ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 25: నగరంలోని మిర్చియార్డును తరలించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుధవారం స్ధానిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న మిర్చియార్డు వల్ల పరిసర ప్రాంతాల్లోని 20 వార్డుల ప్రజలు ఇబ్బందులకు గురవౌతున్నారన్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు 15రోజుల్లోగా ఆనువైన ప్రదేశాన్ని కేటాయించాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసిందని తెలిపారు. యార్డుకు సంబంధించి కోల్డ్‌స్టోరేజి, రైతులకు వసతి భవనాలు నిర్మించేందుకు అనువైన ప్రదేశాన్ని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారికి ఇబ్బందులు కలుగకుండ అనువైన స్థలాన్ని కేటాయించాలని సూచించారు. అదే విధంగా నగరంలోని ఆర్‌టిసి బస్టాండ్, చేపల మార్కెట్, కబేళాలను తరలించేందుకు అనువైన స్థలాలను కేటాయించాలన్నారు. అధికారులు చొరవచూపి వెంటనే వాటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విలేఖరులు సమావేశంలో నాయకులు గాజుల ఉమామహేశ్వరరావు, మదార్‌సాహెబ్. నలమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కెటిపిఎస్ స్విచ్‌యార్డ్‌లో సాంకేతికలోపం
పాల్వంచ, సెప్టెంబర్ 25: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెటిపిఎస్ పాత ప్లాంట్ కర్మాగారంలో గల స్విచ్‌యార్డ్‌లో బుధవారం సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో 1220మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. పాత ప్లాంట్ కర్మాగారంలోని స్విచ్‌యార్డ్ ఫీడర్ నుండి మణుగూరుకు వెళ్ళే 220కెవి విద్యుత్ వైర్ తెగి కిందపడడంతో కెటిపిఎస్ పాతప్లాంట్‌లోని 8యూనిట్లలో, 5వదశ కర్మాగారంలోని 9,10 యూనిట్లలో 1220మెగావాట్ల విద్యుదుత్పత్తి స్తంభించింది. స్విచ్‌యార్డ్ నుండి మణుగూరుకు వెళ్ళే 220కెవి విద్యుత్‌వైర్‌కు హైఓల్టేజి రావడం వలన యార్డ్‌లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈకారణంగా 220కెవి విద్యుత్‌వైర్ తెగి కిందపడింది. విషయం తెలుసుకున్న కెటిపిఎస్ అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహించారు. రెండుగంటల వ్యవధిలో మరమ్మతు పనులు పూర్తిచేసి 10యూనిట్లలో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. రెండుగంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో జెన్‌కోకు, ట్రాన్స్‌కోకు సుమారు 50లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అసత్య ఆరోపణలు చేస్తున్న కూనంనేని
* వనమా రాఘవ విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, సెప్టెంబర్ 25: కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తూ నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూనంనేని రాజకీయ లబ్ధికోసం, రానున్న ఎన్నికల్లో గెలవలేననే ఆలోచనతో తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అతని గెలుపు భ్రమగానే ఉండి పోతుందన్నారు. తనపై అధికారులు కేసు పెట్టలేదని, కూనంనేని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని దాన్ని రుజువు చేయాలని సవాల్ విసిరారు. నిజాలు సమాధి చేసే విధంగా అతను మాట్లాడుతున్నాడని కమ్యూనిస్టుకు ఉండవలసిన ఏ ఒక్క లక్షణం కూడా అతనికి లేదని ఆరోపిస్తూ లగ్జరి, నకిలీ కమ్యూనిస్టు అని దుయ్యబట్టారు. అరాచకాలను సృష్టిస్తూ, అధికారులను బెదిరిస్తూ కమ్యూనిస్టు ముసుగులో దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో బలవంతపు వసూళ్ళకు పాల్పడుతూ దోచుకుని దాచుకోవడం తప్ప నియోజక వర్గాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై నిందారోపణలకు పాల్పడుతున్నారన్నారు. కొత్తగూడెంని అభివృద్ధి చేసిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. తన తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొత్తగూడెం అసెంబ్లీని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని, ఎంతటి వారైనా తప్పించుకోలేరని పేర్కొన్నారు. ప్రజల సానుభూతి కోసం తనను పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ నినాదంతోప్రజలను మోసం చేస్తున్న వలసవాది అని, అతన్ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఇకనైన ఆరోపణలు మాని, నిజాలు తెలుసుకొని వ్యవహరిస్తే మంచిదని హెచ్చరించారు. తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు సోమ్లానాయక్, కొత్త సీతారాములు, పొరిక లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
నందిగామలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
భద్రాచలం, సెప్టెంబర్ 25: మండలంలోని నందిగామ గ్రామంలో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయని, కావున తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిపిఎం ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం నందిగామ గ్రామాన్ని బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బృందం నాయకులు మాట్లాడుతూ నందిగామ గ్రామంలో నివసిస్తున్న సుమారు నాలుగు వందల కుటుంబాలకు వైరల్ జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఇద్దరి నుంచి ఐదుగురు వరకు జ్వరాలు, కీళ్లనొప్పులు, ఒంటి నొప్పులతో ఇరవై రోజులుగా బాధపడుతున్నారని, వీరిలో అధిక శాతం వ్యవసాయ కూలీలే ఉన్నారని వాపోయారు. వీరు ఏ రోజు కారోజు కూలి పనులకు వెళ్తే తప్ప కుటుంబాలు గడిచే పరిస్థితి లేదన్నారు.
