కర్నూలు, సెప్టెంబర్ 25 : జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. సమైక్యవాదులు తమ ఆకాంక్షను సాధించుకోవడం కోసం అలుపెరగకుండా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఎన్నడూ లేని విధంగా సుధీర్గ సమ్మెలో పాల్గొంటుండటంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యమం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేసేంత వరకూ ఎంత కాలమైనా సమ్మె విరమించేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తెగేసి చెబుతున్నారు. కాగా కర్నూలు నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ, మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు వేర్వేరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన టిడిపి ర్యాలీ నంద్యాల చెక్‌పోస్ట్, కలెక్టర్ కార్యాలయం, వివేకానంద కూడళి, ఆర్టీసీ బస్టాండ్, బళ్లారి చౌరస్తా మీదుగా తిరిగి కార్యాలయానికి చేరుకుంది. మార్కెటింగ్ ఉద్యోగుల ర్యాలీ మార్కెట్ యార్డు నుంచి బళ్లారి చౌరస్తా, వెంకట రమణ కాలనీ, అశోక్ నగర్ మీదుగా తిరిగి మార్కెట్ యార్డుకు చేరుకుంది. వ్యవసాయ శాఖ ఉద్యోగులు రహదారులు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాల నాయకులు, రాయలసీమ హక్కుల వేదిక కార్యకర్తలు చేస్తున్న రిలే దీక్షలు కొనసాగుతుండగా న్యాయవాదుల దీక్షలు 56రోజులు పూర్తి చేసుకున్నాయి. నంద్యాలలో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కెడిసిసి బ్యాంకు వద్ద నమూనా శాసన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాలు ఏంటో ప్రజలకు వివరించారు. ఆదోనిలో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఒంటికి ఆకులు చుట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె తదితర పట్టణాల్లో సమైక్య హోరు జోరుగా నిర్వహిస్తున్నారు.
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు తరలిరండి
నగరంలో 29వ తేదీన నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలిరావాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా మండలాల్లో ఉద్యోగ సంఘం నాయకులు, ఆర్టీసీ కార్మికులు గ్రామాలకు వెళ్లి సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంబంధించిన విషయాలు వివరిస్తున్నారు. నగరంలోని ఎస్టీ, బిసి కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు 50వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో సమైక్య రాష్ట్రం ఉంటే జరిగిన అభివృద్ధితో పాటు రాష్ట్రం విడిపోతే జరుగబోయే నష్టాలను వివరించేలా కళా రూపాలను ప్రదర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఆరోజు సభకు వచ్చే ప్రజలు నగరంలో భోజనం చేయడానికి వీలుగా అన్ని హోటళ్ల వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నట్లు వివరించారు.
బెయిల్‌పై అమెరికాలో డీల్!
* జగన్, సోనియా మధ్య ఒప్పందం : బైరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, సెప్టెంబర్ 25: సోనియాగాంధీ వైద్యపరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో వైకాపా నేత జగన్‌కు బెయిలు ఇప్పించే వ్యవహారంలో ఒప్పందం కుదిరిందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. అమెరికాలో ఒక మతానికి చెందిన గురువులు జగన్‌కు బెయిలు ఇచ్చేలా సిబిఐ సహకరించడానికి సోనియా సాయం కోరినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. కర్నూలులో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్, సోనియాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర విభజనకు జగన్ సహకరించాలని, సమైక్యవాదం పేర జనంలోకి వెళ్లి ఎన్నికల్లో అధికస్థానాలు సాధించి ఎన్నికల అనంతరం రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేందుకు తోడ్పాటునందిచాలని షరతులు విధించినట్లు సమాచారముందన్నారు. సోనియా బెయిలు ఇప్పించేందుకు సహకరించడం, ఆ తరువాత జగన్ సహకారం అందించే విషయంలో ఇరువర్గాలు బైబిల్ మీద ప్రమాణం చేశాయని బైరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ స్థానాలు సాధించి రాయలసీమ, కోస్తాంధ్రలో జగన్ ద్వారా ఎక్కువ స్థానాలు దక్కించుకుని కుమారుడిని ప్రధానిని చేయవచ్చన్న ఊహాగానాల్లో సోనియా ఉన్నారని ఆయన మండిపడ్డారు. అయితే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టి వైకాపా తన గొయ్యి తానే తవ్వుకుందని ఎద్దేవా చేశారు. వైకాపాను ఎన్నికల అనంతరం ఇడుపులపాయలో వైఎస్ సమాధి పక్కనే పూడ్చిపెట్టాల్సిందేనన్నారు. తన ఆరోపణలు అవాస్తవమని ఆ పార్టీ చెప్పదల్చుకుంటే ఎన్నికలకు ముందు, ఆ తరువాత గానీ కాంగ్రెస్‌కు సహకరించే ప్రశే్నలేదని ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కెసిఆర్, జగన్‌తో ఒప్పందం కుదరడంతో ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యవాదులు ఎంత పోరాడినా ఫలితం శూన్యమన్నారు. ఇకనైనా రాయలసీమ గురించి ఆలోచించి ద్రోహులను మట్టికరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
