్మ గుడి సమీపంలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చేనెల 10న కందుకూరు, కొండేపి నియోజక వర్గాల టిడిపి కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి ఘట్టమనేని చెంచురామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాదెండ్ల వెంకట సుబ్బారావు, మండల అధ్యక్షులు పొడపాటి వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు నిందితులు అరెస్టు
పెద్దదోర్నాల, సెప్టెంబర్ 25 : మండల పరిధిలోని తుమ్మాపురం గ్రామానికి చెందిన నాగుల పెద్దశీనయ్య కుమారుడు వీరన్న, చిన్న శీనయ్యకుమారుడు వీరన్న అదే గ్రామనికి చెందిన కుడుముల వీరయ్యను ఈనెల 18న గొడ్డిలితో నరికి చంపారు. వై పాలెం సిఐ పాపారావు కథనం ప్రకారం మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగుల వీరన్న, నాగుల వీరన్న అదే గ్రామానికి చెందిన కుడుముల వీరయ్యను తప్పతాగిన మైకంలో గొడ్డలితో ముఖంపై నరికి చంపి మృతదేహాన్ని చెట్టల్లో వేశారు. అయితే ఇద్దరు నిందితులను వైచెర్లొపల్లి మూట్ల వద్ద వున్న మల్లికార్జునపురంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా దొర్నాల ఎసై బివివి సుబ్బారావు, సిబ్బందితో మంగళవారం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నిందితులను ఇద్దరిని బుధవారం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అయితే మృతిచెందిన కుడుముల వీరయ్య 2009లో తన భార్యను, కూతురిని చంపిన కేసులో నిందితుడి ఉన్నాడని, బెయిల్‌పై బయటికి వచ్చాడని ఆయన తెలిపారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు
పెద్దదోర్నాల, సెప్టెంబర్ 25 : మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని నటరాజ్‌సెంటర్లో బుధవారం విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలు బుధవారానికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో షేక్ మహబూబ్‌పీరా, కె వెంకటేశ్వర్లు, డి సుధాకర్, బి శ్రీనివాసులు, ఎస్‌కె మజీద్, సి హెచ్ మహేశ్వర రెడ్డి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. వీరికి సంఘీభావంగా పి మల్లికార్జున నాయక్, శ్రావణికుమార్, కిరణ్‌కిషోర్ కుమార్, కాకర్ల రాజయ్య, ఎస్ సుధాకరరావు, సంసిద్దన్, వర్దన్, నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు. క్రిష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి చెందిన జెఎసి ప్రతినిధి, పదిమంది బైక్ ర్యాలీతో శ్రీశైలంనుంచి దోర్నాలకు వచ్చి దోర్నాల్లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. వీరిలో అంజిరెడ్డి, గిరిధర్, మురళీమోహన్, వెంకటేశ్వర్లు, రమేష్, వీరబాబు, రాజారావు, రమణారావు తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం దోర్నాల సెంటర్లో పండ్ల వ్యాపారులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

105 గంజాయి మొక్కలు స్వాధీనం
బేస్తవారపేట, సెప్టెంబర్ 25: మండలంలోని అటవీప్రాంత గ్రామాలైన నారువానిపల్లి, సింగసానిపల్లి, పొగుళ్ళ గ్రామాల్లో మార్కాపురం ఎక్సైజ్ టాస్క్ఫోర్సు అధికారి నరసింహారావు ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించి 105 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అటవీప్రాంత గ్రామాల్లో వర్షాకాలంలో ప్రభుత్వ బంజారుభూముల్లో, రైతుల పొలాల్లో గంజాయి మొక్కలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పొగుళ్ళ గ్రామానికి చెందిన గొర్ల చెంచయ్య పొలంలో 30మొక్కలను, మిగతా 75మొక్కలను ప్రభుత్వ బంజరుభూముల్లో గుర్తించినట్లు తెలిపారు. చెంచయ్య పారిపోయినట్లు, త్వరలో అదుపులోనికి తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్సు సిబ్బంది మురళీ, ఏడుకొండలు, ఖాజాఖాన్, సాల్మన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయుల రిలే దీక్షలు
బేస్తవారపేట, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు బుధవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు దాదాపు 100మంది మానవహారం నిర్వహించి సమైక్యాంధ్ర పాటలు పాడారు.

రోడ్లు ఊడ్చిన పంచాయతీరాజ్ సిబ్బంది కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం ఒంగోలులో కొవ్వొత్తుల ప్రదర్శన
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>