Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజిస్తే దౌర్భాగ్యం.. సమైక్యతే సౌభాగ్యం

$
0
0

గుంటూరు, సెప్టెంబర్ 25: రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకెళ్లాలన్నా... రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నా.. ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ప్రకాశించాలన్నా.. రైతుల జీవితాలు పాడిపంటలతో వెలుగొందాలన్నా సమైక్యమే మార్గమని సమైక్యవాదులు కాంక్షిస్తున్నారు. అలాకాక కొందరు రాజకీయ నిరుద్యోగుల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేస్తే గాడాంధకార మయమవుతుందని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ, సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం బుధవారం నాటికి 57వ రోజుకు చేరుకుంది. కేంద్రం సమైక్యాంధ్ర నినాదానికి తలొగ్గే వరకూ పోరు విరమించేది లేదంటూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దాదాపు రెండ్నెల్లుగా ఇబ్బందులు పడుతూనే ఎలాగైనా విభజనను అడ్డుకోవాలన్న దీక్షతో అన్ని వర్గాలూ సమైక్య బాట పట్టి ఉద్యమానికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు ఉదయం నుండే పలు విద్యాసంస్థల బస్సులను అడ్డుకున్నారు. తెనాలి రోడ్డు, మణిపురం బ్రిడ్జి ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు, ఆటోలు, లారీలను అడ్డుకుని సుమారు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ పాఠశాలను మూయించివేశారు. ఈక్రమంలో ఓ పాఠశాల ఉద్యమానికి మద్దతు పలకకుండా తెరిచి ఉండటంతో పాటు బంద్ చేయించేందుకు వచ్చిన నాయకులపై దాడికి పాల్పడటంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు మండూరి వెంకటరమణ, రావిపాటి సాయికృష్ణ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఏన్జీవోలు స్థానిక కలెక్టరేట్ నుండి హిందూ కళాశాలలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ నల్లబెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. బెలూన్లను గాలిలోకి వదులుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు ఉద్యమంలో భాగంగా డిఆర్‌డిఎ కార్యాలయ ప్రాంగణంలో క్రీడలతో నిరసన తెలిపారు. హిందూ కళాశాల సెంటర్‌లోని అమరజీవి విగ్రహం వద్ద సమైక్యవాదులు రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సమ్మెబాట పట్టిన మార్కెట్‌యార్డు వ్యాపారులు, ఉద్యోగులు ఆందోళనలో భాగంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. సిటీ బస్సుల యజమాన్యాలు సమైక్య బాట పట్టారు. రెండు రోజుల బంద్ పిలుపులో భాగంగా ఎక్కడి బస్సులను అక్కడే నిలిపి వేసి తమ నిరసన తెలియజేయడంతో పాటు ఖాళీ బస్సులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అలాగే గ్రంథాలయ శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఉద్యమానికి పలుకుతూ దీక్షలను లక్ష్యసాధన దిశగా కొనసాగిస్తున్నారు.

లింగాపురం వద్ద కుడికాలువకు గండి
* వృథాగా పోతున్న నీరు * అధికారుల నిర్లక్ష్యం తీరు!
మాచర్ల, సెప్టెంబర్ 25: కెనాల్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుడికాలువకు మాచర్ల పట్టణ శివారులోని లింగాపురం కాలనీ సమీపంలో గండ్లుపడి నీరు వృథాగా పోతున్న సంఘటన బుధవారం వెలుగు చూసింది. సుమారు 3మీటర్ల ఎత్తు, 3మీటర్ల వెడల్పులో గండి పడటాన్ని ఉదయానే్న కుడికాలువలో ఈతకు వచ్చే వారు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతిరోజూ కాలువ గట్టుపై పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే కుడికాలువకు లింగాపురం గ్రామ సమీపంలో మూడుచోట్ల గండ్లు పడ్డాయని కుడికాలువ గండ్లు వల్ల కోతకు గురైన పొలాల రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా కాలువ గట్లపై నీళ్ల ఇంజన్లు వేసి పైరుకు నీరుపెట్టుకుంటే వేధింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసే అధికారులు కాలువ గట్టు పటిష్ఠతపై నిఘా ఉంచకపోవడం దారుణమన్నారు. నిఘా కొరవడిన కారణంగానే గండ్లుపడి వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని వారు ఆరోపించారు. రాత్రికి రాత్రి పడిన గండికాదని గత కొన్నిరోజులుగా పడిన చిన్నరంధ్రాలు క్రమేపి పెరిగి కాలువకోత వేసేంత వరకు పెరిగిందన్నారు. కుడికాలువకు గండిపడిన విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్సూర్, సీఈ యల్లారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకు ముందు ఎస్‌ఈ ఎంఎస్ నాయుడు, డీఈ వెంకటేశ్వరరావు గండిని పూడ్చేందుకు కుడికాలువ నుంచి నీటి విడుదల నిలుపుచేశారు. మూడు రోజుల్లో నీటి విడుదల పునరుద్ధరిస్తామని ఎస్‌ఈ నాయుడు తెలిపారు.