57 రోజులకు చేరిన ఉద్యమం
* మూతబడ్డ ప్రభుత్వ కార్యాలయాలు
* స్తంభించిన రవాణా * పడిపోయిన ఆర్థిక లావాదేవీలు
కర్నూలు, సెప్టెంబర్ 25 : సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ఉద్యమం బుధవారంతో 57 రోజులకు చేరింది. మొదట జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఉద్యమం రానురాను మండలాలు, గ్రామాల్లో సైతం తీవ్రరూపం దాల్చింది. సమ్మె వల్ల రవాణ స్తంభించి ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పడిపోవడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగలు సమ్మెలో భాగంగా విధులకు గైర్హజరు కావడంతో దాదాపు రెండు మాసాల నుండి జీతాలు రాలేదు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతబడటంతో కార్యాకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు ప్రతిరోజు ఉద్యమంలో పాల్గొంటున్నారు. కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొటంతో దాదాపు 45 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు వివిధ వాహనాలను విచ్చలవిడిగా తిప్పుకుంటూ ప్రజలు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇక విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్ధ సంవత్సరం పరీక్షలు దగ్గర పడటంతో సిలిబస్ పూర్తి కాక విద్యార్థులు ఆందోళన చేందుతున్నారు. ప్రతిరోజూ రహదారుల దిగ్బంధం, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా హోరెతుతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే దసరా పండుగ జరుపుకోవడం కష్టంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.
నందికొట్కూరులో...
నందికొట్కూరు : సమైక్యాంధ్ర కోరుతూ బుధవారం నందికొట్కూరు జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో హిజ్రాలు మాధురి, రాజేశ్వరి కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. హిజ్రాల దీక్షలకు వివిధ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రాజశేఖరరెడ్డి, సత్యనారాయణ, పి.రాముడు, ఎ.రాముడు, మహేశ్వరప్ప, శీలం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం పటేల్ సెంటర్‌లో కుండలు తయారు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ సుబ్బరాయుడు, తలముడిపి సర్పంచ్ రామచంద్రుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే అన్ని రంగాల్లో సీమ వాసులు వెనుకబడుతారన్నారు. ముఖ్యంగా విద్యార్థులపై పడుతుందన్నారు. వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి తలముడిపి గ్రామ సర్పంచ్ రామచంద్రుడు మద్దతు పలికి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోకిల రమణారెడ్డి, ఐజయ్య, రవీంద్రారెడ్డి, మునాఫ్, నాగయ్య పాల్గొన్నారు.
జెఎసి నాయకుల అరెస్టు
నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేసిన సంఘటనలో ఎస్‌పి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు జెఎసి నాయకులు రవికుమార్, శ్రీనివాసరెడ్డి, చింతా విజయకుమార్‌ను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
ఆళ్లగడ్డలో...
ఆళ్లగడ్డ : సమైక్యాంధ్ర కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో బుధవారం హమాలీలు రిక్షాలతో ర్యాలీ నిర్వహించారు. జెఎసి నాయకులు దస్తగిరిరెడ్డి, వరప్రసాదరెడ్డి, సుబ్బారావు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుండి సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలను రిక్షాలకు కట్టి ఊరేగించారు. ర్యాలీ పాతబస్టాండ్ మీదుగా గాంధీసెంటర్, నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తర్వాత సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలకు దగ్ధం చేశారు. ఇకపోతే నేడు పట్టణంలో జరగబోయే మహిళా గర్జనకు అధిక సంఖ్యలో మహిళలు తరలిరావాలని జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. అలాగే ఆళ్లగడ్డ జెఎసి నాయకులకు వైద్యులు రూ. 30 వేలు విరాళంగా అందించారు. ముందుగా గాంధీ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయులు విగ్రహానికి పూలమాలవేసి అనంతరం విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీరామ్‌రెడ్డి, సురేంద్రనాధరెడ్డి, జెఎసి నాయకులు వరప్రసాదరెడ్డి, భార్గవరామయ్య, శ్రీనివాసులు, విశ్వనాథ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆనాథ అని నమ్మించాడు..