గ్రామంలో అనారోగ్య సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించి కనీసం సందర్శించిన పాపాన కూడా పోలేదని దుయ్యబట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, ఫ్లోరైడ్ నీటి వల్ల కూడా జ్వరాలు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకూ దాదాపు వంద మందికిపైగా జ్వరపీడితులున్నార న్నారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధవౌతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బృందం నాయకులు ఏజె రమేష్, దాకి శేషావతారం, మర్లపాటి రేణుక, ఎం నాగేశ్వరరావు, జిఎస్ శంకర్‌రావు, ఐవి, అర్జున్, కందుల శ్రీను, సూర్యం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చురుకైన పాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందాలి
భద్రాచలం, సెప్టెంబర్ 25: పంచాయతీల అభివృద్ధితో పాటు నిరుపేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో సర్పంచులు చురుకైన పాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి పి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామ పరిపాలన, చట్టాలు, ఇతర విధి విధానాలపై భద్రాచలంలో డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న సర్పంచ్‌ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలతో సత్సంబంధాలు కల్గి ఉండాలని, స్థానికంగా ఉంటూ సమస్యలు వచ్చినపుడు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను పంచాయతీల్లోని అర్హులైన అభ్యర్థులకు అందేలా చూడాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం భారిన పడకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను పంచాయతీ సమావేశాల్లో చర్చించి ఖర్చు చేయాలన్నారు. ఆదాయ మార్గాలను అనే్వషించి పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, రికార్డుల నిర్వహణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పన్నులు, లైసెన్సు ఫీజులు, లీజుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్థేశిత సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వసూళ్లు చేసిన మొత్తాన్ని తక్షణమే ట్రెజరీలో జమ చేయాలని, అవసరాన్ని బట్టి డ్రా చేసి ఖర్చు పెట్టి ఆ వివరాలను రిజిస్టర్‌లో రాయాలని చెప్పారు. ఆడిట్ అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలని డిపిఓ ప్రభాకర్‌రెడ్డి సర్పంచులను కోరారు. ఈ సదస్సులో డియల్పిఓ ఆర్ ఆశలత, ఎండీఓ సుబ్రమణ్యం, కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఐకెపి ఉద్యోగుల విషయంలో
పాలకుల తీరుపై ఉద్యమించాలి
ఇల్లెందు, సెప్టెంబర్ 25: ఐకెపిలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తిరుగుబాటు ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఇల్లెందులో 5వేల మందికి పైగా మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించిన అనంతరం జరిగిన సభలో రంగారావు మాట్లాడుతూ నామమాత్రంగా వేతనాలు అందిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రుణ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఉన్న 15సమస్యలను పరిష్కరించడంతో పాటు పనిగంటల పనిదినాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా సమస్యల సాధన కోసం శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోనందున ఉద్ధృత స్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రమ, చండ్రా అరుణ, చంద్రశేఖర్, నాయిని రాజు, ప్రసాద్, తుపాకుల నాగేశ్వరరావు, కిరణ్, ఆర్‌ఎస్‌వి బోస్, సారంగపాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.