కాంగ్రెస్‌ది జగన్నాటకం
* బెయిల్ కోసం జగన్ పౌరుషాన్ని తాకట్టుపెట్టారా * గురజాల ఎమ్మెల్యే యరపతినేని
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 25: తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుని, సీమాంధ్రలో వైఎస్‌ఆర్ సిపితో పొత్తులు పెట్టుకుని ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ జగన్నాటకం ఆడుతోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికే సోనియాగాంధీ సిబిఐని పావుగా వాడుకుని జగన్‌కు బెయిల్ ఇచ్చిందని ఆరోపించారు. ఇటలీ మాఫియా, ఇడుపుల మాఫియాకు లింకు కుదిరిందని, తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. మాట తప్పం, మడమతిప్పం అని కడప పౌరుషానికి, ఢిల్లీ పౌరుషానికి మధ్య సవాల్ అంటూ ప్రతిజ్ఞలు చేసిన జగన్ బెయిల్ కోసం తమ పౌరుషాన్ని తాకట్టుపెట్టారా అని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి రాకముందే కేంద్రంలో రైల్వే, వ్యవసాయ శాఖ మంత్రి పదవులను తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఏ ప్రభుత్వంలో మీరు పదవులు తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్టప్రతిని కలిసేందుకు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన సతీమణులు వెళ్లారని, త్వరలో భర్తలు కూడా కలిసి వెళతారన్నారు. ఆ రెండు పార్టీలకూ కాలం చెల్లిందన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణకు వైఎస్ రాజశేఖరరెడ్డి బీజం వేయగా నేడు విషవృక్షంగా ఎదిగిందన్నారు. అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ సిపి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించడం గాంధీని అవమానపర్చడమే అవుతుందన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, వెన్నా సాంబశివారెడ్డి, లాల్‌వజీర్, మానుకొండ శివప్రసాద్, చిట్టాబత్తిన చిట్టిబాబు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఉండమ్మా బొట్టుపెడతామంటున్న అంగన్‌వాడీలు
తాడికొండ, సెప్టెంబర్ 25: ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళలను ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ఉండమ్మా బెట్టు పెడతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మండల కేంద్రమైన తాడికొండ గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ మహిళలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే గుంటూరులో జరిగే మహిళా గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడికొండ, బడేపురం గ్రామాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొన్నం వ్యాఖ్యలకు వినూత్న నిరసన
తెనాలి, సెప్టెంబర్ 25: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ తరహాలో ఉద్యోగ ఉద్యమ జెఎసి నాయకుడు అశోక్‌బాబు హుందాగా వ్యవహరిస్తుంటే ఆయన నాలుక కోస్తామంటూ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఎంపి పొన్నం ప్రభాకర్ నోటికీ, అశుద్ధం తినే వరాహం నోటికీ తేడా లేనట్లుగా ఉందని తెలిపేలా సమైక్యవాదులు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. డాక్టర్ జె.కోటినాగయ్య ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ వహాహాన్ని పొన్నం ప్రభాకర్‌తో పోల్చుతూ వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఈక్రమంలో డాక్టర్ కోటినాగయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వాసులు హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులపై చేస్తున్న వ్యాఖ్యలు విద్వేషాలను పెంచేవిగా ఉన్నాయన్నారు. రాష్ట్ర సమైక్యత వల్ల ఇరుప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, విభజన వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రజల పక్షాన చేస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోయేది కానుందన్నారు. గాంధేయవాదంతో అశోక్‌బాబు ఉద్యమాన్ని నడిపిస్తున్న తీరు ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. అశోక్‌బాబు నాలుక కోస్తామంటూ పొన్న ప్రభాకర్ వ్యాఖ్యానించడం ఈప్రాంతం వారిని రెచ్చగొట్టే విధానంగా ఉందన్నారు. వినూత్న ప్రదర్శనలో సమైక్యవాదులు తమ సమైక్యతను చాటుతు నినాదాలు చేశారు.