* పెళ్ళి చేసుకుని మోసం చేశాడు.
* బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
ఆదోని, సెప్టెంబర్ 25 : ఆదోని డివిజన్‌లోని విరుపాపురం గ్రామానికి చెందిన గాజులమల్లికార్జున తిరుపతిలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో తిరుపతికి చెందిన ఓ అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకొని ఆరు నెలల క్రితం రెవెన్యూ శాఖలో ఉద్యోగం రావడంతో గ్రామానికి వచ్చి మరో పెళ్ళి చేసుకొని ఆమెను మోసం చేయడమేకాకుండా చిత్రహింసలు పెట్టడంతో దగా పడ్డ బాధితురాలు నిందితుడు మోసాన్ని తెలుసుకొని ఆదోని తాలూక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిపై కేసు పెట్టినట్లు తాలూక ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. బాధితురాలు తిరుపతిలోని మారుతినగర్‌లో నివాసం ఉంటుంది. 2009లో మల్లికార్జున తిరుపతిలోని ఒక ప్రైవేట్ కంపెనీలోపని చేస్తూ బాధితురాలి సోదరునికి స్నేహితుడిగా ఆ ఇంటికి పరిచయం అయ్యాడు. తాను అనాథ అని, తనకు ఎవ్వరు లేరని ఆ కుటుంబాన్ని నమ్మించి అమ్మాయిని 2009లో పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగ రిత్యా ఇతర ఊర్లకు క్యాంపు వెళ్ళ్తున్నాని చెప్పి స్వగ్రామమైన విరుపాపురంకు వచ్చి దొంగచాటుగా వెళ్లివచ్చేవాడు. ఈ విషయం తెలియని బాధితురాలు చాలాసార్లు ఫోన్లు చేసిన మల్లికార్జున మాయమాటలతో నమ్మించేవాడు. అయితే ఇక్కడ విరుపాపురంలో వారి తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయాన్ని మొదటి భార్యకు తెలియకుండా దాచిపెట్టాడు. చివరికి ఒక రోజు ఫోన్ చేసి తాను మల్లికార్జున భార్యని బాధితురాలు ఫోన్లో మాట్లాడుతున్న మహిళకు చెప్పింది. అయితే ఇవతల ఫోన్లో మాట్లాడిన తాను కూడా మల్లికార్జున భార్య అని చెప్పడంతో అసలు విషయం బయట పడింది. ఈ సమయంలోనే ఆరు నెలల క్రితం మల్లికార్జునకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హొళగుంద తహశీల్దార్ కార్యాలయంలో అతడు పని చేస్తున్నాడు. తాలూక ఎస్‌ఐ నిందితుడిపై 498 ఏ,494,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
* డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
ఆదోని, సెప్టెంబర్ 25: కన్యాకుమారి నుంచి ముంబాయి వెళ్లే జయింతి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌లో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బుధవారం నగరూరు స్టేషన్ వద్ద కొంత సేపు నిలిపివేశాడు. అనంతరం రైలును ఆదోని స్టేషన్ వరకు తీసుకొని వచ్చి అక్కడ మరమ్మతులు చేసుకొని రైలును యథావిధిగా ప్రయాణం సాగించారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట, 2 గంట్ల మధ్యలో నగరూరు స్టేషన్ వద్ద పొగలు వస్తున్న గమనించిన డ్రైవర్ అక్కడ కొద్దిసేపు నిలచి పొగలు రాకుండా సరి చేసుకున్నాడు. అనంతరం ఆదోని స్టేషన్ వరకు రైలును అలాగే నడుపుకుంటూ వచ్చి స్టేషన్‌లో నిలిచి తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నాడు. బ్రెకుల వల్ల పొగలు వచ్చినట్లు డ్రైవర్ గమనించాడు. డ్రైవర్ గమనించడంతో పొగలు మంటలు కాకుండా నివారించడంతోప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నట్లు పలువురు ప్రయాణికులు చెప్పారు.