శరన్నవరాత్రులకు శివాలయం ముస్తాబు

పెదకాకాని, సెప్టెంబర్ 25: దేవీ శరన్నవరాత్రులకు పెదకాకాని శివాలయాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేస్తున్నట్లు దేవాలయ పాలకమండలి చైర్మన్ కాజ అంకమ్మరావు తెలిపారు. ఆలయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించడం జరుగుతుందని, దేవాలయానికి విద్యుత్ దీపాలంకరణతో నూతన శోభ కల్గిస్తున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఏసీ ఈమని చంద్రశేఖరరెడ్డి, పాలకమండలి సభ్యులు కరణం సాంబశివరావు, ఆత్మకూరి వెంకటేశ్వర్లు, దొడ్డక బ్రహ్మయ్యస్వామి, పెండెం విజయబాబు, దూపాటి వెంకట్రావ్, సంజయ్, అమ్మణి, శశికుమార్, ఎక్స్ అఫిషియో సభ్యులు పేటేటి ధనామహేశ్వరప్రసాద్ పాల్గొన్నారు.

విభజనతో శాంతికి విఘాతం
యడ్లపాడు, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన శాంతికి, అభివృద్ధికి విఘాతమని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యడ్లపాడు శాఖ మేనేజర్ వి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన యడ్లపాడులో ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. మండల విద్యాశాఖ అధికారి కె లక్ష్మి, జెఎసి అధ్యక్షుడు పేరిరెడ్డి తదితరులు సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారు. ఉపాధ్యాయులు ముగ్గులు వేయడం, తాడులాగడం, కుర్చీలాట తదితర క్రీడలతో నిరసన వ్యక్తం చేశారు. మండల విద్యాసంస్థల అధినేతలు వావిలాల చలపతిరావు, రాజరాజేశ్వరి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అమర్‌నాధ్, జెవిఎస్ ప్రసాద్, కాసు రామిరెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ వద్ద వ్యాయామ కళాశాల విద్యార్థుల నిరసన
నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహరదీక్షలు 38వ రోజుకు చేరుకున్నాయి. జెఎసి చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం భారీర్యాలీ నిర్వహించారు. తొలుత వర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నుండి ప్రదర్శనగా వర్సిటీ ప్రధానద్వారం వద్ద ఉన్న ఐదవనెంబర్ జాతీయ రహదారిపైకి చేరుకుని పలు క్రీడాంశాలను ప్రదర్శించి నిరసన తెలిపారు. రాష్ట్ర విచ్ఛిన్నాన్ని నిరసిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్‌లు పలువురిని విశేషంగా ఆకర్షించాయి. అనంతరం విద్యార్థులు రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ జెఎసి నాయకులు ఆచార్య జి రోశయ్య, డాక్టర్ జి రోశయ్య, డాక్టర్ పి జాన్సన్, మండే సుధాకర్, రాజు, సుబ్బారావు, కోడూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
బొట్టుపెట్టి ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్న ఉద్యోగినులు
మంగళగిరి, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం మంగళగిరి పట్టణంలో మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ఉద్యమంలోకి ఆహ్వానించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి మహిళలను కోరారు. సిడిపిఓ కె ప్రవీణ, రత్నాంజలి తదితరులు పాల్గొన్నారు. నాన్ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యాన స్థానిక అంబేద్కర్ విగ్రహం సెంటర్లో 51వ రోజు రిలేదీక్షలో వి చంద్రశేఖర్, రాజేష్, ఎం మాణిక్యం, కెఎస్ వంశీ, కెఎస్ కృష్ణ, కె రామ్‌జీ, సిహెచ్ విజయ్ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, శౌరి ప్రారంభించారు. జెఎసి కన్వీనర్ ఎ శ్రీహరినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, కెఎస్ మల్లేశ్వరరావు, సోషల్ వర్కర్ గోలి లక్ష్మీకాంతారావు, భాస్కర్, రంగిశెట్టి పెద్దబ్బాయి, ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. విద్యార్థులు, సమైక్యవాదులు అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఒంటికాలిపై మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. బలహీన వర్గాల జెఎసి ఆధ్వర్యాన గౌతమబుద్ధ రోడ్డుపై గడ్డి తింటూ నిరసన తెలిపారు. రోడ్డుపై గుంజీలు తీస్తూ కళ్లు మూసుకుని వెనక్కి నడుస్తూ విద్యార్థులు విభజనకు నిరసన తెలిపారు. శ్రీనివాసరావు, సలీం, నరేంద్ర, అన్వర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

అడిగొప్పల సర్పంచ్‌పై
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దాడి
* కారు అద్దాలు ధ్వంసం
దుర్గి, సెప్టెంబర్ 25: పాతకక్షల నేపథ్యంలో మండలంలోని అడిగొప్పల సర్పంచ్ వలపా చిన్నరాములుపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు దాడి చేయడంతోపాటు కారు అద్దాలను కూడా ధ్వంసం చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వలపా చిన్నరాములు సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో ప్రత్యర్థి పార్టీనాయకులు కక్ష పెంచుకుని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుండి విడుదలైన నేపథ్యంలో ఇదే అదునుగా భావించి సర్పంచ్ చిన్నరాములు ఇంటిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడిచేశారు. చిన్నరాములుపై వైఎస్సార్‌సీపీకి చెందిన గోర్ల వీరవెంకయ్య, బత్తుల కోటేశ్వరరావు, మారబోయిన వెంక య్య, చల్లా హనుమంతరావు, షేక్ బాజీ, తాళ్ళ అంబారావు, గల్లా వెంకయ్య, రంగా శ్రీనుతోపాటు మరికొంతమంది ఉన్నారు. సర్పంచ్ చిన్నరాములు ఇచ్చిన ఫిర్యాదుమేరకు స్థానిక ఎస్‌ఐ పి కృష్ణయ్య కేసునమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచ శాంతి ర్యాలీ
అచ్చంపేట, సెప్టెంబర్ 25: ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అచ్చంపేటలో గల జడ్పీ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థుల చేత ప్రపంచ శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు కమతం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రజలందరూ శాంతియుతంగా జీవించడమే ప్రపంచ శాంతికి తార్కాణమన్నారు. ప్రపంచ దేశాలూ శాంతితో వెల్లివిరియడానికి మానవాళి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల ప్రపంచ శాంతి ర్యాలీని సర్పంచ్ వెంకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా చైర్మన్ కంభాల వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకయ్య, కార్యదర్శి పి శ్రీనివాసరావు, పొనె్నకంటి వెంకట రామారావు, కె గురుప్రసాద్, జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జయలక్ష్మి, ఉపాధ్యాయులు రంగారావు, సిహెచ్ సురేష్, వీరయ్య, దాసుబాబు, రత్నం తదితరులు పాల్గొన్నారు.
పేరేచర్లలో పశువైద్య శిబిరం
మేడికొండూరు, సెప్టెంబర్ 25: గాలికుంటు వ్యాధి వలన మండలంలోని పేరేచర్లలో 60 పశువులు మృతి చెందడంతో పశుసంవర్థక శాఖ అధికారులు బుధవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధుల వల్ల శ్వాసకోశ వ్యాధులు సోకి పశువులు మృతి చెందాయని, పోస్టుమార్టం జరిపి నివేదికల కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామని ఎడి నరసింహం తెలిపారు. పశువైద్య శిబిరంలో 125 పశువులకు ఉచితంగా వైద్యసేవలు అందించారు. పశువులు మృతిచెందిన యజమానులు క్రాంతి పథం కింద 50 శాతం సబ్సిడీపై పశువులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిబిరంలో మేడికొండూరు పశువైద్యాధికారి కె కబ్బిరెడ్డి, ఫిరంగిపురం పశువైద్యాధికారి ఈశ్వర్‌రెడ్డి, పేరేచర్ల అసిస్టెంట్ బ్రహ్మయ్య సేవలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అప్పికట్ల దేవరకొండ వెంకటస్వామి, మాజీ జడ్పీటీసి పాములపాటి శివన్నారాయణ, రైతులు పాల్గొన్నారు.
టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు
మంగళగిరి, సెప్టెంబర్ 25: వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో జగన్ అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బుధవారం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో 206 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. తోట శ్రీనివాసరావు, తెల్లమేకల సాంబశివరావు, బుల్లబ్బాయి, కృష్ణారెడ్డి, ఈపూరి రమేష్, సుల్తాన్, పాపయ్య, శివ, ఫిరోజ్, జలసూత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
గుంటూరు (రూరల్), సెప్టెంబర్ 25: ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశం బుధవారం ఛాంబర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో 2013-14 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆతుకూరి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా టి నాగేశ్వరరావు, జి శివన్నారాయణ, వి కృష్ణమూర్తి, సిహెచ్ లోకేశ్వరరావు, డి సుబ్బారావు, జి రామయ్య, కార్యర్శులుగా అన్నా పూర్ణచంద్రరావు, ఆర్ బాలకృష్ణ, ఎ సాంబశివరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 29 మందిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల వ్యాపారస్తులు నష్టపోతున్నా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పాల్గొనడం సంతోషకరమని అభినందనలు తెలిపారు.