జగన్ బెయిల్‌తో కాంగ్రెస్, వైకాపా రాజకీయ ఒప్పందం
* ఎమ్మెల్యే కెయి ప్రభాకర్
కల్లూరు, సెప్టెంబర్ 25 : ఇంత కాలం జైల్లో ఉన్న జగన్‌కు బెయిల్ రావడంతో కాంగ్రెస్, వైకాపా రాజకీయ ఒప్పందాలు బయటపడినట్లు అయ్యాయని పత్తికొండ ఎమ్మెల్యే కెయి ప్రభాకర్ అన్నారు. బుధవారం కాంగ్రెస్, వైకాపా కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెయి మాట్లాడుతూ తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టి తెలంగాణ ప్రకటన చేసిన వెంటనే టిఆర్‌ఎస్ వీలీనం గురించి, అదే విధంగా వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ డిఎన్‌ఎ అంటూ మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించాడు. సిబిఐని అడ్డు పెట్టుకుని బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం జరుగబోయే ఎన్నికల అనంతరం వైకాపాను కాంగ్రెస్‌లో వీలీనం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపిని దెబ్బతీసేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో, సీమాంధ్రలో వైకాపాతో కుమ్మకై విలువల్లేని రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి అన్నదమ్ముల్లాంటి తెలంగాణ సీమాంధ్ర ప్రజలను బలి పశువులను చేసిందన్నారు. ఇంతకాలం జగన్‌కు బెయిల్ రాకుండా చేసింది కాంగ్రెసేనని, అయితే రాజకీయ ఒప్పందాలు కుదరడంతో ఇప్పుడు ఇవ్వడానికి సిబిఐ ముందుకు వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సిబిఐతో కలిసి అడుతున్న నాటకాలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని, వీలైనంత త్వరలో ప్రజాగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎంతో అత్యున్నత స్థానంలో ఉన్న సిబిఐ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకోవడం దారుణమన్నారు. ఇకపోతే ఇప్పటికైన అటూ తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రజలను విభజనపై మభ్య పెట్టకుండా ప్రజలకు ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రజాధరణను చూసి ఓర్వలేక ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని జిమ్మిక్కులు చేస్తోందన్నారు. పార్టీలను మోసం చేసినట్లు ప్రజలను మోసం చేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అకేపోగు ప్రభాకర్ రెడ్డి, ధనారెడ్డి, పుల్లారెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, పర్వేజ్, జేమ్స్, హవిలాన్ బాబు, తిరుపాల్ బాబు, హనుమంత రాయచౌదరి, బాబురాజు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులను ఆదుకుంటాం
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
ఆత్మకూరు రూరల్, సెప్టెంబర్ 25 : గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు వలలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మకూరు మండలంలోని బైర్లూటి, నాటలూటి, పెచ్చెరువు గూడెం, కొత్తపల్లె మండలంలోని యర్రమఠం చెంచుగూడెంలో నివసిస్తున్న 41 మంది గిరిజనులకు చేపలు పట్టే వలలలను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గూడెంల సమీపంలో ఉన్న చెరువుల్లో చేప పిల్లలను మత్స్యశాఖ వదిలి పెట్టిందన్నారు. వీటిని పట్టుకోవడానికి మత్స్య శాఖ చేపలను పంపిణీ చేసిందన్నారు. వీటి ద్వారా గిరిజనులకు జీవన భృతి ఏర్పడుతుంద్నారు. అలాగే గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈయన వెంట సీఇఓ సూర్యప్రకాష్, ఎంపీడీవో శశికళ, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌యు హాస్టల్ విద్యార్థుల
సమస్యలు పరిష్కరించాలి
* ప్రధాన కార్యాలయం ఎ
దుట ధర్నా
కర్నూలు స్పోర్ట్స్, సెప్టెంబర్ 25 : రాయలసీమ యూనివర్శిటీలోని హాస్టల్‌లో నెలకున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్శిటీ ప్రధాన పరిపాలన కార్యాలయం ఎదుట ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థులు బైటాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ వర్శిటీ అధ్యక్షులు సుబ్బరామయ్య మాట్లాడుతూ హాస్టల్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా హాస్టల్‌లో ఫ్రీ ఫుడ్ వర్కర్స్, వాచ్‌మెన్ లేరన్నారు. అలాగే జూనియర్ విద్యార్థులకు రూమ్లు కేటాయించకపోవడంతో ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకుందన్నారు. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రిజీస్ట్రార్, వార్డెన్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. అనంతరం రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన రిజీస్ట్రార్ చారి మాట్లాడుతూ త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ ఎన్‌టికే నాయక్ సమక్షంలో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో లక్ష్మణ్, బడెసాహెబ్, వెంకటేష్, సూర్యప్రకాష్, కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.