రాష్టస్థ్రాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
గుంటూరు (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: వరంగల్ పట్టణంలో ఈనెల 27,28,29 తేదీల్లో జరగనున్న రాష్టస్థ్రాయి జూనియర్ అథ్లెటిక్ మీట్‌లో గుంటూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ తరపున సాహితీ అకాడమీ క్రీడాకారులు 18 మంది ఎంపికయ్యారని అకాడమీ కార్యదర్శి ఆర్ శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ వద్ద జరిగిన సభలో చార్టర్డ్ ఎకౌంటెంట్ ఎన్ అంజిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ జిల్లా గవర్నర్ రామ్మోహనరావు, అధ్యక్షుడు నరసింహారావు, కోటిరెడ్డి, అకాడమి మేనేజర్ సాంబశివరావు తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
సమైక్యోద్యమానికి వస్త్ర వ్యాపారుల సంపూర్ణ మద్దతు
గుంటూరు, సెప్టెంబర్ 25: సమైక్య రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు, చేనేత కార్మికులు పూర్తి మద్దతు ప్రకటించారని ది గుంటూరు టెక్స్‌టైల్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం మల్లేశ్వరరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా వస్త్ర వ్యాపారులు, చేనేత కార్మికులు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దాదాపు కోటి 50 లక్షల మందికి పైగా వస్త్ర వ్యాపారులు, చేనేతలు, సిబ్బంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారని, త్వరలో సమైక్యానికి మద్దతుగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో జి రాబర్డ్‌విల్సన్, సీతారామిరెడ్డి పాల్గొన్నారు.
రేపు మంగళగిరిలో భూ సదస్సు
మంగళగిరి, సెప్టెంబర్ 25: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భూ సంస్కరణల విధాన ముసాయిదా పత్రంపై వ్యవసాయ కార్మికసంఘం మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీన స్థానిక సిపిఎం కార్యాలయంలో భూ సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం డివిజన్ కార్యదర్శి ఎం రవి బుధవారం తెలిపారు. రాష్ట్ధ్య్రాక్షుడు పి మురళీకృష్ణ, జిల్లా నాయకులు అన్నపురెడ్డి కోటిరెడ్డి తదితరులు ప్రసంగిస్తారని, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని, తుళ్లూరు, అమరావతి, తాడికొండ మండలాల పరిధిలోని వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని రవి కోరారు.
జాతిపిత స్ఫూర్తితో గాంధీతత్వ విశ్వవిద్యాలయ విస్తృత కార్యక్రమాలు
గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 25: అఖండ భరతావని అన్ని రంగాల్లో పురోగతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతో జాతిపితను స్ఫూర్తిగా తీసుకుని మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయ ఆకాంక్ష సమితి విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సమితి నిర్వాహకులు వెల్లడించారు. బుధవారం అరండల్‌పేటలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రొఫెసర్ ఎనిశెట్టి సాంబశివరావు, కొంజేటి శివనాగప్రసాద్, భవిరిశెట్టి కృష్ణమూర్తి, ఎంవి రమణరావు తదితరులు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం మనదేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి విముక్తిపొందడానికి మహాత్ముని శాంతిమార్గమే శరణ్యమన్నారు. ఈ లక్ష్యసాధనలో భాగంగా పూజ్య బాపూజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 29న తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని అన్నా శ్రీనివాసరావు కల్యాణ మండపంలో సమరయోధుడు పావులూరి, మండలి బుద్ధప్రసాద్ వంటి ప్రముఖులతో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ స్థాయిలో జరిగే కార్యక్రమంలో నగరపాలక సంస్థ పరిధిలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు విభిన్న అంశాలపై పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
* రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి ఆదేశం
గుంటూరు, సెప్టెంబర్ 25: ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాదు నుండి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఏడవ విడత భూ పంపిణీకింద జిల్లాలో 80 గ్రామాల్లో 2,050 ఎకరాల భూమిని 1065 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సులలో 35,333 దరఖాస్తులు రాగా 30 వేల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి జెసి డి మురళీధర్‌రెడ్డి, గుంటూరు ఆర్‌డిఒ బి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

* 57వ రోజుకు చేరిన ఉద్యమం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>